ఉద్యోగ సంఘాల నాయకుల ఆగ్రహం
అమరావతి: ఏపీలో గత మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఏపీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదని వాపోయాయి. పీఆర్‌సీ నివేదిక ఇవ్వకపోవడంపై నిన్న భగ్గుమన్న పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
‘‘సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మరిచారు. మంత్రుల కమిటీ.. అధికారుల కమిటీ అన్నారు. కమిటీలతోనే సరి.. నివేదికలు రాలేదు. కమిటీ నివేదికలోనూ ఆలస్యం చేస్తూ వచ్చారు. ఒక్క రోజు ఆలస్యం లేకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. 6నెలల తర్వాత అధికారుల కమిటీ నియమించారు. కమిటీలన్ని కాలయాపనకే తప్ప చిత్తశుద్ధి లేదు. ఏడు నెలల నుంచి ఏం అధ్యయనం చేశారు. సీఎంవో అధికారులు, సజ్జల ఇచ్చిన హామీలు తక్షణమే తేల్చాలి. హెల్త్ కార్డు అనారోగ్య కార్డుగా మారింది. డబ్బు పెట్టుకుని వైద్యం చేయించుకున్నాక రీయింబర్స్‌మెంట్ వచ్చే పరిస్థితి లేదు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.23కోట్లు ఉన్నాయి’’ అని ఏపీ రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
‘‘పెండింగ్ బిల్లులు కచ్చితంగా ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు. నిన్నటి సమావేశంలో పీఆర్సీపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. అన్ని సమస్యలపై రెండు ఐకాసలు సుదీర్ఘంగా చర్చించాయి. రెండు ఐకాసలు కలిపి సుమారుగా 200 సంఘాలు ఉన్నాయి. పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ మిగింది. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ నెల 27 లోపు ఏపీ ఎన్జీవో సంఘం సమావేశమవుతుంది. ఈ నెల 28న ఏపీ ఐకాస సమావేశాలుంటాయి. ఉమ్మడి సమావేశాల అనంతరం సీఎస్‌కు ఇచ్చే మెమోరాండంపై నిర్ణయం తీసుకుంటాం. అందులో పూర్తి వివరాలిస్తాం. మా డబ్బులు మాకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా. మాటలతో కాలయాపనే తప్ప ఒరిగిందేమీ లేదు’’ అని ఉద్యోగ సంఘ నాయకులు వ్యాఖ్యలు చేశారు.