ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89సంవత్సరాలు. శనివారం ఉదయం లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా రోశయ్య పనిచేశారు.
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పటికీ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు.ఆర్థికమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.
2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.
2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, రోశయ్యకు స్వర్ణ కంకణం బహుకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య తెలిపారు. ఆ సమయంలోనే వెంకయ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తెలిపారు. తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య, రోశయ్యలకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదేనని కీర్తించారు. ఒక మహోన్నత వ్యక్తి మరో గొప్ప వ్యక్తికి సన్మానం చేయటం విశేషమన్నారు. చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో వీరిద్దరూ ఎవరివారే సాటి అని తెలిపారు.