– వినాయకమండపాలకు ఫీజుల విఘ్నాలేమిటి దేవరా?
– వినాయకమండపం పెడితే.. వెయ్యిరూపాయలు కట్టాలంతే
– స్వాములు ఆగ్రహించినా స్పందించని ఏపీ సర్కారు
– స్వరూపానందుల వారు స్పందించరేం?
– మరి ఆ ఫీజుల నిర్ణయాన్ని స్వామి ఆమోదించినట్లేనా?
– జగన్గురువుకు తెలియకుండానే నిర్ణయించారా?
– ఇంతకూ పూజకు ఫీజులకు స్వామి అనుకూలమా ? వ్యతిరేకమా ?
-ని‘బంధనాల’పై సంకటంలో స్వరూపానంద
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ నోటరీ చేయించవలెను. బొమ్మపెట్టే స్థలం, బొమ్మ ఎత్తు, ఎన్ని రోజులు ఉంచేది, నిమజ్జనానికి రూటు, నిమజ్జనం స్థలం, ఎటువంటి మందుగుండు సామాగ్రిగానీ, డిజె సౌండ్ సిసస్టమ్ గానీ పెట్టబోమనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగగుండా చూసుకుంటామని.. పైన తెలిపిన విషయాలను నోటరీలో మెన్షన్ చేయవలెను. బొమ్మ పెట్టే స్థలంలో ఎన్ని స్పీకర్లు పెడితే ఒక రోజుకి, ఒక స్పీకర్‌కి 100 రూపాయల చొప్పున చలానా తీసుకొనవలెను. బొమ్మ నిమజ్జనానికి వెళ్లే వాహనం యొక్క డాక్యుమెంట్లను జత చేయవలెను. బొమ్మ నిమజ్జం వాహనం యొక్క డ్రైవర్ లైసెన్సును జత చేయవలెను. ఐదుగురు కమిటీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డులను వారి ఫోన్ నెంబర్లతో ఉండవలెను’’
ఇదంతా ఏ రాజకీయ పార్టీ బహిరంగసభలకో, ముఖ్యమంత్రి, ఎవరైనా మంత్రులు-ఎమ్మెల్యే-ఎంపీల స్వాగత ఏర్పాట్లకో విధించిన నిబంధనలయితే బాగానే ఉండేది. కానీ.. ఇవన్నీ వినాయక చవితి సందర్భంగా, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే వినాయక మండపాలకు, ఏపీలో జగనన్న సర్కారు రూపొందించిన ధర్మ సూక్తి ముక్తావళి. అంటే ని‘బంధనాల’న్నమాట. తొమ్మిదిరోజులు స్పీకర్లు పెట్టినందుకు రోజుకు వంద రూపాయలంటే తొమ్మిదివందల రూపాయలు, మండపాలు ఏర్పాటుచేసే గణపతి భక్తులకు తిరుక్షవరమన్నమాట. అప్పుల్లో అల్లాడుతున్న ఆంధ్రా సర్కారు.. ఈ విధంగా వినాయక మండపాలకు, చలాన్ల రూపంలో ఆదాయం అర్జించాలన్న ఆలోచన కూడా గొప్పదే మరి! ఒక్కముక్కలో చెప్పాలంటే.. పూజలకూ ఫీజులు వసూలు చేస్తున్న, బహు దొడ్డ మనసు జగనన్న సర్కారు నిర్ణయానికి, హిందూ సమాజం సాష్టాంగపడాల్సిందే. జగద్గురు-జగన్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి గారూ… మీకు అర్ధమవుతోందా? ఇది కూడా చదవండి.. హిందువులంటే జగన్‌కు కక్ష
వినాయక మండపాలకు ఫీజులు చెల్లించాలన్న జగనన్న సర్కారు నిర్ణయానికీ, స్వరూపనంద సరస్వతుల వారికీ లింకేమిటన్నదే కదా బుద్ధిజీవుల డౌటనుమానం? కరస్టే.. కానీ జగనన్న వేలు పట్టుకుని నడిపిస్తున్నది ఆ జగద్గురువైన ఈ జగన్గురువే కాబట్టి.. హిందూ సమాజం ఈతి బాధలు ఆయనకే మొర పెట్టుకోవాలి మరి.
వినాయక మండపాలకు రుసుముల ముసుగులో జగనన్న, ఏపీని క్రైస్తవాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సిగ్గుమాలిన ఆలోచనలతో, హిందూమతాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని ఆయన కన్నెర్ర చేశారు. ‘ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాలు ఇతర మతాల విషయంలో తీసుకునే దమ్ముందా’ అని జగన్‌ను కడిగేశారు. హిందూమతానికి ప్రమాదంగా మారిన ఇలాంటి నిర్ణయాలపై పీఠాథిపతులంతా రోడ్డెక్కాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు ఈ దరిద్రపుగొట్టు నిర్ణయాలను జగన్గురువు స్వరూపానంద సమర్ధిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అంటూ స్వరూపానందను ఇరికించారు.
నిజమే కదా? శ్రీనివాసానంద ధర్మాగ్రహంలో అర్ధం ఉంది కదా? హిందు మతానికి సవాలుగా మారిన ఇలాంటి నిర్ణయాలపై జగన్గురువు స్వరూపానంద ఎలా స్పందిస్తారన్నది అనంతకోటి భక్తపరమాణువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన పాదధూళి, ముద్దు మురిపాలతో జగనన్నను పునీతుడిని చేసిన స్వరూపకు తెలియకుండానే, జగనన్న సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అన్నది భక్తప్రపంచం అనుమానం.
దేవదాయ ధర్మాదాయ శాఖను కనుసన్నలతో శాసిస్తు, తన ప్రియ భక్తపుంగువులకు ఆ శాఖలో పదవులు అనుగ్రహిస్తు, కావలసిన చోట భూముల ప్రసాదం అందుకుంటున్న స్వామివారు, తన శిష్యుడయిన జగనన్నకు ఒక్కమాట చెబితే.. వినాయక మండపాలకు ఫీజుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోరా? అసలు ఎక్కడో రుషికేషులో ముక్కుమూసుకుని సంపాదించుకున్న తన తపశ్శక్తినంతా, జగనన్న సీఎం అయేందుకే ధారపోసిన స్వామి వారు, ఈ చిన్న పని కూడా హైందవ ధర్మం కోసం చేయకపోతే.. ఇక ఆయనకు జగన్గురువు, జగద్గురువు అన్న బిరుదులెందుకన్నది హిందూ సమాజం నుంచి దూసుకువస్తున్న ప్రశ్న.
ఎలాగూ అంతర్వేది రథం తగలబెట్టిన ఉన్మాదులను చెరపట్టించడంలో, స్వామి వారు ఎందుకో దయతలచలేదు. ఆ తర్వాత తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా శరపరంపరగా ఆలయాలపై దాడులు జరిగినా, ఆ మతోన్మాదుల సంగతి తేల్చాలని శిష్యుడి వద్దకు వెళ్లి హఠం వేయలేదు. మతమార్పిళ్లు విజయవంతంగా జరుగుతోందంటూ శ్రీనివాసానంద సరస్వతి వంటి స్వాములు ఆందోళన చేసినా, స్వామి వారు దానినీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆలయ భూములను రాజకీయ నేతలు అప్పనంగా దోచుకోవడంతోపాటు, స్వయంగా సర్కారే వాటిని వేలం వేస్తున్నా, స్వామి వారు తన అతీంద్రయ శక్తులతో వాటిని అడ్డుకోలేదు.
కనీసం.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఉత్సాహంగా ఏర్పాటు చేసుకునే వినాయక మండపాలకు ఫీజులు చెల్లించాలన్న.. తన శిష్యుడి ఆదేశాలనయినా ఉపసంహరించుకునేలా, స్వామి వారు తన తపశ్శక్తిని మరోసారి ధారపోయాల్సిన అవసరం వచ్చిపడిందన్నది స్వరూపానందుల వారి శిష్యకోటి మనోగతం. మూడున్నరేళ్ల క్రితం జగనన్నను సీఎం చేసేందుకు తపోశక్తిని ధారపోస్తే.. ఇప్పుడు ధర్మపరిరక్షణకు మరోసారి తన తపోశక్తిని ధారపోయకపోతే, స్వామి వారి ఇమేజీ భారీగా డామేజీ అవుతుందన్నది ఆయన శిష్యపరమాణువుల ఆందోళన. ఈ కీలక సవుయంలో కూడా స్వామి వారు మౌనవ్రతం విడిచి, ప్రియ శిష్యుడయిన జగన్‌ను ఆదేశించకపోతే… ‘‘అది శారదాపీఠం కాదు. వైసీపీ కార్యాలయమం”టూ గతంలో శ్రీనివాసానంద సరస్వతి చేసిన వ్యాఖ్య నిజమని, అదే అనంతకోటి భక్తులు నమ్మే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి .. స్వామీ.. మీకు అర్ధవువుతోందా? వినాయకుడిని కరుణించండి.