రేపటి నుంచి మొదలుకానున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బదిలీలలో ఎవరెవరికి ప్రాధాన్యం ఇవ్వనున్నదీ ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఈ నెల 18 నుంచి తిరిగి ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒకే చోట ఐదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. 40 శాతం కంటే అధిక వైకల్యం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం లభించనుంది. మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న ఉద్యోగులకు కూడా ప్రాధాన్యం దక్కనుంది. కుటుంబీకుల్లో దీర్ఘకాల వ్యాధులున్న ఉద్యోగులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యమివ్వనున్నారు. కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యం దక్కనుంది. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న దంపతులకు కూడా ప్రాధాన్యమిస్తారు.