-మార్గదర్శికి ఏపీ హైకోర్టులో ఊరట
మార్గదర్శిపై వేధింపులకు పాల్పడుతున్న జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టులో మరోసారి జలక్ తగిలింది. మార్గదర్శికి చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిట్స్ రిజిస్ట్రార్ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు పేర్కొంది. చందాదారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు భావించింది. చందాదారుల వ్యాజ్యాలు, మార్గదర్శి వ్యాజ్యాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది.
ఏదో విధంగా ఈనాడు అధినేత రామోజీరావును ఇబ్బందులు పెట్టాలనే లక్ష్యంతో మార్గదర్శికి వ్యతిరేకంగా ఫుల్ పేజి పేపర్ యాడ్‌లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. 60 ఏళ్లకు పైగా లక్షలమంది ఖాతాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శిని గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న విషయం తెలిసిందే.
కొద్దిరోజుల క్రితం మార్గదర్శి చిట్స్‌కి చెందిన కొన్ని గ్రూపులను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఎలాంటి ఫిర్యాదులు లేని మార్గదర్శిపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిట్లను నిలిపివేయటంపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈరోజు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.