– మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా
– నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. వైసీపీ ది భయమా? బెదురా?
– వైఎస్ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది వైఎస్ఆర్
– వైసీపీ సైతాన్ సైన్యం, ఎన్ని కుక్కలు మొరిగినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డి
– వైఎస్ఆర్ కి రాజారెడ్డి రాజకీయ వారసుడు
– నా కొడుకుని చంద్రబాబు చెప్తే రాజకీయాల్లోకి తీసుకు వస్తే..మీరు ఎవరు చెప్తే వీపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు?
– వైఎస్ఆర్ బతికి ఉంటే జగన్ చేసిన పనికి సిగ్గుతో, అవమానంతో తల దించుకునే వాడు
– చరిత్రలో వైఎస్ఆర్ ఛాతీలో కత్తితో పొడిచిన వ్యక్తిగా జగన్ మిగిలాడు
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ
విజయవాడ: రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి 2 లక్షల అప్పు ఉంది. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మన రాష్ట్రం నెంబర్ 1. ప్రతి ఏడాది వెయ్యి కంటే పైగా నమోదు కావడం బాధాకరం. కారణాలు, పరిష్కారాలు మాత్రం శూన్యమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఆమె, ఇంకా ఏమన్నారంటే… రైతుల సమస్యలు కొండత.. ప్రభుత్వ పథకాలు గోరంత.
చంద్రబాబు ఇచ్చే అన్నదాత సుఖీభవ 20 వేలు ఏ మూలకు సరిపోదు.
రైతుల పథకాలు అన్ని బంద్ పెట్టారు. పంట నష్టపరిహారం లేదు.. సబ్సిడీ పథకాలు లేవు, బోనస్ లు లేవు.
వ్యవసాయంలో సాయం పోయింది. రాష్ట్రంలో రైతుకి భరోసా లేదు. రైతు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు. కనీసం రైతులను పరామర్శించే వాడు లేడు. రాష్ట్రంలో ఏ పంటకు కనీస మద్దతు ధర అందడం లేదు. మిరప, పొగాకు, జొన్నలు, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. రైతులకు ధర విషయంలో అన్యాయం జరుగుతుంటే కేంద్రంలో ఇంకా బీజేపీ కి బాబు మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు ఆలోచన చేసుకోండి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వైసీపీ హయంలో కాలేజీలు పూర్తి కాకుంటే అవి మీరు పూర్తి చేయాలి కదా? రాష్ట్రంలో ఇప్పటికే మెడికల్ సీట్లు 2600 ఉన్నాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న కాలేజీలు పూర్తి అయితే మరో 2500 సీట్లు అందుబాటులో వస్తాయి. నారాయణ లాంటి వాళ్లకు కాలేజీలు అప్పజెప్పాలని కుట్ర. ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ విద్య భారం అవుతుంది. పేద బిడ్డలకు తక్కువ ధరకే చదువుకొనే వెసులుబాటు ఉండదు. మెడికల్ విద్యను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతారు. వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. కేంద్రం మీ చేతుల్లో ఉంది. కావలసిన నిధులు,అనుమతులు అన్ని తెచ్చుకోండి
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలో నడపండి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేస్తాం.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలు ఎందుకు అందడం లేదు? మెజారిటీ పథకాలు అమలు చేయకుండా సూపర్ ఫ్లాప్ చేశారు. నిరుద్యోగ బిడ్డలకు 3 వేల భృతి లేదు. 20 లక్షల ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వస్తాయి అంటే మీరు సక్సెస్ అయినట్లేనా? సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్. నెలకు 15 వందలు ఇస్తామని మహిళలను మోసం చేశారు. మహాశక్తి పథకం అమలు కాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది? అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మందికి ఇస్తే సూపర్ హిట్ అయినట్లేనా? తల్లికి వందనం కింద కోతలు పెట్టడం, 20 లక్షల మంది బిడ్డలకు పథకం ఇవ్వకపోవడం సూపర్ హిట్ అయినట్లా?
నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు.. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే…. ఇది భయమా? బెదురా? వాళ్ళకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయంగా వైఎసీఆర్. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డినే… ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేరు. నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు.. చంద్రబాబు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కష్టపడి ఒక వీడియో మార్ఫింగ్ చేశారు. నాకు చూసి నవ్వు వచ్చింది..ఇంత కష్టం ఎందుకు అని? నా కొడుకుని చంద్రబాబు చెప్తే తీసుకు వస్తే… మరి ఎవరు చెప్తే వీపీ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారు? వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
నిస్సిగ్గుగా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్ మద్దతు ఇవ్వడం అవమానకరం. వైఎస్ఆర్ తన జీవితకాలం బీజేపీ నీ వ్యతిరేకించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునే వాడు. సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? జగన్ సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణులు. రాజ్యాంగం గురించి తెలిసిన వాడు. ఇలాంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదు? జగన్ మోదీకి దత్తపుత్రుడు. మోడీ చెప్పినట్లు ఆడుతున్నాడు.
వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన జగన్.. అదే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ ఇచ్చాడు. మోడీ కోసం అదానీకి గంగవరం పోర్ట్ కట్టబెట్టారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. జగన్ ఏ మొహం పెట్టుకొని మద్దతు ఇచ్చావు సమాధానం చెప్పు. టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు.
జగన్ ది తెరవెనుక పొత్తు. బీజేపీ తొత్తుగా, తోక పార్టీగా వైసీపీ పని చేస్తోంది. వైఎస్ఆర్ కొడుకుగా ఏమైనా తండ్రి ఐడియాలజీ మిగిలి ఉందా? మీరు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నింపుకున్నారా? బీజేపీ ఐడియాలజీ తో పని చేస్తున్నారా ? మోడీ మీకు దేవుడు అయ్యారా ? వైసీపీ కి అజెండా లేదు.. జెండా లేదు… ఐడియాలజీ లేదు. జగన్ రాజకీయ చేస్తున్నారు. మీకు దమ్ముంటే బీజేపీ కి తోక పార్టీ అని ఒప్పుకోండి. మీకు దైర్యం లేకుంటే చేతిమీద బీజేపీ అని పచ్చబొట్టు వేసుకోండి.
పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారు. వైసీపీకి ఆ మాత్రం ఇంగితం లేదు. వైఎస్ఆర్ వారసుడు అయి ఉండి బీజేపీ కి ఓటు వేయడం సిగ్గుచేటు. చరిత్రలో వైఎస్ఆర్ ఛాతీలో కత్తితో పొడిచిన వాడుగా జగన్ మిగిలి పోతాడు