Suryaa.co.in

Editorial

ఏపీ కొత్త సీఎస్ శ్రీలక్ష్మి?

– హైకోర్టు తీర్పుతో లైన్‌క్లియర్
– కేసులు పెండింగ్‌లో లేనందున శ్రీలక్ష్మికి రూట్ క్లియర్
– జీవోలో కొన్ని నిబంధనలతో సీఎస్‌గా నియమాకం?
– సీబీఐ అపీలుకు వెళ్లినా ఆరు నెలల వరకూ శ్రీలక్ష్మికి ఢోకా లేనట్లే
– తాజా సీబీఐ వాదనలే ‘సుప్రీం’లో కొనసాగిస్తే శ్రీలక్ష్మికి వరమే
– హైకోర్టులో సీబీఐ వ్యవహారశైలే దానికి కారణం
– సీబీఐ వైఫల్యం వల్లే శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్ అంటూ విమర్శలు
– ఎట్టకేలకూ నెరవేరనున్న శ్రీలక్ష్మి కల?
– రేసులో సీనియర్ ఐఏఎస్ జవహర్‌రెడ్డి?
– శ్రీలక్ష్మి డెప్యుటేషన్‌పై రావడమే దానికి కారణమా?
– ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేష్‌కు తెలంగాణ సీఎస్ పదవి
– దానిపై క్యాట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసు
– ఏపీ క్యాడర్ ఐఏఎస్‌కు సీఎస్ ఎలా ఇచ్చారన్న రేవంత్‌రెడ్డి
– ఆ కోణంలో చూస్తే జవహర్‌రెడ్డికి ఏపీ సీఎస్ చాన్స్?
– సీఎం జగన్ ఆయనకు ఆ మేరకు హామీ ఇచ్చారంటున్న అధికార వర్గాలు
– నవంబర్‌తో ముగియనున్న సమీర్‌శర్మ పదవీకాలం
– ఆయనకు ఇక పొడిగింపు లేనట్లే
( మార్తి సుబ్రహ్మణ్యం)

సీనియర్ ఐఏఎస్ అధికారి ఎర్రా శ్రీలక్ష్మి ఏపీ కొత్త సీఎస్‌గా నియమితులయ్యే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు బదిలీ అయిన, 1988 బ్యాచ్ ఐఏఎస్ అయిన శ్రీలక్ష్మిపై..సీబీఐ పెట్టిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో, ఆమెకు ఏపీ చీఫ్ సెక్రటరీ అయ్యేsrilakshmi-jail అవకాశాలు మరింత మెరుగయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి, శ్రీలక్ష్మి చంచల్‌గూడలో జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. నిజానికి కేంద్ర కాబినెట్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సిన శ్రీలక్ష్మిపై, సీబీఐ కేసు వల్ల ఆమె కెరీర్ కొత్త మలుపు తిరిగింది.

రేసులో వివాద రహితుడైన మరో సీనియర్ ఐఏఎస్ జవహర్‌రెడ్డి ఉన్నప్పటికీ, తన వల్ల జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మి వైపే సీఎం జగన్ మొగ్గు చూపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది. ఇప్పటికే పొడిగింపుపై పనిచేస్తున్న సమీర్‌కు, ఇక పొడిగింపు అవకాశాలు లేనట్లే. దానితో సీఎం జగన్ ఏరికోరి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి తెచ్చుకున్న.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి, చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి, ముఖ్యమంత్రి గుడ్‌లుక్స్‌లో ఉన్నారు. అయితే ఆమె కంటే సీనియర్ అయిన 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్ias ప్రసాద్‌తోపాటు, 1988 బ్యాచ్‌కే చెందిన పూనం మాలకొండయ్య, ఏ.గిరిధర్ కూడా రేసులో ఉన్నారు, అయినప్పటికీ శ్రీలక్ష్మికే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరిలో గిరిధర్ ప్రస్తుతం కేంద్రసర్వీసులో ఉన్నారు.

కాగా ప్రస్తుతం సీఎంలో ఉన్న సీనియర్ ఐఏఎస్, వివాదరహితుడిగా పేరున్న జవహర్‌రెడ్డి పేరు కూడా సీఎస్ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. 1990 బ్యాచ్‌కు చెందిన జవహర్‌రెడ్డిని, అన్ని వర్గాలూ1279149-jawahar స్వాగతిస్తాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. పైగా జవహర్‌రెడ్డిని సీఎంఓలో తీసుకునే ముందు.. సీఎస్ పదవి ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఆయనను, జగన్ సీఎం అయిన వెంటనే సీఎంఓలోకి తీసుకోవాలని భావించారని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే ఆయన గత టీడీపీ సర్కారులో చంద్రబాబు-లోకేష్‌కు, సన్నిహితంగా వ్యవహరించారన్న కారణంగా ఆ యోచన విరమించుకున్నట్లు చెబుతున్నారు.

పైగా ఏపీ క్యాడర్‌కు చెందిన తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు, ఆ పదవి ఇవ్వడంపై ఇప్పటికే విమర్శలు కొనసాగుతున్నాయి. ఆయన కేసు ఇప్పుడు క్యాట్‌లో ఉంది. ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేష్‌కుమార్‌ను, తెలంగాణ సీఎస్‌గా ఎలా నియమిస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అదే పద్ధతిలో తెలంగాణ నుంచి ఇంటర్ స్టేట్ డెప్యుటేషన్‌పై వచ్చిన శ్రీలక్ష్మికి, సీఎస్ ఇచ్చినా ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పకపోవచ్చన్న చర్చ జరుగుతోంది.

అయితే..తన కారణంగా శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారన్న సానుభూతి సీఎంలో లేకపోలేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తనతో జైలు శిక్ష అనుభవించిన వారందరినీ అందలం ఎక్కించిన జగన్.. సీఎస్ అంశంలో శ్రీలక్ష్మి విషయంలోనూ అదే పద్ధతి పాటించవచ్చంటున్నారు. దానికోసమే తెలంగాణలో ఉన్న ఆమెను, ఏపీకి ఇంటర్ స్టేట్ డెప్యుటేషన్ పద్ధతిలో తీసుకువచ్చిన విషయాన్ని విస్మరించకూడదని స్పష్టం చేస్తున్నారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా కూడా అడహక్ పద్ధతిలో ఇచ్చి, ఆమెపై తన అభిమానం చాటుకున్నారని చెబుతున్నారు. ఆ కోణంలో చూస్తే, సీఎస్‌గా శ్రీలక్ష్మికే ఎక్కువ అవకాశాలున్నాయని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.

శ్రీలక్ష్మిపై సీబీఐ పెట్టిన సెక్షన్లు చెల్లవంటూ, హైకోర్టు సింగిల్ జడ్జి ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది. దానితో ఆమెకు స్వేచ్ఛ లభించినట్లయింది. ఆ ప్రకారంగా ఆమెపై ఇక ఎలాంటి కేసులు లేనట్లే లెక్క. నిబంధనల ప్రకారం సీబీఐ కేసులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును, అదే కోర్టు ఫుల్‌బెంచ్‌లో సవాల్ చేయడానికి అవకాశాలు లేవని ఓ మాజీ సీఎస్ వ్యాఖ్యానించారు. అందువల్ల సీబీఐకి సుప్రీంకోర్టులో అపీలుకు వెళ్లడమే మార్గమని వివరించారు.

శ్రీలక్ష్మిపై కేసు కొట్టివేసిన క్రమంలో సీబీఐ వ్యవహరించిన తీరు పరిశీలిస్తే.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు, సీబీఐ మరో ఆరునెలల సమయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని ఆయన విశ్లేషించారు. శ్రీలక్ష్మి కేసులో సీబీఐ సరైన సమయంలో, సమర్థవంతంగా వ్యవహరించలేదన్న విమర్శలు వెలువడిన విషయం తెలిసిందే.

ఈలోగా నవంబర్‌లో రిటైరయ్యే సీఎస్ సమీర్‌శర్మ స్థానంలో, ముఖ్యమంత్రి కోరుకున్న శ్రీలక్ష్మి సీఎస్ కావటం ఖాయమని ఆయన విశ్లేషించారు. ఒకవేళ సీబీఐ సుప్రీంకోర్టుకు అపీలుకు వెళ్లినా.. సీబీఐ తాజా హైకోర్టు వాదనల ప్రకారం, అది ఎన్ని నెలలయినా పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఈలోగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, ముఖ్యమంత్రికి అంతకంటే వెసులుబాటు మరొకటి ఉండదని, ఆ మాజీ సీఎస్ విశ్లేషించారు.

సాంకేతిక అంశాల ప్రకారం సమీర్‌శర్మ రిటైరయిన తర్వాత.. శ్రీలక్ష్మిని వెంటనే సీఎస్‌గా నియమించేందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఉండవని సీనియర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటితో ఆమెపై ఎలాంటి కేసులూ పెండింగ్‌లో లేనందున, శ్రీలక్ష్మికి సీఎస్ ఇవ్వవచ్చని అటు న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. ఆక్రారంగా.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అనుసరించి, ఆమెను సీఎస్‌గా నియమించినా, ఎవరికీ అభ్యంతరాలు ఉండవని చెబుతున్నారు.

అయితే.. తర్వాత సీబీఐ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళితే, ‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు భవిష్యత్తు పరిణామాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్న’ నిబంధనలతో’, ప్రభుత్వం జీఓ ఇవ్వవచ్చని సీనియర్ అధికారులు వివరించారు.

LEAVE A RESPONSE