• నేడు ఫైబర్ నెట్ వేదికగా కేవలం రూ.40 కే “కాస్ట్లీ కోరికలు” చిత్రం విడుదల
• వారం రోజుల్లో ఫైబర్ నెట్ నుండి వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు ప్రారంభం
• భవిష్యత్ లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు
• “భోళాశంకర్” చిత్రాన్ని థియేటర్ లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ లో ప్రదర్శించేందుకు సన్నాహాలు
• పైరసీకి అవకాశంలేని గొప్ప వ్యవస్థ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్
• వారానికో కొత్త సినిమా విడుదల చేస్తున్న ఏపీ స్టేట్ ఫైబర్ నెట్
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ డా.పి.గౌతమ్ రెడ్డి
ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో వారం రోజుల్లో ఫైబర్ నెట్ వేదికగా నేరుగా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్(ఏపీఎస్ఎఫ్ఎల్) డా.పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మూడవ అంతస్థులోని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్యాలయంలో “కాస్ట్లీ కోరికలు” చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర బృందంతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫైబర్ నెట్ ద్వారా నేడు ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్ లో ఎస్.వి. ఝాన్సీలక్ష్మీ నిర్మాణ సారథ్యంలో ఎస్.వి.వి. సాయి కుమార్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన “కాస్ట్లీ కోరికలు” సినిమాను కేవలం రూ.40 కే విడుదల చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కిందన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ కావడం, హీరోయిన్ లేకుండా కేవలం యంగ్ స్టర్స్ తో మాత్రమే తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు.
తొలి సినిమాను రూ.100కు అందించిన ఏపీఎస్ఎఫ్ఎల్ అనంతరం ఈ వేదికగా విడుదలైన చిత్రాలను కేవలం రూ.40కే అందిస్తున్న విషయాన్ని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా విడుదలైన చిత్రాలను వేలాది మంది వీక్షిస్తున్నారని, భవిష్యత్తులో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. అసభ్యతకు తావులేని వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు నేరుగా మరో వారంలో ఫైబర్ నెట్ ద్వారా ప్రారంభించనున్నామన్నారు.
ఔత్సాహిక కళాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ గొప్ప ప్లాట్ ఫామ్ గా ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా 250 చిన్న చిత్రాలు రూపుదిద్దుకుంటే అందులో థియేటర్ లో విడుదలయ్యేవి కేవలం 40 చిత్రాలు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు అధిగమించాలన్న ఉద్దేశంతో వాటికి మరింత ప్రోత్సాహమందించేందుకు ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా చిన్న చిత్రాలను తక్కువ ధరకే విడుదల చేస్తున్నామని గౌతమ్ రెడ్డి అన్నారు.
సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన చిత్రాలను మాత్రమే తాము విడుదల చేస్తామన్నారు. రానున్న రోజుల్లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. “భోళాశంకర్” చిత్రాన్ని థియేటర్ లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ లో ప్రదర్శించేందుకు ఆ చిత్ర నిర్మాత సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. సినిమా విడుదల రోజే తక్కువ ధరకే కొత్త సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చూడటం మంచి అనుభూతి అన్నారు. పైరసీ చేసేందుకు అవకాశం లేని టెక్నాలజీతో తాము పైబర్ నెట్ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నామన్నారు.
ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ ప్రమోటర్ రాజీవ్ మాట్లాడుతూ తమ పతాకంపై నిర్మించిన “కాస్ట్లీ కోరికలు” చిత్రం ఏపీఎస్ఎఫ్ లో విడుదలవుతున్న రెండవ సినిమా అన్నారు. తొలుత విడుదల చేసిన “లవ్ యూ టూ” చిత్రానికి మంచి స్పందన వచ్చిందన్నారు. రెవెన్యూ పరంగా ప్రొడ్యూసర్ సంతోషంగా ఉన్నారన్నారు. ఫైబర్ నెట్ వేదికగా రెవెన్యూ కూడా త్వరితగతిన తమకు చేరుతుందన్నారు. ప్రతి నెలా ఈ వేదికగా ఒక చిత్రం విడుదల చేస్తామన్నారు.
కాస్ట్లీ కోరికలు సినిమా డైరెక్టర్ ఎస్.వి.వి సాయి కుమార్ రాజు మాట్లాడుతూ ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా తాను దర్శకత్వం వహించిన చిత్రం విడుదల అవడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర విడుదలకు సహకరించిన ఫైబర్ నెట్ వేదికకు ధన్యవాదాలు తెలిపారు.
హీరో జువ్వనపూడి సుభాష్ మాట్లాడుతూ తనను నమ్మి ఈ చిత్రంలో హీరోగా అవకాశమిచ్చినందుకు 100 శాతం తన పాత్రకు న్యాయం చేశానని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫైబర్ నెట్ వేదికగా విడుదల చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా కాస్ల్టీ కోరికలు సినిమాకు సంబంధించిన పోస్టర్ ను గౌతమ్ రెడ్డి చిత్రబృందంతో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ ప్రమోటర్ రాజీవ్, కాస్ట్లీ కోరికలు సినిమా హీరో జువ్వనపూడి సుభాష్, డైరెక్టర్ ఎస్.వి.వి సాయి కుమార్ రాజు, ప్రొడ్యూసర్ ఎస్.వి.వి ఝాన్సీ లక్ష్మీ, బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్ సభ్యులు వంశీ, వరుణ్, గౌతమ్, సాయిరామ్, మణికంఠ, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.