Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్ గా మారిపోయింది

-అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోంది
-ఒక్క ఏప్రిల్ లోనే 31 అత్యాచార, దాడుల ఘటనలు
-గత నెలలో 26 మంది రైతుల ఆత్మహత్యలు
పరిశ్రమలు రాక… ఉపాధి లేక యువత వలసలు
-టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
-మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు

అమరావతి:- వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రం నరకాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రోజు వారీ ఘటనలు, పరిస్థితులు తీవ్ర అవేదన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులకు సంబంధించి 31 ఘటనలు జరగడం రాష్ట్రంలో దుస్థితికి అద్దంపడుతున్నాయని చంద్రబాబు అన్నారు. మరోవైపు రోజు రోజుకూ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు తీవ్ర అందోళన కరమని చంద్రబాబు అన్నారు.

గత ఏప్రిల్ నెలలో 26 మంది రైతులు అప్పులు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ ద్వారా సేకరించిన సమాచారాన్ని అధినేత నేతలతో పంచుకున్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని…అసలు వ్యవసాయ శాఖ అనేది ఉందా అనే అనుమానం కలిగేలా పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. నెలలో 26 మంది రైతుల బలవన్మరణాలు జరిగినా…ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని చంద్రబాబు విమర్శించారు.

ఇక రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలు, అసమర్థత కారణంగా ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతిందని టీడీపీ అధినేత అభిప్రాయ పడ్డారు. ఈ కారణంగా ఉపాధి కోసం యువత, ఆయా వర్గాల ప్రజలు వలసపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ పరిణామం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. మహిళలపై దాడులు -నేరాలు, వ్యవసాయ రంగం సంక్షోభం – రైతుల ఆత్మహత్యలపై పార్టీ పరంగా రెండు వేరు వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు వర్గాల సమస్యలు, పోరాటం, పరిష్కారం కమిటీ సూచనల ఆధారంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ముఖ్యనేతల సమావేశంలో చర్చించిన పలు ఇతర అంశాలు:-
1. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ నేత కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతల దాడి చెయ్యడాన్ని, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ కు వెళ్తున్న టీడీపీ నాయకుడు చలపతినాయుడుపై వైసిపి నేతలు దాడికి పాల్పడటాన్ని సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకూ పెట్రేగిపోతున్నాయని, బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేతలు వ్యాఖ్యానించారు.
2. శ్రీ సత్యసాయి జిల్లా సంజీవరాయనపల్లిలో తల్లికి పింఛన్ ఇవ్వలేదని ప్రశ్నించిన కుమారుడిపై వైసీపీ నేతలు, ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేయడాన్ని సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితుడిని బెదిరించడం దారుణమన్నారు. వేణుపై దాడిచేసిన వైసీపీ నేతలు, ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
3. ప్రజలపై పన్నుల భారం, ఛార్జీల పెంపుతో పాటు నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. పన్నుల బాదుడు, అధిక ధరలపై స్వయంగా మహిళలు అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారని అన్నారు.
4. టీడీపీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ కార్యక్రమం త్వరితగతిన కొనసాగేందుకు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్ జవహర్, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, బీద రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పి.అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE