“మేము పేరుకు మాత్రమే రెవెన్యూ ఉద్యోగులం. కానీ తాము ఏం పనులు చేస్తున్నామో.. ఏం శాఖ కింద ఉన్నామో అర్థం కావడం లేదు” అని ఏపీ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రరాజు విమర్శించారు. ఒక ఉద్యోగి ఎన్ని రకాల పనులు చేస్తారో అధికారులు ఆలోచించాలని హితవు పలికారు.
వీఆర్వోలపై ఇతర శాఖల అధికారులు పెత్తనం పెరిగిపోయిందని ఏపీ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్ర రాజు విమర్శించారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ పనులు కూడా అప్పగించి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ‘కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ధాన్యం మిల్లుల వద్ద రైస్ సేకరణ బాధ్యత అప్పగిస్తాం అంటున్నారు. ఒక ఉద్యోగి ఎన్ని రకాల పనులు చేస్తారో అధికారులు ఆలొచించాలి. పేరుకు మాత్రమే రెవెన్యూ ఉద్యోగులం.. కానీ తాము ఏం పనులు చేస్తున్నామో, ఏం శాఖ కింద ఉన్నామో అర్థం కావడం లేదు’ అని రవీంద్రరాజు విమర్శించారు.
కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి..
కరోనాతో వీఆర్వో మరణిస్తే వారి కుటుంబానికి నేటికి సాయం అందలేదని పేర్కొన్నారు. కారుణ్య నియామకాల ద్వారా వారి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు రూ. 50 లక్షల పరిహారం అందించాలని కోరారు. ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవీ 151.. శ్రీకాకుళం మినహా ఏ జిల్లాల్లోనూ అమలు చేయలేదని పేర్కొన్నారు. గ్రేడ్-1 గ్రేడ్-2 అని వీఆర్వోలను విడగొట్టి జీతాలు ఇస్తున్నారని వాపోయారు.
బయో మెట్రిక్.. జీతం లింకుపెట్టడం సరికాదు..
ఆదివారాలు, సెలవు దినాల్లో ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. బయో మెట్రిక్.. జీతానికి లింకుపెట్టడం ఏంటని ప్రశ్నించారు. కొన్నిసార్లు ఫీల్డ్‌లో పని చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో బయోమెట్రిక్ వేయడం ఎలా సాధ్యమన్నారు. పని చేస్తున్నారా లేదా అని చూడాలే తప్ప.. అర్ధం లేని నిబంధనలు పెట్టడం సరికాదని వీఆర్వో అసోసియేషన్ హితవుపలికింది.