– పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ, రాధాకృష్ణ పీడ
– ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి
– రాష్ట్ర మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే
– మహిళా కమిషన్ తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేయాలి
– మీ హెరిటేజ్ షేర్లలో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్కచెల్లెమ్మలకు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్కసారైనా చెప్పారా?
– ఏరోజైనా మీ తోబుట్టువులను పండక్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా?
– వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
తాడేపల్లి: వైయస్సార్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పేవరకు వైయస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.
వీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైయస్సార్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని వైయస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలియజేసింది. రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఆయన్ను సమర్థిస్తున్నారు.
ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ని మావిగన్ పేరుతో డెవలప్ చేసుకోవచ్చని వైయస్ జగన్ సూచించిన క్షణం నుంచి ప్రజల్లో ఆలోచన మొదలైంది. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ప్రజలు చర్చిస్తున్నారు. వైయస్ జగన్ చెబితే వైయస్సార్సీపీ నాయకులు వారి భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారని చెప్పడం సంపాదకీయంలో భాగమని చెప్పడం సిగ్గుచేటు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాడి అని ప్రచారం చేస్తున్నారు.
వైయస్సార్సీపీకి సంబంధం లేని వ్యక్తి డిబేట్లో మాట్లాడితే సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేశారు. మీ నాయకుల ఇళ్లలో ఉన్న తల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే సమర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్లలో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్కచెల్లెమ్మలకు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్కసారైనా చెప్పారా? ఏరోజైనా మీ తోబుట్టువులను పండక్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా? ఏ హక్కుతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు? పత్రికా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తున్న చంద్రబాబుని ఏరకంగా సమర్థిస్తారు? ఎవరి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడాడు? విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు స్థలం కేటాయించినందుకా? విజయవాడలో రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కి అనుమతులు ఇచ్చినందుకా?
మీ పార్టీలో మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే అంటే ఊరుకుంటారా? ఏబీఎన్ రాధాకృష్ణ మాటలు విశ్లేషణలు అని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవుల కోసం మనసు చంపుకుని మాట్లాడటం అవసరమా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేపర్, టీవీలో తన తల్లిని దూషించినందుకు వాటిని బహిష్కరించిన విషయం అప్పుడే మరిచిపోయారేమో కానీ, రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. హోంమంత్రి అనిత మహిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించకపోవడం సిగ్గుచేటు.
ఆమెకు పదవి ఇచ్చింది జగన్ ని తిట్టడం కోసమా? టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోడీని తిట్టినప్పుడు సై అన్నారు. మోడీని పొగిడినప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాటలు మీకు అన్వయించుకుంటారా చెప్పండి? ఆయన యూటర్న్లకు వంతపాడిన టీడీపీ నాయకులను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండటం మహిళల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా మహిళా లోకానికే కళంకం తెచ్చారు.
ఏబీఎన్ రాధాకృష్ణ మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇంతదారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు వైయస్సార్సీపీ నిరసన తెలుపుతూనే ఉంటుంది. పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ లాంటిది. జర్నలిస్టుల సమాజంలో రాధాకృష్ణ పీడలాంటి వాడు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.