– కేంద్రమంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు మంత్రి సవిత వినతి
అమరావతి: బీసీ హాస్టళ్ల విద్యార్థుల అదనపు రోగనిరోధ శక్తి పెంచేందుకు కేంద్ర ఆయూష్ శాఖ ఆమోదించిన ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన పౌడర్ ను అందజేయడానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కోరారు. అలాగే, బీసీ గురుకుల పాఠశాలల్లో యోగా టీచర్ నియమించాలని కేంద్రమంత్రిని కోరారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజైన సోమవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఆయూష్ శాఖ కార్యాలయంలో కేంద్రమంత్రిని మంత్రి కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలోని బీసీ హాస్టళ్ల విద్యార్థులకు ముఖ్యంగా కిషోర వయస్సు బాలికలకు అదనపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అశ్వగంధ, శతావరి, బ్రాహ్మీ, తులసి, శంఖపుష్పి వంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన పౌడర్ ప్యాకెట్లను అందజేయాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ఆయూష్ శాఖ ఆమోదించిన ఈ పౌడర్ ను అందజేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ పౌడర్ ను వినియోగించడం వల్ల విద్యార్థుల్లో పోషకాహార లోపాల నివారణతో పాటు రోగనిరోధక శక్తి పెంపొందుతుందని, మానసిక అభివృద్ధి, ఏకాగ్రత మెరుగవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదటి విడతలో విజయనగరం, అనంతపురం, కర్నూలు బీసీ హాస్టళ్ల విద్యార్థులకు ఈ పౌడర్ ప్యాకెట్లు అందజేయాలని కేంద్రమంత్రిని మంత్రి సవిత కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్య భద్రతతో కూడిన భోజనం అందించాలని సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనిలో భాగంగా, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం పథకంలోనూ, అన్ని సంక్షేమ హాస్టళ్లలోనూ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తోందన్నారు.
యోగా టీచర్ ను నియమించండి
యోగా వల్ల ఎంతో మేలు కలుగుతుందని, ముఖ్యంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండే అవకాశముందని మంత్రి సవిత తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో యోగా టీచర్ నియమకానికి అనుమతివ్వాలని కేంద్రమంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను కోరారు. యోగా టీచర్ల ఆర్థిక నిర్వహణ కేంద్రమే భరించేలా చూడాలని ఆ వినతిపత్రంలో మంత్రి సవిత తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సోసిడియా, కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు పాల్గొన్నారు.