-ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు
-ఎంపీ విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫూర్తిగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో వాటి అమలుకు శ్రీకారం చుడుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ విద్యావిధానాన్ని అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాడు – నేడు పనులు చేపట్టిన ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మారుస్తోందని అన్నారు. యూపీలో 75 జిల్లాల్లో 15 వేల పాఠశాలల్లో నాడు-నేడు పనులు అమలకు అక్కడి ప్రభుత్వం సిద్దమవుతోందని అన్నారు.
దూర ప్రాంత విద్యార్థులకు రవాణా చార్జీలు
విద్యార్థులు ఎవరూ కూడా చదువులకు దూరం కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ జగనన్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. వీటన్నిటితోపాటు స్కూళ్లు అందుబాటులో లేనివారు, దూర ప్రాంతాల్లో నివసించే పిల్లలు నడవాల్సిన అవసరం లేకుండా రవాణా చార్జీలను సైతం చెల్లించనుందని తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున 10 నెలల పాటు చెల్లించడం జరుగుతుందని అన్నారు. 2022-23 సంవత్సరానికి గాను ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించనుందని అన్నారు. ఈ విధానం ద్వారా 40 వేల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని రవాణా చార్జీలు ప్రభుత్వం రూ.24.25 కోట్లు ఖర్చు చేయనుందని అన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ విజయవంతం
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలన్న సంకల్పంతో రూపొందించిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ విజయవంతమయ్యిందని విజయసాయి రెడ్డి అన్నారు. ట్రయల్ రన్ లో భాగంగా కేవలం రెండు రోజుల్లోనే 11505 మందికి చికిత్స అందించి ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామీణ ప్రజల మన్ననలు అందుకుందని అన్నారు. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పమని అన్నారు.