Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు

• గతేడాది కన్నా మెరుగ్గా బ్యాంకర్ల 2023-24 ఏడాది రుణ ప్రణాళిక లక్ష్య సాధన
• ఎమ్ఎస్ఎమ్ఈలకు మరింత విరివిగా రుణాలివ్వాలు అందించాలి
• పీఎం ముద్ర, స్టాండప్ ఇండియాపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి
• అర్హులైన పేదలు సులభంగా రుణాలు పొందేలా బ్యాంకర్లు చొరవ చూపాలి
• వ్యవసాయ యాంత్రీకరణ,కౌలురైతులకు రుణాలందించేందుకు పూర్తిగా సహకరించాలి
• జాతీయ బ్యాంకుల తోపాటు ప్రవేట్ బ్యాంకులు కూడా తగిన రుణాలందించాలి
-224వ ఎస్ఎల్బిసి సమావేశంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్

అమరావతి,అక్టోబర్,30:రాష్ట్రంలో ఈఆర్ధిక సం.లో బ్యాంకులు1.68 లక్షల కోట్ల రూ.ల రుణ లక్ష్యాన్నిసాధించడం అభినందనీయమని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ బ్యాంకరులను ప్రత్యేకంగా అభినందించారు.సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో 224వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈఆర్థిక సం.రం.లో బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40 లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా అనగా రూ.1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభపరిణామమని పేర్కొంటూ ఇందుకు బ్యాంకులు అందించిన సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు.ఎపి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి భగవత్ కృష్ణారావ్ కరాద్ మెచ్చుకున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎమ్ఎస్ఎమ్ఈలకు రుణాలను విరివిగా ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లకు విజ్ణప్తి చేశారు.పీఎం ముద్ర, స్టాండప్ ఇండియా సంబంధిత పథకాలకు రుణాలపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలన్నారు.

ప్రధానమంత్రి స్వానిధి పధకం కింద వీధి వ్యాపారులకు,ఆత్మ నిర్భర్ నిధి, పీఎం ఎఫ్ఎమ్ఈల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చే పథకానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బ్యాంకర్లకు విజ్ణప్తి చేశారు.ఆయా పధకాల అమలులో ఎక్కువ జాప్యం జరగకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలనిఅన్నారు.

పిఎంఎఫ్ఎంఇ పథకానికి 8వ తరగతి అర్హత,ఒక జిల్లా – ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి వాటితో సరళతరం చేసిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అందరికీ రుణసదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు.జూన్ ఆఖరు నాటికి రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి స్పష్టం చేశారు.కౌలు రైతులకు సాయమందించడంలో వ్యవసాయ శాఖతో అనుసంధానమై ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు బ్యాంకర్ల నుంచి మరింత సహకారం కావాలన్నారు.

సియం వైఎస్ జగనన్న నగర్ లకు సంబంధించి గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు.సీఐబీఐఎల్ (సిబిల్) స్కోర్, వయస్సు వగైరా కారణాలతో ఎక్కువగా దరఖాస్తులు పక్కనపెడుతున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలని మంత్రి బుగ్గన తెలిపారు.సెర్ప్ కి సంబంధించిన ఎస్.హెచ్.జీ బ్యాంక్ లింకేజీల ద్వారా ఇప్పటి వరకూ రూ.4,286 కోట్లు మాత్రమే రుణాలిచ్చినట్లు మంత్రి చెప్పారు.దీనిపై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

.రూ.3 లక్షల వరకూ డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీని తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు విజ్ణప్తి చేశారు.తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే విధంగా నవరత్నాలు పేదలందరికీ ఇచ్చే రుణ పథకాలైన వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు,పావలా వడ్డీ కార్యక్రమాల్లో పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవ చూపాలని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బ్యాంకరులకు విజ్ణప్తి చేశారు.

ఈసమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటును కొనియాడారు.ఈ ఆర్ధిక సం.రం.మొదటి త్రైమాసికంలో 38 శాతం లక్ష్యాలను అధికమించడం పట్ల బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు.ఈఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకున్న దృష్ట్యా రైతాంగానికి మరిన్ని రుణాలు అందించడం ద్వారా వారికి పూర్తి స్థాయిలో చేయూతనందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అదే విధంగా వ్యవసాయ టెర్మ్ లోన్సుకు సంబంధించి మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకంలో తగిన తోడ్పాటును ఇవ్వాలని కోరారు.రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు కూడా పెద్దఎత్తున రుణ సౌకర్యం కల్పించాలని విజ్ణప్తి చేశారు. అంతేగాక విద్యా రుణాలు అందించుటలోను,ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు వీలుగా బ్యాంకులు తమవంతు సహకారాన్ని అందించాలని మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి బ్యాంకరలుకు విజ్ణప్తి చేశారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన తద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పధకాలను విజయవంతగా అమలు చేస్తోందని వాటి సక్రమ అమలుకు బ్యాంకులు అన్ని విధాలా ప్రభుత్వానికి తగిన సహకారం అందించాల్సి ఉందని బ్యాంకరులకు విజ్ణప్తి చేశారు.

గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు,నాడు నేడు వంటి కార్యక్రమాలు ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కావున ఈప్రక్రియలో బ్యాంకులు కూడా తమవంతు తోడ్పాటును అందించాల్సి ఉందని సూచించారు.వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో ప్రభుత్వానికి తమవంతు సహాయ సహకారాలను అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఇడి రామసుబ్రమణియన్ స్పష్టం చేశారు.

ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ బ్యాంకులు ప్రభుత్వానికి అందిస్తున్న తోడ్పాటుకు ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు.కౌలు రైతులు,స్వయం సహాయక సంఘాలకు మరింత తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేశారు.అలాగే జగనన్న గృహ నిర్మాణ కాలనీలకు రానున్న నాలుగైదు మాసాల్లో నూరు శాతం రుణాలు అందించాలని విజ్ణప్తి చేశారు.గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు బ్యాంకులు పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతాంగాన్ని ఏవిధంగా అదుకోవాలనే దానిపై అన్ని బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ణప్తి చేశారు.

వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు ఈఏడాది 8.81 లక్షల సిసిఆర్సి కార్డులు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటికే 8.21 లక్షల కార్డులు జారీ చేసినట్టు తెలిపారు.ఈఖరీఫ్ లో రైతులకు 4వేల కోట్ల రూ.ల పంట రుణాలను అందించాలని లక్ష్యం కాగా ఇప్పటికే 1200 కోట్ల రూ.లు పైగా రుణాలందించామని మిగతా లక్ష్యాలను కూడా త్వరగా అధికమించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని విజ్ణప్తి చేశారు.

అంతకు ముందు ఎస్ఎల్బిసి కన్వీనరైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్ర బాబు సమావేశపు అజెండా అంశాలను వివరిస్తూ ఇప్పటి వరకూ ఈఆర్ధిక సం.రం మొదటి త్రైమాసికంలో బ్యాంకులు సాధించిన లక్ష్యాలను వివరించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు,పిఎంఎవై,పియం ఇజిపి,పియం స్వానిధి, పియం విశ్వకర్మ యోజన వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలకు వివిధ బ్యాంకుల ద్వారా అందించిన రుణాలు సాధించిన లక్ష్యాలను తెలియజేశారు.

ఇంకా ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత,ఆర్థికశాఖ కార్యదర్శి డా.కెవివి సత్యనారాయణ,సెర్ప్ సిఇఓ ఇంతియాజ్,ఆర్బిఐ జియం.ఆర్కె మహానా, నాబార్డు సిజిఎం ఎంఆర్.గోపాల్,యుబిఐ జియం.గుణానంద్ గామి,ఎజియం రాజు బాబు,ఇంకా వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE