Suryaa.co.in

Andhra Pradesh

కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి ఆమోదం

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ వద్ద అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కొవ్వాడతోపాటు మహారాష్ట్రలోని జైత్‌పూర్‌, గుజరాత్‌లోని ఛాయ, మిథి విర్ది, పశ్చిమ బెంగాల్‌లోని హరిపూర్‌, మధ్య ప్రదేశ్‌లోని భీమ్‌పూర్‌లలో అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సూత్రపాయకంగా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కొవ్వాడలో 1208 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశంలో 7 వేల మెగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పాదన కోసం కర్నాటక, హర్యానా, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 10 అణు రియాక్టర్లలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన ఆమోదం ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఈ పది రియాక్టర్లను ఒక సమూహం పద్దతిలో నెలకొల్పబోతున్నట్లు ఆయన తెలిపారు. 2031 నాటికి ఈ పది రియాక్టర్ల నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తయితే అదనంగా మరో 7 వేల మెగావాట్ల అణు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

సౌర, పవన విద్యుత్ రంగాలకు వెదర్‌ డేటా కీలకం…
ఇటీవల కాలంలో సౌర, పవన విద్యుత్‌ రంగాల్లో వాతావరణ సమాచారం వినియోగం విపరీతంగా పెరిగినందున ఆ రంగానికి వెదర్‌ డేటా కీలకంగా మారిందని సైన్స్‌, టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. రాజ్యసభలో గురువారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీయొరాలజీ (ఐఐటీఎం), ఇండియన్‌ మెటీరియొరాలజికల్‌ డిపార్ట్‌మెంట్‌ రూపొందించే వాతావరణ సమాచారాన్ని సౌర, పవన విద్యుత్‌ రంగాలతోపాటు అనేక రంగాలు వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఈ సంస్థలన్నీ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అధీనంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీతో కలిసి పని చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగం వినియోగం కోసం వాతావరణం గురించి ముందస్తు సమాచారం అందించే కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE