Suryaa.co.in

Andhra Pradesh

కొత్త మద్యం పాలసీకి ఆమోదం

•అక్టోబర్ మొదటి వారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలు
•చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు
•రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు
•వాలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కోసం నెలనెలా ఇచ్చే రూ.200/-జీవో రద్దు
•భోగాపురం ఎయిర్ పోర్టుకు “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” గా నామకరణం
•ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (స్టెమీ), రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాలు ప్రారంభం
•రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్—సర్వీస్‌మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEXCO) ఏర్పాటు
•1 నవంబర్, 2024న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ విడుదల
– రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు:
– ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి, సెప్టెంబరు 18: రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రెండో ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నెలకు రూ.200 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు జీవోఆర్టీ నెం.6, జీవో నంబరు 7, తేదీ.03.04.2023న జారీ చేసిన ఉత్తర్వులను, ఉపసంహరించుకోవాలని చేసి ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రాజకీయ లబ్దికోసం ఎవరికో ఆర్థిక లాభం చేకూరే విధంగా చేసిన ఈ ఉత్తర్వులు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.102 కోట్లు నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించవలసినదిగా మంత్రి మండలికి ముఖ్యమంత్రి ఆదేశించారు.

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” గా పేరు మార్చడానికి ఆమోదం తెలిపే తీర్మానం మరియు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ప్రతి ఇంట ఒక ఎంఎస్ఎంఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ దిశగా పారిశ్రామిక, వాణిజ్య శాఖ పనిచేయాలని ఆయన ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం కింద అందే లబ్ధిని రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు అందజేసి వాటిని అభివృద్ది పథంలో నడపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ప్రాథమిక కార్పస్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా కొలేటరల్ గ్యారెంటీ లేకుండా ఎంఎస్ఎంఈ లకు దాదాపు రూ.5 వేల కోట్ల మేర ఋణ సౌకర్యం కలుగనుంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపకరిస్తుంది.

ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం ద్వారా సుమారు 35,000 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ప్రయోజనం కలుగనుంది, తద్వారా వ్యవస్థాపకత మరియు సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిసోంది.

మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) భాగస్వామ్యంతో ఇప్పటికే అందిస్తున్న 75-85 శాతం గ్యారంటీకి అదనంగా 10 నుంచి 20 శాతం రుణాలకు అదనపు గ్యారంటీ లభిస్తుంది.

ఇది ఎంఎస్ఈలకు ఇచ్చిన రుణ మొత్తంలో 95% అంటే గరిష్టంగా రూ. 5 కోట్ల వరకు రుణం తీసుకునే ఎంఎస్ఈలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా సమర్థవంతంగా కవర్ చేయడం జరుగుతుంది.

ఎంఎస్ఈ ల కోసం ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ రాష్ట్రంలోని సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు సాధికారత కల్పించడానికి ఒక ముఖ్యమైన అడుగు. అవి అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. CGTMSEతో ఈ సహకారం అవసరమైన క్రెడిట్ గ్యారెంటీ మెకానిజమ్‌ను అందిస్తుంది, పూచీకత్తు అవసరం లేకుండానే సులభంగా రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్‌లో మరింత సమగ్రమైన మరియు సహాయక వ్యాపార వాతావరణాన్ని నిర్ధారిస్తుంది.

కడప జిల్లా కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్ లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులుగా అమరావతిలో రెండో ఎంఎస్ ఎంఈ టెక్నాలజీ సెంటర్ (టీసీ) కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఆర్ డీఏ ద్వారా రాజధాని ప్రాంతంలో 20 ఎకరాల భూమిని అందజేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.కమ్యూనిటీ స్థాయిలో సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదించింది.

ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్బంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపారు.

మాజీ సైనికులు, యుద్ద వికలాంగ సైనికులు, యుద్ద వితంతువులు, మాజీ సైనిక వితంతువులు మరియు వారిపై ఆధారపడినవారి స్వయం సమృద్ది, సహాయ, పునరావాసానికై సొంత పిడిఎఫ్ ఖాతా నుండి రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEXCO) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి చేసిన ప్రతిపాదనకు స్పందించిన ముఖ్యమంత్రి రూ.10 కోట్ల కార్పస్ నిధి ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.

విజన్ డాక్యుమెంట్ వికసిత్ ఆంధ్ర 2047 పేరును స్వర్ణాంధ్ర @ 2047గా మార్చడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 5 వరకు స్టేక్ హోల్డర్స్ సంప్రదింపుల అనంతరం 1 నవంబర్, 2024న విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

కృత్రిమ మేధ, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్.ఆర్.ఎం.యూనివర్శిటీని యు.జి.సి. నిబంధనలు-2023 ప్రకారం డిస్టింక్టు కేటగిరీలో “డీమ్డు టు బి యూనివర్శిసిటీ” గా కన్వర్టు చేసేందుకు అవసరమైన “నో అబ్జక్షన్ సర్టిఫికేట్”ను ప్రభుత్వ పరంగా జారీచేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

నాలెడ్జ్ జనరేషన్ మరియు అప్లికేషన్ కేంద్రాలతో స్మార్ట్ &ఫ్యూచరిస్టిక్ సిటీగా రాజధాని అమరావతి నిర్మించేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సవాళ్లు మరియు అవకాశాలకనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిభ అభివృద్ధి, స్టార్టప్ ఇంక్యుబేషన్, అత్యాధునిక పరిశోధనలు, బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాలను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చే పలు విద్యాసంస్థలకు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది.

దేశంలో పేరెన్నికగన్న పది ఉత్తమ విశ్వవిధ్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కు తేవడం తమ లక్ష్యమని, బిట్స్ పిలానీ సంస్థ తమ అనుబంధ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంసిద్దత ఏర్పాటు చేసేందుకు సంసిద్ద తెలిపిందని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా రాష్ట్రంలోని బి.సి.లకు చట్టసభలో సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో బి.సి.లకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను కేంద్రం ఆమోదం కొరకు పంపేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

బి.సి.లు ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి కారణం రాజకీయ పరంగా వారికి తగిన అవకాశాలు లేకపోవడమేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

కౌలుదారు గుర్తింపు కార్డుల జారీ మరియు కొత్త కౌలు చట్టం, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా “సాయిల్ హెల్త్ కార్డుల జారీ మరియు 2024-25లో “పొలం పిలుస్తోంది” కార్యక్రమంపై స్టేటస్ నోట్స్ను మంత్రి మండలి ఆమోదించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజక్టులో బాగమైన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ (ఇసిఆర్ఎఫ్) గ్యాప్ 2 పనుల్లో భాగంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రస్తుతం ఉన్న ఏజన్సీ తోనే కొనసాగించేందుకు పోలవరం చీఫ్ ఇంజనీరు ప్రతిపాదించిన రాటిఫికేన్ ఆర్డర్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ కొత్త డయాప్రమ్ వాల్ నిర్మాణం కారణంగా ఉత్పన్నమయ్యే అదనపు పనులను పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా పనులను నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాయలసీమలో ఉన్న అన్ని రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను ఈ సీజన్ లోనే నింపేవింధగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రంగా మార్పు ఇప్పటికే జారీ చేసి జి.ఓ.ను ర్యాటిపై చేస్తూ మంత్రి ఆమోదం తెలిపింది.
నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబరు మొదటి వారం నుండి ఈ నూతన పాలసీ అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం – 1993కు తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నూతన మద్యం పాలసీ లో నిర్వహణ, ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నూతన విధానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది, దీంతో రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.
సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో 10 శాతం గీత కులాలకు కేటాయించడం జరుగుతుంది.

రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% దుకాణాలను అంటే 340 దుకాణాలను కేటాయించడం జరుగుతుంది. ఈ రిజర్వుడ్ షాపులకు ప్రత్యేక మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేయడం జరుగుతుంది.

అన్ రిజర్వ్ డ్ షాపులకు ప్రతిపాదిత శ్లాబుల్లో 50 శాతం లైసెన్స్ ఫీజు ఉంటుంది. తద్వారా కల్లుగీత వర్గాలకు సామాజిక న్యాయం మరియు ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతుంది.

రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండేందుకై లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు పద్దతిని అనుసరించడం జరుగుతుంది.తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మధ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

LEAVE A RESPONSE