– పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు,షిప్ బిల్డింగ్ యూనిట్లు, టూరిజంలో అవకాశాలు
– అవకాశాలు పుష్కలం- వచ్చి వినియోగించుకోండి
– సింగపూర్ సీఈఓల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సింగపూర్: సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ… రాష్ట్రంలో సుదీర్ఘతీరప్రాంతం ఏపీకి అతిపెద్ద వనరు అని ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్రంలో మారిటైం ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగా..తాము పోర్టుల నిర్మాణం, పోర్ట్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ మేరకు పక్కా ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో 1053 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం వెంబడి 6 ఆపరేటింగ్ పోర్టులు ఉన్నాయని…మరో నాలుగు కొత్త పోర్టులు రానున్నాయని వెల్లడించారు.
లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చెప్పారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడంతో పాటు డ్రై పోర్టు నిర్మాణం వంటి వాటిపై ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఇన్ లాండ్ వాటర్ వేస్ ద్వారా కూడా సరుకు రవాణా చేపట్టేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు. దీంతోపాటు టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని.. ఈ ప్రణాళికల్లో భాగంగా క్రూయిజ్ టూరిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు.
తీర ప్రాంతం… పెట్టుబడులకు గమ్యస్థానం
రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడాన్ని తాము ఓ అవకాశంగా మలుచుకునేందుకు అన్ని కోణాల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తమ రాష్ట్రానికి ప్రకృతి ఇచ్చిన వరాన్ని రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన వనరుగా మార్చుకునేలా ఆలోచనలు చేస్తున్నామని సీఎం చెప్పారు. షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణానికి కూడా ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. దీని ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి ఉపయోగ పడుతుందని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ప్రణాళికతో వస్తే…అన్ని రకాలుగా సహకరిస్తామని సీఎం చెప్పారు. శ్రీ సిటీకి దగ్గర లోనే 5 పోర్టులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.