– ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారు
– ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయి
– నెల్లూరులోని వైయస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు: నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైయస్సార్సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం.
ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్ఆర్సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్ఆర్సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?. చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.