Suryaa.co.in

Andhra Pradesh

నామినేటెడ్ పదవుల్లో మొత్తం రెడ్లేనా?

– జగన్ రెడ్డి పాలనంతా బీసీలను అణచివేయడమే
– మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలోని బీసీలకు ఇక్కట్లు తప్ప ఇంకేమైనా ఉందా?
ఫ్యాక్షనిస్టు నోట.. సోషలిస్టు మాటా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు

బీసీల ఆస్తుల్ని దిగమింగి, బీసీలను బలితీసుకుంటున్న విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో బీసీల సభ నిర్వహించడమే జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్న ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం. ఏపీఐఐసీ, టీటీడీ ఛైర్మన్, యూనివర్శిటీ వీసీలు, సలహాదారులు, ప్రభుత్వ న్యాయవాదులు సహా రాష్ట్రంలోని అన్ని కీలక నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను నియమిస్తే ఇప్పుడు మొత్తం రెడ్లతో నింపారు.

టీడీపీ హయాంలో యూనివర్శిటీ వీసీలుగా బీసీలను నియమిస్తే జగన్ రెడ్డి వచ్చాక వారందరినీ బెదిరించి, రాజీనామాలు చేయించి సొంతవారిని నియమించడం నిజంకాదా? విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు రాష్ట్రాన్ని అప్పగించి బడుగు బలహీన వర్గాలపై పెత్తనం చేయించడం నిజం కాదా? ఇదేనా సామాజిక న్యాయం. ఇదేనా బీసీలకు న్యాయం చేయడం?

స్వతంత్ర భారతదేశంలో జగన్ రెడ్డి బీసీలకు చేసినంతటి ద్రోహం, దగా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా ఏ పాలకుడూ చేయలేదు. జగన్ రెడ్డి దుర్మార్గమైన ప్రజాకంఠక పాలనతో రాష్ట్రంలోని బీసీలు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది, సామాజికంగా అభ్యున్నతి సాధించేలా స్వేచ్ఛ ఇచ్చింది, ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రోత్సాహం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. అందుకే తెలుగుదేశం ఆవిర్భావం నుండి.. తరాలు మారినా రాష్ట్రంలోని బీసీలంతా పార్టీ వెంటే ఉన్నారు. వారిని టీడీపీకి దూరం చేయాలనే కక్షతో బీసీలపై జగన్ రెడ్డి దాడులకు దిగుతున్నారు. వారి ఆర్ధిక మూలాలను నాశనం చేస్తున్నారు.

దశాబ్దాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను కుట్రపూరితంగా కుదించి సుమారు 16,800 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు దూరం చేశారు. మూడేళ్లలో సుమారు రూ.30 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు. బీసీ కుల గణన చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ 2014లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. జగన్ రెడ్డి దాన్ని ఆమోదించేలా కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా బీసీలకు దగా చేస్తున్నారు. బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులపై షాడోలను నియమించి పెత్తనం చెలాయిస్తున్నారు. నిధుల్లేని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించి ఉద్దరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. స్వయం ఉపాధి కొరకు అందించే సబ్సిడీ రుణాలు నిలిపేశారు. బీసీల అభివృద్ధి, సంక్షేమంపై వైసీపీ మంత్రులు, నేతలు నోరెత్తకుండా అణచివేస్తున్నారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లినా బీసీల డిమాండ్ల సాధనపై ఏ రోజూ కేంద్రాన్ని నిలదీసింది లేదు. జగన్ రెడ్డి కుటుంబం ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు పెట్టింది పేరు. ఒక ఫ్యాక్షనిస్టు సోషలిస్టు ఎలా అవుతాడో ఆయనే చెప్పాలి. ముసోలిని ఇటలీకి ప్రెసిడెంట్‌ కాకముందు సోషలిస్ట్ అని చెప్పుకునేవాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో ఫాసిజాన్ని ప్రవేశపెట్టాడు. జగన్ కూడా ముస్సోలినికి ఏమాత్రం తీసిపోని విధంగా తన ఫాసిస్టు మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. కపట ప్రేమ చూపుతూ.. బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతున్నారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి మోసాలు, దుర్మార్గాలకు త్వరలోనే శుభం కార్డు వేసి.. నియంతృత్వానికి సమాధి కట్టడం తధ్యమని గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE