– జగన్ బంధువులే టీటీడీ చైర్మన్ పదవికి అర్హులా?
– జగన్ పాటించే సామాజిక న్యాయం ఇదేనా?
– రెడ్లకే టీ టీడీ చైర్మన్ పదవి రాసిచ్చేశారా?
– ఇంకెంతమందికి ‘రెడ్’కార్పెట్ వేస్తారు?
– హవ్వ.. క్రైస్తవుడికి టీటీడీ చైర్మన్ ఇస్తారా?
– హిందువుల మనోభావాలు పట్టించుకోరా?
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించడం వివాదాస్పదంగా మారింది. ఈయనను టిటిడి ఛైర్మన్‌గా నియమించడం హిందూసమాజాన్ని అవమానించడమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధుపరిషత్ అధ్యక్షులు ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద విమర్శించారు.
అదేవిధంగా యాదవ వర్గానికి చెందిన వారికి టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తారని ఇన్నాళ్లూ ప్రచారం చేసి, ఈ రోజు ముఖ్యమంత్రి తన సొంత సామాజికవర్గానికి టిటిడి ఛైర్మన్ పదవి ఇచ్చారని, దీనిని నిరసిస్తూ కర్నూల్ జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు, యాదవహక్కుల పోరాట సమితి రాష్ట్ర సహాయకార్యదర్శి రమేష్‌యాదవ్ వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వైఎస్ఆర్ పార్టీకి యాదవులు అండగా ఉంటే వారిని కేవలం ఓట్ల కోసం వినియోగించుకుంటున్నారని, పదవులు ఇవ్వటం లేదని ఆయన విమర్శించారు.
ఇది యాదవుల ఒక్కరిదేకాదు, మిగతా అన్ని వర్గాలు జగన్ పాలనలో ఆవేదనకు గురవుతున్నాయి. ఇతర కులాలను ఓట్ల కోసం ఉపయోగించుకున్న వైఎస్ఆర్ పార్టీ , పదవుల దగ్గరకు వచ్చేసరికి వారికి మొండి చెయ్యి చూపించి, తమ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తుండటం వారిని తీవ్రంగా కలిచివేస్తున్నది.
ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు… ముఖ్యమైన పదవులు ఇవ్వటంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న విధానాన్ని చూసి, జగన్ సర్కార్‌పై వారు రగిలిపోతున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేవరకు తమపై ముద్దులు కురిపిస్తూ, ఎక్కడాలేని ప్రేమను తమపై చూపించిన జగన్‌కు, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వర్గం వారు తప్ప మరెవరూ కళ్లకు కనబడటం లేదని బడుగులు ఆవేదన చెందుతున్నారు.
తితిదే పాలకమండలిలో తమకు అవకాశం కల్పించాలని గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు అక్కులప్ప డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న జగన్, టిటిడి బోర్డులో ఎస్టీలను ఎందుకు నియమించడం లేదని ఆయన ప్రశ్నించారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా తితిదే ఛైర్మన్‌గా తన బంధువైన వై.వి.సుబ్బారెడ్డిని నియమించారు. రెండవసారి కూడా వై.వి.సుబ్బారెడ్డిని నాలుగేళ్లపాటు కొనసాగించి, మూడవసారి కూడా తన బంధువు కరుణాకర్‌రెడ్డికి తితిదే ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఈ విధంగా మూడుసార్లు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవిని తన సామాజికవర్గం వారికి, తన బంధువులకే కట్టబెట్టడం ఏవిధంగా సమంజసమని బలహీనవర్గాలు జగన్‌ను ప్రశ్నిస్తున్నాయి.
గతంలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సైతం రెండుసార్లు, తన సామాజికవర్గానికి చెందినవారిని తితిదే ఛైర్మన్లుగా అవకాశం కల్పించారు. జగన్ పాలనలో తితిదే ఛైర్మన్లుగా పని చేయడానికి బలహీనవర్గాలకు అర్హత లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అన్ని ముఖ్యమైన పదవుల్లో ఛైర్మన్లుగా, అధ్యక్షులుగా తన వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రి నియమించుకుని, అందులో సభ్యులుగా ఇతర వెనుకబడిన వర్గాలవారికి పదవులు ఇస్తూ తమను అవమానిస్తున్నారని బలహీనవర్గాలు ఆవేదన చెందుతున్నాయి.
ప్రభుత్వ సలహాదారులుగా, సకల శాఖల మంత్రిగా ప్రభుత్వంలో అన్నీతానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఛీఫ్ సెక్రటరీ, డీజీపీ, టిటిడి ఛైర్మన్ వంటి ముఖ్యమైన పోస్టులను తన వర్గానికే కట్టబెట్టడం ద్వారా ఇతర కులాలపై తనకు ఏమాత్రం విశ్వాసం లేదని జగన్ చెబుతున్నారు.
జగన్ పాలనలో ముఖ్యమైన పదవుల్లో పనిచేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీలకు అర్హత లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఛైర్మన్లుగా తన సొంత సామాజికవర్గానికి పదవులు ఇచ్చి, వారి దగ్గర చేతులు కట్టుకుని పని చేయడం కోసం బలహీనవర్గాలకు, చిన్నచిన్న పదవులు కట్టబెట్టి పెత్తందారుల చెప్పు కింద రాయిలా పడి ఉండాలని జగన్ సందేశం ఇస్తున్నారు.
జగన్‌కు ఉన్న ఫ్యాక్షనిజం మనస్తత్వం కారణంగా.. తనవర్గం వారు బలహీనవర్గాలపై దాడులు చేస్తూ ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నా, వారిని వారించకుండా మరింతగా ఉసిగొల్పుతున్నారు. పైపెచ్చు బీసీలు, ఎస్సీలపై దాడులు చేస్తూ వారిపైనే పోలీసులచేత కేసులు నమోదు చేయించి వేధింపులకు గురి చేస్తున్నారు.
ఇవేకాకుండా భూమన కరుణాకర్‌రెడ్డిపై క్రిస్టియన్ అనే ముద్ర ఉన్నది. తన కుమార్తె వివాహాన్ని క్రిస్టియన్ పద్దతిలో నిర్వహించిన ఈయనను, కలియుగ దైవం వేంకటేశ్వరుడు కొలువుండే తిరుమల ఛైర్మన్‌గా నియమించడం అంటే.. టిటిడి పవిత్రతను నాశనం చేయడమేనని స్వామి శ్రీనివాసానంద విమర్శించారు.
గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణాకర్‌రెడ్డిని టిటిడి ఛైర్మన్‌గా నియమించినప్పుడు సైతం, క్రిస్టియన్‌కు ఈ పదవి ఏ విధంగా కట్టబెడతారని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అదేవిధంగా వేంకటేశ్వర స్వామిని ఈయన గతంలో నిందించారని.. అటువంటి వ్యక్తిని తితిదే ఛైర్మన్‌గా ఏవిధంగా నియమించారని విమర్శించడంతో తీవ్ర దుమారం రేగింది.
ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఆరాధ్య దైవం. కోట్లాది మంది హిందువులకు అతి ముఖ్య ఆరాధ్యకేంద్రం తిరుమల దేవస్థానం. ఈ క్షేత్రాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇటువంటి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ వినియోగించుకుంటున్నారు.
గతంలో వేంకటేశ్వరుడి దర్శనానికి జగన్ వచ్చినప్పుడు ఇతర మతాలవారు దేవస్థానంలోని రిజిస్టర్లో వేంకటేశ్వరుడిపై, తమకు నమ్మకం ఉన్నదని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే దర్శనానికి వెళ్లాలని చెప్పినప్పటికీ వినకుండా, మందీమార్బలంతో దైవదర్శనానికి వెళ్లి హిందువుల మనోభావాలను గాయపరిచారు.
దేవస్థానంలో ఉన్న పింక్ డైమండ్ చంద్రబాబు దొంగిలించి, విదేశాలకు తరలించారని అబద్ధాలు ప్రచారం చేసి, దేవుడినిసైతం తన రాజకీయాలకు ఉపయోగించుకున్న నీచ చరిత్ర జగన్‌ది. ఎన్నికల తర్వాత గెలిచిన వైసీపీ ప్రభుత్వమే.. అసలు టీటీడీలో పింక్ డైమండ్ లేదని జెఈఓ ధర్మారెడ్డితో చెప్పించింది.
అంటే వైసీపీ చివరకు వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకుందని హిందువులు గ్రహిస్తే మంచిది. తాజాగా టీటీడీలో జరుగుతున్న దారుణాలను హిందూ సమాజం మౌన ంగా అంగీకరించడం దారుణం.
పాలకులు అన్ని మతాలను, అన్ని కులాలను సమదృష్టితో చూడాలి. అధికారం చేతిలో ఉంది కదా అని చట్టాలను, రాజ్యాంగాన్ని, కోర్టులను, సాంప్రదాయాలను లెక్కచేయకుండా.. మేమేంచేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో, వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. సమయం కోసం వేచిచూస్తున్నారు.
గత తెలుగుదేశం పాలనలో రెండుసార్లు, బలహీనవర్గాలకు చెందిన వారిని టిటిడి ఛైర్మన్లుగా నియమించడం జరిగింది. దీనిని ఆదర్శంగా తీసుకుని జగన్ ప్రభుత్వంసైతం కరుణాకర్‌రెడ్డి నియామకాన్ని ఉపసంహరించి, బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తే ప్రజలందరూ హర్షిస్తారు.