– ఉద్యోగులపై నిఘా నేత్రాలు
– అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై వేధింపులు
-‘ఫార్మాసురుల’ ఉల్లంఘనలపై ‘మహానాడు’ కథనాలతో కుదుపు
– ‘మహానాడు’కు ఎవరు సమాచారం ఇస్తున్నారంటూ ఆరాలు
– దానితో ఆఫీసులో స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు భయపడుతున్న ఉద్యోగులు
– ఉద్యోగాలు పోతాయేమోనన్న ఆందోళనతో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు
– వచ్చిన వారిపై ఆరా తీస్తున్న వైనం
– బడా కంపెనీల లాబీయిస్టులకు మాత్రం స్వేచ్ఛ
– నిరంతరం పీసీబీ ఆఫీసులోనే కంపెనీ ప్రతినిధుల తిష్ఠ
(సుబ్బు)
ప్రశ్నించే పార్టీకి అధ్యక్షుడయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)లో పనిచేసే ఉద్యోగులకు స్వేచ్ఛ, కలసి మాట్లాడుకునే స్వాతంత్య్రం లేని దుస్థితి. నిరంతర నిఘా మధ్య బిక్కు బిక్కుమంటు బతకాల్సిన పరిస్థితి. కారణం.. మీడియాకు, ప్రధానంగా.. ‘మహానాడు’కు వారంతా పీసీబీ అంతర్గత సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానం! ఫలితంగా 15-20 ఏళ్ల నుంచి కేవలం 24 వేల రూపాయలతో వెట్టిచాకిరీ చేస్తున్న ఆ అవుట్సోర్సింగ్-కాంట్రాక్టు ఉద్యోగులకు, రోజు గడిస్తేచాలన్న బతుకుభయం.
కానీ.. బడా కంపెనీల వ్యవహారాలు చూసే లాబీయిస్టులు, వారి ప్రతినిధులు మాత్రం.. ఆఫీసులో స్వేచ్ఛగా తిరుగుతున్న వైచిత్రి. అయినా ఆఫీసులో జరిగే ఈ అనధికార నిర్బంధాన్ని మెంబర్ సెక్రటరీ పట్టించుకోరు. ఆయన ఆఫీసుపై దృష్టి పెడితే తమకు ఈ సమస్యలే రావన్నది వారి వా(వే)దన. అసలు ఆయన నేరుగా ఎవరితోనూ మాట్లాడరు. ఆయనే కాదు. పీసీబీలో ఉన్నత హోదాలో ఉన్న ఎవరూ వారితో నేరుగా మాట్లాడరు.
సూటిగా చెప్పాలంటే.. పీసీబీ ఆఫీసులో అవుట్సోర్సింగ్-కాంట్రాక్టు ఉద్యోగులు.. పైవారి దృష్టిలో అంటరానివారు, పనికిరాని వాళ్లట! మెంబర్ సెక్రటరీకి మరో మూడు శాఖలు అదనంగా ఉన్నాయి కాబట్టి, ఆయనకు పట్టించుకునే తీరిక ఉండదనుకోవచ్చు. కానీ ఇదే శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. పీసీబీ వ్యవహారాలు ఎందుకు పట్టవు? ఆఫీసులో ఆ స్మిక తనిఖీ చేసి, ఉద్యోగుల సమస్యలు ఎందుకు తెలుసుకోరు? ఎక్కడో చిత్తూరు జిల్లాలో అడవులను పరిశీలించిన ఆయన.. బెజవాడలోనే తన క్యాంపు ఆఫీసుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న, పీసీబీ ఆఫీసును ఎందుకు తనిఖీ చేయరన్నది ప్రశ్న.
విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు స్వేచ్ఛగా మాట్లడుకోలేని నిర్బంధ పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో పీసీబీ వ్యవహారాలు, బడా కంపెనీల ఉల్లంఘనలు, వాటిపై చర్యలు తీసుకోని వైనంపై వరస కథనాలు రాస్తున్న ‘మహానాడు’కు ఉద్యోగులే సమాచారం ఇస్తున్నారన్న అనుమానమే దీనికి కారణమట. ఆఫీసులో 60 శాతం అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే పనిచేస్తున్నారు. వీరిలో 15-20 ఏళ్ల నుంచి సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. వీరంతా ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న వారే. వీరి జీతం కేవలం 24 వేలు మాత్రమేనట. అది కూడా ఏజెన్సీల కింద పనిచేస్తున్నారు.
పై అధికారులకు వీరి పనితీరు నచ్చకపోతే, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు చెప్పి, వారిని అకారణంగా తొలగిస్తుంటారు. దానితో ఎప్పటికయినా తమను కాంట్రాక్టులోకి తీసుకోకపోతారా అన్న గంపెడాశతో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోజూ బితుకుబితకుమంటూ పనిచేస్తున్న పరిస్థితి. రాంకీ నుంచి.. క్రెబ్స్ వరకూ.. నిజానికి ‘మహానాడు’.. గత కొద్ది నెలల నుంచి పీసీబీ చట్టాలను అతిక్రమించి, తమ పలుకుబడితో నిరంతర ఉల్లంఘనలకు పాల్పడుతున్న రాంకీ, క్రెబ్స్, కేకే, హెటిరో డ్రగ్స్ ఇంకా అనేక బడా కంపెనీల చర్యలపై కథనాలు ఆధారాలతో సహా వెలువరిస్తోంది. ప్రధానంగా అనకాపల్లి-విశాఖ జిల్లాల్లో రాంకీ సహా, అనేక కెమికల్స్ కంపెనీ ఉల్లంఘనలపై కలం ఝళిపిస్తోంది.
స్వయంగా పీసీబీ ఉన్నతాధికారులకే దొరికిన ‘రాంకీ’ లాంటి బడా సంస్థపై.. ఇప్పటివరకూ చర్యల కొరడా ఝళిపించని వైనం వసర కథనాలు వెలువరిస్తోంది. వైసీపీ ఎంపి అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ఉల్లంఘనలపై స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా అసెంబ్లీలో ప్రస్తాలించారు. వైసీపీ హయాంలో వెలిగిన రాంకీ కూటమి జమానాలోనూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా దానిపై చర్యల కొరడా ఝళిపించే ధైర్యం చే యని పీసీబీ పలాయనవాదంపై ‘మహానాడు’ వరస కథనాలు వెలువరించింది. దానితో రాంకీకి నోటీసులిచ్చి చేతులు దులుపుకోవడమే తప్ప, దానిపై ఇప్పటివరకూ భారీ పెనాల్టీగానీ, క్రిమినల్ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.
దానిపై సీఐటియు వంటి కార్మిక సంఘాలు నేనల్ గ్రీన్ట్రిబ్యునల్లో సైతం కేసులు వేశారు. అనకాపల్లి లోని ఫార్మా-కెమికల్ కంపెనీలు.. తమ విష వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయకుండా, వాటిని గెడ్డలు, భూమిలో పారబోస్తున్న వైనం ఫొటోలు, వీడియోలతో సహా లెక్కలేనన్ని సార్లు మీడియాలో వచ్చింది, అయినా వాటిపై ఎలాంటి చర్యలు లేవు. చివరకు ఎమ్మెల్యే సమక్షంలో, గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా ఇప్పటివరకూ గెడ్డల్లో నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపే దిక్కులేదు. తాజాగా గన్నవరం శివారులో క్రెబ్స్-కేకేఆర్‌కు చెందిన రసాయన వ్యర్థాలను తీసుకునివచ్చి పొలంలో పారబోసిన వైనంపై ఇప్పటికీ చర్యలకు దిక్కులేకపోగా.. వాటిని డొమెస్టిక్ పవర్ అనుమతి మంజూరు చేశారు. ఇక ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్ వ్యవహారం అదో మాఫియా.
ఈ రకంగా శుద్ధి చేసి నిర్మూలించాల్సిన విష వ్యర్థాలను, చెరువులు, భూమిలో కలిపేసి ప్రజలు-పశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ‘ఫార్మాసురుల’ చర్యలపై, ‘మహానాడు’ నిరంతరం కలం ఝళిపిస్తూనే ఉంది. అంతేకాదు.. తమకు నచ్చిన వారికి పీసీబీ ఆఫీసులో వేలాదిరూపాయల జీతాలిచ్చి నియమించుకుంటున్న, అడ్డగోలు నియామకాలపై కలం ఝళిపించినా చర్య తీసుకున్న దిక్కులేదు. అయితే ఆ సమాచారమంతా పీసీబీ ఆఫీసులో పనిచేసే అవుట్సోర్సింగ్-కాంట్రాక్టు ఉద్యోగులే ఇస్తున్నారన్న అనుమానంతో, వారిని వేధిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక అధికారి కూడా తమను ఇలాగే వేధించేవారని, ఆయన వెళ్లిపోయినప్పటికీ ఇంకా అదే పరిస్థితి ఏర్పండిందని వాపోతున్నారు.
కలసి తినే వాతావరణం కూడా లేదు ‘మేం లంచ్ టైమ్‌లో కూడా పక్కపక్కనే కూర్చుని ఒకేచోట భోజనం చేసే వాతావరణం లేదు. మమ్మల్ని కలిసేందుకు బంధుమిత్రులొచ్చినా వారితో మాట్లాడే స్వేచ్ఛ లేదు. మేం ఎవరితో మాట్లాడుతున్నామో సీసీ టీవీ కెమెరాల్లో చూస్తారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరికి ఫోన్లు చేస్తున్నారో మాకు తెలుసు. ఆ దగ్గర అన్నీ ఉన్నాయి. పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయడం పది నిమిషాల పని’’ అంటూ బెదిరిస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.
అయితే తమను ఇంతలా వేధిస్తున్న ఉన్నతాధికారులు… బడా కంపెనీ ప్రతినిధులు, లాబీయిస్టులతో రోజూ టీలు తాగుతూ మాట్లాడుకుంటారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి పీసీబీ ఆఫీసులో అనకాపల్లి, విశాఖ, కాకినాడ జిల్లాలకు చెందిన పెద్ద కంపెనీల లాబీయిస్టులు రోజూ కీలకమైన విభాగాలు, కీలక వ్యక్తుల చాంబర్లలోనే తిష్ఠవేస్తుంటారన్న ఆరోపణలు, చాలాకాలం నుంచే ఉన్నాయి.
రాంకీతోపాటు, ఇటీవల డొమెస్టిక్ పవర్ అనుమతి పొందిన ఓ కంపెనీ ప్రతినిధి కూడా పీసీబీ ఆఫీసులోనే నిరంతరం దర్శనమిస్తుంటారని ఉద్యోగులు చెబుతుంటారు. ఇక ఆసుపత్రులకు సంబంధించిన, బయో మెడికల్ వేస్ట్ కంపెనీల ప్రతినిధులు కూడా ఆఫీసులో కనిపిస్తుంటారన్న ప్రచారం లేకపోలేదు. ‘మేమెందుకు సమాచారం ఇస్తాం. అసలు సమాచారం ఇవ్వడానికి మా దగ్గరకు ఫైళ్లు ఎందుకు వస్తాయి? మీటింగులకు మమ్మల్ని ఎందుకు రానిస్తారు? వాళ్లే కదా నిర్ణయాలు తీసుకునేది’’ అని అవుట్సోర్సింగ్-కాంట్రాక్టు ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ పవర్ చూపించాలి ఈ క్రమంలో తమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేస్తారనుకున్న ఆశలు అడియాశలవుతున్నాయని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలు పీసీబీ ఆఫీసులో జరిగే వ్యవహారాలు, తీసుకునే నిర్ణయాలేవీ పవన్ దృష్టికి తీసుకువెళ్లడం లేదమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘ఆయన తలచుకుంటే 15-20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న మమ్మల్ని బోర్డు కాంట్రాక్టులోకి తీసుకోవడం పెద్ద సమస్య కాదు. మా కళ్లముందు వచ్చిన వాళ్లు 40 వేలు, 90 వేలు తీసుకుంటున్నారు. పోనీ పవన్సారును కలుద్దామంటే ఎలా కలవాలో తెలియడం లేదు. ఈ రోజుల్లో ఇంటిఅద్దె, పిల్లల చదువులు, ఆడపిల్లలు చేయాలంటే 24 వేల జీతం సరిపోతుందా? ఈ విషయం ఎవరూ ఆలోచించకపోవడమే బాధాకరమ’ని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా పవన్ కల్యాణ్ తన పవర్ చూపించాలన్నది వారి కోరిక.




