-ఇచ్చిన హమీలను నెరవేర్చమంటే అరెస్టులు దుర్మార్గం
-ఏపీలో ఉన్న ఆంక్షలు కశ్మీర్ సరిహద్దుల్లో కూడా లేవు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియంతృత్వ పోకడ రోజు రోజుకీ హద్దు మీరి పోతోంది. హక్కుల కోసం పోరాడుతున్న వారిని, వైసీపీ పాలనా వైఫల్యాల్ని ఎండగడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ అడుగడుగునా అణగద్రొక్కుతున్నారు. రాజ్యాంగం ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్చ, తమ హక్కుల కోసం పోరాడే హక్కు కల్పించింది. కానీ ఆ హక్కుల్ని కాలరాస్తూ.. బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై జగన్ రెడ్డి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉఫాద్యాయులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అరెస్టులతో అడ్డుకోవాలని చూడడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఎన్నికల్లో మీరిచ్చిన హామీ నెరవేర్చమంటున్నారు తప్ప జగన్ రెడ్డి లోటస్ పాండ్ లో వాటా అడగటం లేదు కదా? ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఏంటి? ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రజల హక్కు. ఆ హక్కుని సైతం హరించేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయుల ధర్నాకు ప్రభుత్వం ఆంక్షలు విధించి దారి పొడవునా ముళ్ల కంచెలు విధించటం, ఒక్కో ఉపాధ్యాయునికి ముగ్గురు పోలీసుల్ని కాపలా పెట్టడం ఆక్షేపనీయం. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో ఉన్న ఆంక్షలు కశ్మీర్ సరిహద్దుల్లో కూడా లేవు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించేవారిని, ఇచ్చిన హామీలు అమలు చేయమని శాంతియుతంగా పోరాడుతున్న వారిపై పోలీసుల్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టారు. మరుగుదొడ్లు కడిగించారు. బయోమెట్రిక్ పేరుతో వేధించారు. తాజాగా వేసవి సెలవుల సమయంలోనూ ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిందే అంటూ ఉత్తర్వులిచ్చారు. ఇన్ని రకాలుగా ఉపాద్యాయుల సేవల్ని వాడుకుంటూ.. హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం జగన్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనం. హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్టు చేయడమంటే ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కడమే. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.