• జల వనరులున్నాయా? పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారు?
• ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆరా
అమరావతి: పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఈ సంస్థకు 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగు చూసిన క్రమంలో ఉప ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో చర్చించారు. ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియచేయడంతో పాటు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించవలసిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు.
వాగులు, వంకలు, కొండలు ఉన్నందున ఆ సంస్థకు పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో తెలియచేయాలని పి.సి.బి.కి ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో ఉప ముఖ్యమంత్రి సమీక్షించాలని నిర్ణయించారు.