– రోగులను ఐసియులో ఎక్కువ రోజులు ఉంచాలన్న ఆసుపత్రి యాజమాన్యం
– డబ్బుల కోసం రోగుల జీవితాలతో ఆడుకోలేనన్న ఓ మహిళా యువ డాక్టర్
– డబ్బు జబ్బున్న ఆసుపత్రి నాకొద్దని ఉద్యోగానికి రాజీనామా
– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న మహిళా డాక్టర్ నిర్ణయం
– వైద్యారోగ్యశాఖ బతికుందా? కోమాలో ఉందా?
– కార్పొరేట్ కాసుల కక్కుర్తిపై పాలకుల చర్యలేవంటూ నెటిజన్ల ఫైర్
ఇది రోగాలను చూపి భయపెట్టి బతుకుతున్న మెడికల్ బందిపోట్ల మాఫియాను చెర్నాకోల్‌తో కొట్టిన ఓ అపురూప ఘటన. రోగుల ప్రాణాలే పెట్టుబడిగా, వారి ఆశలే ధనాలంబనగా బతుకుతున్న మెడికల్ మాఫియా రక్తపుకూటిని, చూపుడువేలితో ప్రశ్నించిన ఓ మహిళా యువ డాక్టర్ సాహ సి కథ. ఆ రక్తపుకూడు నాకొద్దని ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ మహిళ తిరుగుబాటు గాథ. మరి ఇది రోగుల రక్తపుకూటితో బతుకుతున్న మిగిలిన డాక్టర్లకు కనువిప్పు అవుతుందా? అదే ఇప్పుడు హాట్‌టాపిక్.
ఒక యువ మహిళా డాక్టర్ మంచి పేరు ఉన్న హాస్పిటల్లో ఉద్యోగం ప్రారంభించింది. ప్రొఫెషనల్ వాతావరణం, మంచి జీతం ఉంటుందని ఆశించింది. కానీ ఆమె మొదటి రోజే చూసిన విషయాలు ఆమెను పూర్తిగా షాక్‌కు గురి చేశాయి. ఆ హాస్పిటల్ యజమాని అయిన గైనకాలజిస్ట్, అవసరం లేకపోయినా చాలా మంది పేషెంట్లను అడ్మిట్ చేయాలని ఇంకా వారిని ఎక్కువ రోజులు ICUలో ఉంచాలని స్టాఫ్‌కి సూచించినట్లు తెలుస్తోంది. లక్ష్యం ఒక్కటే… హాస్పిటల్ ఆదాయం పెంచడం.
ఈ పరిస్థితిని చూసిన ఆ డాక్టర్, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. “డబ్బు కోసం రోగుల ఆరోగ్యంతో ఆటలు ఆడలేను” అని ఆమె స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వైద్య రంగంపై పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా నెటిజన్లు ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ, “ఇలాంటి డాక్టర్లు ఇంకా ఉన్నారా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన ఒక కీలక ప్రశ్నను ముందుకు తెస్తోంది…వైద్యం కేవలం వ్యాపారంగా మారిపోతుందా?
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహానికి అంతులేకుండా పోతోంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, కరీంనగర్, విశాఖ, గుంటూరు.. ఇలా ఒకటేమిటి? అన్ని ప్రైవేటు ఆసుపత్రులదీ ఇదే దారిదోపిడీ. ప్రతి విభాగంలో పనిచేసే డాక్టర్లకు టార్గెట్లు, ఇన్సెంటివులు, ఫారిన్ ట్రిప్పుల ఎర. ఒక పేషెంటు నుంచి ఇన్ని లక్షలు వసూలు చేయాలన్న నిబంధన. ఇది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నదే. ఇక ఖరీదైన రోగి అయితే అంతే.
పాలక పార్టీల-ప్రతిపక్ష పార్టీలతో అంటకాగి, వారికి ఎన్నికల నిధులు సమర్పించుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాలను చూసి భయపడటం ఎప్పుడో మానేశాయి. అసలు వీటిపై ఆరోగ్యశాఖ నియంత్రణ ఎప్పుడో కోల్పోయింది. అందుకే రోగుల బిల్లుల గురించి మంత్రులు ఫోన్ చేసినా డోంట్ కేర్ అంటారు.
చిన్న రోగమొస్తే ఐసియు, పరీక్షలు, ఆపరేషన్ల పేరిట లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్న ఈ కార్పొరేట్ ఆసుపత్రుల సంపాదనపై, అటు ఆదాయపపన్ను శాఖ కూడా ‘శీతకన్నే’సింది. కారణం ‘మామూలే’, ఇలాంటి డబ్బు జబ్బున్న కార్పొరేట్ ఆసుపత్రుల కాలంలో.. ఒక మహిళా యువ డాక్టర్ ఈ దోపిడీని ప్రశ్నించి రాజీనామా చేయడం గ్రేట్. మరి ఈ ఆత్మాభిమానం, ప్రజలపై చిత్తశుద్ధి ఉన్న మిగిలిన డాక్టర్ల సంగతేమిటి? వారికి డబ్బు జబ్బు తగ్గదా? నిస్సిగ్గు-నిర్లజ్జగా రోగుల ప్రాణాలను బలిపీఠమెక్కించి, వారి డబ్బుతో చలి కాచుకుంటారా?
అంటే జనం పొట్టకొట్టి తమ కడుపులు నింపేసుకుంటారా? యాక్.. థూ! వారిదీ ఒక బతుకేనా? సందుల్లో పందులవలె కుక్కల వలె!.. ఏమైపోయారు మానవ హక్కుల సంఘాల నాయకులు? ఏమైపోయాయి వామపక్ష సంఘాలు? ఎక్కడున్నారు నక్సలైట్లు?.. అన్నది నెటిజన్ల ఆగ్రహం.