Suryaa.co.in

Andhra Pradesh

మీ బాబు మంచోడే అయితే.. ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?

– అధికారంలో ఉంటే క్యాష్‌..ఆ తర్వాత క్వాష్‌:ఇదీ టీడీపీ తీరు
-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

గ్యారంటీ లేని చవటలు వీళ్ళు
రాజకీయాల్లో గ్యారంటీ లేని ఎల్లో బ్యాచ్‌.. ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామంటూ మాట్లాడుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి. వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. వీళ్ళు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామంటే నవ్వుకుంటున్నారు. వీరంతా మీటింగులు పెట్టుకుని, పనిగట్టుకుని ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో చేతగాని చవట సన్నాసులు ఈరోజు ఆ పార్టీ మీటింగ్ లో నోటికొచ్చినట్లు మాట్లాడారు.

చంద్రబాబు కొడుకు లోకేశ్‌ మాట్లాడుతూ.. వాళ్ల నాన్న చాలా మంచోడని, మహానుభావుడని ఏ తప్పూ చేయలేదని అంటున్నాడు. నోట్లో వేలుపెడితే కొరకడం కూడా చేతగాదంట. మీ నాన్న చంద్రబాబు నోట్లో వేలు పెడితే కొరకడేమో గానీ.. పిల్లనిచ్చి అక్కున జేర్చుకున్న మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కునే సిద్ధహస్తుడు. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ.. కుట్రలు, కుతంత్రాలకు పుట్టినిల్లుగా టీడీపీని నడుపుతున్న దుర్మార్గుడు చంద్రబాబు.

టీడీపీ వ్యాపారసంస్థకు సీఈవో బాబు
లోకేశ్‌ ఢిల్లీకి వెళ్లి మా నాన్న రూ.17 లక్షల కోట్లు బడ్జెట్‌ను ప్రవేశపెడితే, స్కిల్ స్కాంలో రూ.27 కోట్లు కొట్టేశాడని చెబితే.. ఎవరూ నమ్మడంలేదని గొప్పగా పలికాడు. నిజమే.. మీ నాన్న కేవలం రూ.27 కోట్లు దోచేశాడంటే ఎవరూ నమ్మరు గాక నమ్మరు. స్కిల్ స్కాంలో మీ నాన్న చంద్రబాబు దోచేసింది రూ. 27 కోట్లు కాదు, రూ. 371 కోట్లు. రూ. 3 వేల కోట్లు వస్తాయని చూపించి.. రూ. 371 కోట్లు తెలివిగా కొట్టేసిన దొంగ చంద్రబాబు.

ఇక మీరు చెబుతున్నట్టుగా, మీ హయాంలో 17 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే.. అందులో కనీసంగా 10 శాతం కొట్టేయగల సిద్ధహస్తుడు, అవినీతిలో చేయి తిరిగిన చక్రవర్తి మీ తండ్రి చంద్రబాబు అని దేశం మొత్తం తెలుసు. అంటే, కనీసంగా రూ.2 లక్ష కోట్లు కొట్టేసిన ఘనాపాటి చంద్రబాబు. మీ నాన్న చేసింది రాజకీయం కాదు. రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని చేసిందంతా వ్యాపారమే కదా. టీడీపీ అనే ఒక వ్యాపార సంస్థకు చంద్రబాబు సీఈవోగా పనిచేశాడు తప్పితే.. ఏనాడూ నాయకుడుగా పనిచేయలేదు.

మీ ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
చంద్రబాబు, లోకేశ్‌ గజదొంగల ముఠాకు నాయకులు. వీళ్ల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై, వీళ్ల ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ కోరే దమ్మూధైర్యం ఉందా..? అని సవాల్ చేస్తున్నాను. అధికారంలో ఉన్నన్నాళ్లూ దోచుకోవడం, దాచుకోవడమే వీరు నేర్చిన విద్య. ఇప్పుడు ఆ అక్రమాల బాగోతం అంతా బయటకు తీస్తున్నారనే దుగ్ధతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, ప్రభుత్వంపై కుట్రలతో విషప్రచారం చేయడమే వీరు పనిగా పెట్టుకున్నారు.

పెత్తందారులకు ప్రతినిధి బాబు
చంద్రబాబు అరెస్టు, జైలుపై ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఎక్కడైనా స్పందన కనిపించిందా..?. చంద్రబాబును అరెస్టు చేసి, నంద్యాల నుంచి రాజమండ్రి వరకు కారులో తీసుకెళ్తే ఆయా వర్గాల నుంచి ఏ ఒక్కరైనా ముందుకొచ్చి మీకు మద్దతు చూపించలేదేం..? అంటే, చంద్రబాబు అందరివాడు కాదు- “మా ఒక్కరి వాడే” అన్నది చెప్పకనే చెప్పారు. బాబు కోసం అక్కడక్కడా ధర్నాలు, రాస్తారోకోలు చేసింది కూడా ఆయన సొంత సామాజికవర్గం వాళ్లే కదా..?

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, బెంగళూరులో, ఆయా దేశాల్లో చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన వారు మాత్రమే నిరసనలు చేశారు గానీ.. ఆంధ్రాలో ఏ ఇతర సామాజికవర్గాల వారు రోడ్డుమీదకొచ్చి మద్దతు తెలపలేదు. చంద్రబాబుకు మద్దతుగా నిలబడింది వారికి సంబంధించిన పెత్తందారీ, పెట్టుబడిదారీ వర్గాలే మినహా ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రజల నుంచి సానుభూతి కనిపించలేదు. ఇది అందరి కళ్లకు కనిపించిన వాస్తవం.

అధికారంలో ఉంటే క్యాష్‌.. ఆ తర్వాత క్వాష్‌:
చంద్రబాబు, ఆయన ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడిది ఒకటే బాణీ.. ఒకటే మాట. అధికారంలో ఉన్నన్నాళ్లూ క్యాష్‌ పిటీషన్‌లంటూ అందినకాడికి దోచుకుంటారు. అధికారం పోయాక, అవినీతిశాఖకు చిక్కి కేసుల్లో ఇరుక్కుంటే మాత్రం కోర్టుల్లో మా మీద కేసులు ఎత్తేయాలంటూ.. క్వాష్‌ పిటిషన్లు వేస్తుంటారు. న్యాయస్థానాల్లో లీగల్‌గా పోరాటం చేయలేని వీళ్లు.. ప్రభుత్వం మీద, జగన్‌గారి మీద బురదజల్లే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. వీరి అనైతిక చర్యలన్నింటినీ ప్రజలు దగ్గరగా గమనిస్తూనే ఉన్నారు.

హైదరాబాద్‌ వాసులకు ఆంధ్రలో పెత్తనమేంటి..?
చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ ఉండేదేమో హైదరాబాద్‌లో .. వారు రాజకీయాలు చేయడానికి, అధికారం కోసం ఆంధ్రరాష్ట్రం కావాలంట. అసలు, ఏ అర్హతతో మీరు ఇక్కడ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పండి..? 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీచేసి పొత్తుతో అధికారంలోకొచ్చి ఏం వెలగబెట్టారు.?.

మీరంతా కలిసి ప్రజాధనం దోచుకుని, ఇప్పుడు సాక్ష్యాధారాలతో దొరికి దొంగలా జైలుపాలయిందేగాక.. మళ్లీ మేము కలిసివస్తాం.. దీవించండి.. ఆశీర్వదించండి అంటారా.. ఈసారి మీరిద్దరూ ప్రజల ముందుకెళ్తే వాళ్లు మీ ముఖాలపై ఉమ్మేయడమే తరువాయిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఇద్దరుగా గాకుండా ముగ్గురు, నలుగురుగా వచ్చి ఎన్నికల్లో నిలబడి ప్రజల ముందు పొర్లుదండాలు బెట్టినా మీకు ఓటమే తప్ప గెలుపు రాతలేదని హెచ్చరిస్తున్నాను.

పేదల దేవుడు జగన్ గారు
టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో రిమాండ్‌ ఖైదీగా దాదాపు 40 రోజుల పాటు ఉంటే, రాష్ట్రంలోని ఏ ఒక్కరూ పెద్దగా పట్టించుకోవడంలేదంటే.. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందనే భావనలో ప్రజలున్నారని చెప్పాలి. అదే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఆదరిస్తున్నారు.

అంటే, పేదల పక్షాన నిలిచిన దేవుడిగా ఆయన్ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదవర్గాలు ఆదరిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఆయన ఆయా వర్గాలను అక్కునజేర్చుకుని నవరత్నాల పథకాల రూపంలో సంక్షేమాన్ని అందిస్తున్న పెద్దదిక్కుగా నిలబడ్డారు. కనుకే, మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా రావాలని ఆయా వర్గాల అక్కచెల్లెమ్మలతో పాటు సోదరులంతా ఎదురు చూస్తున్నారు.

రావాలి జగన్‌.. కావాలి జగన్‌..
అవినీతి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న జగనన్న వద్దనుకునేది..టీడీపీ,జనసేన నాయకులు మాత్రమే. ప్రజలంతా మళ్లీ మా ముఖ్యమంత్రి జగనన్నే అంటున్నారు. పేద పిల్లలు గొప్పగా చదువుకోవాలని, విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తెచ్చి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన మహానుభావుడు మా జగన్‌గారు. అదేవిధంగా డీబీటీ ద్వారా పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఇప్పటికే రూ.2.37 లక్షల కోట్లు జమ చేసిన సంక్షేమసారథి మా జగన్‌.

మరి, గతంలో కూడా, చంద్రబాబు హయాంలో కూడా ఇదే రాష్ట్ర బడ్జెట్‌ ఉంటే, అప్పుడు పేదలకు ఈ రకమైన లబ్ధి ఎందుకు అందించలేకపోయారు..? అని నిలదీస్తున్నాం. దీనికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయడంతో పాటు 22 లక్షల ఇళ్ల నిర్మాణంతో, ఏకంగా జగనన్న ఊళ్లు ఏర్పడ్డాయి. అందుకే, ప్రతీ గడపగడపనా జగనన్న చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగాయి. మళ్లీ మా జగనన్నే ముఖ్యమంత్రి అనే నినాదం ఇంటింటా వినిపిస్తుంది.

రాబోయే 20 ఏళ్లూ సీఎంగా జగనన్నే
భవిష్యత్తే లేని వాళ్ళు.. భవిష్యత్తు పేరుతో కలలుగంటూ మేం అధికారంలోకి వస్తాం.. కోస్తాం.. తీస్తాం.. అంటూ మాటలు పేలే టీడీపీ నేతలకు నేనొక హెచ్చరిక చేస్తున్నాను. మీ భవిష్యత్తుకు గ్యారంటీ కాలం ముగిసిపోయింది. 2024 తర్వాత మీరంతా సొరకాయలు, బీరకాయలు కోసుకుని అమ్ముకోవడమే జీవించమని.. మీ భవిష్యత్తును ప్రజలు రాసిపెట్టి ఉంచారు.

2024 తర్వాత టీడీపీ-జనసేన రాజకీయంగా కనుమరుగు అవడం ఖాయం. అసలైన భవిష్యత్తుకు గ్యారంటీ ఏమంటే, రాబోయే 20 ఏళ్లూ మా జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే శిలాశాసనంగా ప్రజల హృదయాల్లో లిఖించి పెట్టుకున్నారని మంత్రి జోగి రమేష్ స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE