– బీసీని ముఖ్యమంత్రిని చేసిన పరిస్థితి ఉందా?
– బీసీలో చేరిన బీసీ కమ్యూనిటీని కన్వెర్టెడ్ బీసీ అని ఎలా అంటారు?
– 1971లో లంబాడీలు కూడా ఎస్టీల్లో చేరారు. మరి వాళ్లు కన్వెర్టెడ్ ఎస్టీలు అవుతారా?
– ఓబీసీ మోర్చా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు..పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద.. దేశంలో 10 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లు వేయడం జరిగింది.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. కానీ రెండు సంవత్సరాలు కావొస్తున్నా.. బీసీల రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించకుండా.. చేతకాని తనంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బట్టకాల్చి వేసే ప్రయత్నం చేస్తోంది.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న 42 శాతం రిజర్వేషన్ బీసీలకు మేలు చేసే రిజర్వేషన్లు కావు. మతపరంగా, ఓట్ల పరంగా రాజకీయాల కోసం ముస్లింలకు మేలు చేసే రిజర్వేషనే తప్ప.. బీసీలకు మేలు చేసే రిజర్వేషన్ కాదు.
ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు జరిగిన రాష్ట్రం ఇది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 12 శాతం మతపరమైన రిజర్వేషన్లు తెస్తామని అనేక ప్రయత్నాలు చేశారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసే నాటీ సీఎం కేసీఆర్.. శాసనసభలో ప్రకటించారు.
ముస్లింలకు మేలు చేసే ప్రయత్నమే కాదు.. కేసీఆర్ 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన విషయాన్ని బీసీలు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ లో 150 డివిజన్లలో 33 శాతం డివిజన్లను గతంలో బీసీలకు కేటాయించే పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ పోతూ పోతూ.. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ పోయారు. మళ్లీ ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్న.. 34 శాతం ఉన్న రిజర్వేషన్ బీసీలకు పెరిగిందా.. తగ్గిందా? చెప్పాల్సిన అవసరం ఉన్నది.
42 శాతం రిజర్వేషన్ లో 10 శాతం ముస్లింలకు తీసివేస్తే.. బీసీలకు మిగిలేది 32 శాతమే. మీరు 42 శాతం రిజర్వేషన్ అని ఆడంబరంగా చెబుతున్నారు కానీ.. గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్ కంటే మీరు ఇస్తున్న రిజర్వేషన్ 2 శాతం తక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బీసీలకు మేలు చేసే రిజర్వేషన్ కాదు ఇది.. నష్టం చేసే చట్టమిది.
అన్ని వర్గాల జనాభా పెరిగిందని సర్వేలో చూపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీల జనాభా మాత్రం తగ్గించి చూపించారు. వీళ్ల సర్వే కూడా సరిగ్గా జరగలేదు. హైదరాబాద్ లో వీరు 20 శాతం ఇండ్లళ్లలోకి కూడా వెళ్లలేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42కు 42 శాతం రిజర్వేషన్ బీసీలకే ఇవ్వాలి.
ఇందులో నుంచి ముస్లింకు ఇస్తామంటే మేము ఊరుకోం. బీసీలకు న్యాయం జరగాలంటే.. కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. అలాకాకుండా.. దొడ్డిదారిలో మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తే చూస్తో ఊరుకోం.
బీజేపీ తరఫున చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం.. 32 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీల మేడల కోసే ప్రయత్నాలు చేయడం అన్యాయం. మీరు ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ.. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్లు ముందు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వరుసగా11 ఏండ్లపాటు ఒక బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీది. ఏ మాత్రం అధికారం లేని బీసీ కమిషన్ కు చట్టబద్దంగా రాజ్యాంగ హోదా కల్పించి, అన్ని రకాల హక్కులు ఇచ్చిన పార్టీ బీజేపీ. కేంద్ర ప్రభుత్వంలో 28 మందిని బీసీలను మంత్రులు చేసిన ఘనత బీజేపీదే.
కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని మీరు పరిపాలించారు. ఏ ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని చేసిన మొఖాలేనా మీవి? బీసీని ముఖ్యమంత్రిని చేసిన పరిస్థితి ఉందా? అనేక సార్ల అవకాశం వచ్చినా.. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను అటు ప్రధానిని, ఇటు సీఎంను చేయలేదు. అలాంటి చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు.
స్వాతంత్ర్యం రాకముందు.. బ్రిటీష్ వాళ్లు జనాభా లెక్కల్లో కులగణన చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఈ దేశాన్ని అనేక ఏండ్లు పాలించింది. జనాభా లెక్కలు చేసింది తప్పా.. కులగణన వివరాలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎగిరెగిరి పడుతున్నడు.
అయ్యా.. రాహుల్ గాంధీ మీ నాన్న, మీనానమ్మ, మీ తాత.. మీ కుటుంబం, మీ పార్టీ ఏండ్ల తరబడి అధికారంలో ఉన్నారు కదా.. మరి బీసీల కులగణన ఎందుకు చేయలేదో చెబుతూ.. పార్లమెంట్ ముందు నువ్వు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉన్నది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకున్నది. శాస్త్రీయంగా, చట్టబద్ధంగా దేశమంతా కులగణన చేయాలని, దేశంలో అన్ని సామాజికవర్గాల వివరాలను వచ్చే ఏడాది లెక్కించబోతున్నది మోదీ సర్కారు. వచ్చే ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జనాభా లెక్కల్లో బీసీల కులాగణన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది.
దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ గౌరవాన్ని పెంచే ప్రయత్నం, బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం అటు రాహుల్ గాంధీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ప్రయత్నించలేదు. సీఎం రేవంత్ రెడ్డి అసంబద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు, స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అంటున్నాడు. బీసీలో చేరిన బీసీ కమ్యూనిటీని కన్వెర్టెడ్ బీసీ అని ఎలా అంటారు? 1971లో లంబాడీలు కూడా ఎస్టీల్లో చేరారు. మరి వాళ్లు కన్వెర్టెడ్ ఎస్టీలు అవుతారా?
నోటికి ఏదొస్తే.. అది మాట్లాడటం.. హీరోయిజం, గొప్పతనం కాదు. ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు. ప్రజలు అన్ని పార్టీలను, అందరు నాయకులను చూస్తున్నారు. అందుకే గత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెప్పారు. పోలింగ్ స్టేషన్ కు వచ్చిన 100 మందిలో 37 మంది ఈ తెలంగాణ గడ్డమీద కాషాయ జెండా ఎగరాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి.