జగన్ పాలనలోఅవినీతి,అరాచకం,అప్పులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని, కేంద్ర పథకాలపై జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని, పేదల కోసం ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారని, విశాఖపట్నాన్నిభూ రాబందుల కేంద్రంగా మార్చారని,బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకి పైగా ఇచ్చామని, ఆ డబ్బంతా ఏమైందని, ఆ డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపిస్తోందా అని,మైనింగ్, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ ఇలా అన్నిటిలోనూ వైసీపీ నాయకులే ఉన్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ పరిపాలనపై నిప్పులు చెరిగారు.
ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ నిర్ణయించారని,దానికి ప్రధాని మోదీ భూమిపూజ కూడా చేశారు. దాని చుట్టూ జాతీయ రహదారులు, రైల్వే లైన్లు ఇస్తే జగన్ రెడ్డి దౌర్భాగ్యపు పాలనతో రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసారని, అత్యంత అరాచక,అవినీతి ప్రభుత్వంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా మండిపడ్డారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్, ఎడ్యుకేషన్ ఇలా అన్ని రంగాల్లో కుంభకోణాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని నడ్డా ధ్వజమెత్తారు.
ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని, ఇలాంటి అన్యాయ, అరాచక పాలనను తానెక్కడా చూడలేదన్నారు.శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, ఎక్కడా శాంతి కనిపించదు, భద్రత వినిపించదని,కేంద్ర నిధులను దారిమళ్లిస్తూ అసమర్థ ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచిందని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ పాలనతో రాష్ట్రంలో అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని,రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసిందని, అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని, చివరికి జీతాలు ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం చేరడం సిగ్గుచేటని తిరుపతి,విశాఖ పట్నం బహిరంగ సభల్లో కేంద్ర బిజెపి పెద్దలు, రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడారు.
సంతోషం. మరి వీటి అన్నిటికి కారణం మీరు కాదా? కమలనాధులు ఇన్ని రోజులకు కళ్ళు తెరవడం సంతోషం. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ రెడ్డి ప్రభుత్వం నరకం చూపిస్తుంటే పట్టించుకోకుండా దృత రాష్ట్రుని పాత్ర పోషించిన బిజెపి నాయకులు ఇప్పుడు వచ్చి ఏమి ఎరగనట్లు నటిస్తూ జగన్ పాలన పై విమర్శలు చెయ్యడం ఎవరిని మోసం చెయ్యడానికి? అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని కేంద్ర, రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడటం సిగ్గు చేటు. ఇవి పెరిగిపోవడానికి కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వం కాదా? అప్పులు,అరాచకం,అవినీతిపై నాలుగేళ్లుగా బిజెపి కేంద్ర పెద్దలు ఎందుకు మాట్లాడలేదు?
నాలుగేళ్లుగా పగ,ప్రతీకారంతో రగిలిపోతూ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తుంటే పట్టించుకోకుండా వదిలేసి,రాజకీయ అవసరాలకోసం జగన్ కి అనుకూలంగా వ్యవహరించి ఇప్పుడు బహిరంగ సభలు పెట్టి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసి రాష్ట్రం పై ప్రేమ చూపిస్తూ జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు కమల నాథులు.కేంద్ర ప్రభుత్వం అండ లేకపొతే జగన్ రాష్ట్రం పై ఇంత వీర విహారం చేస్తాడా? కక్ష సాధించడం కోసం పురోగమన బాట రాష్ట్రాన్ని తిరోగమనం లోకి నెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడానికి 2019 ఎన్నికల్లో సహకరించింది బిజెపి కాదా? ఒక్క మాటలో చెప్పాలంటే నేడు రాష్ట్రం సర్వనాశనం కావడానికి కూడా బిజెపి కి కూడా బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ పట్ల భాధ్యతతో వ్యవహరించవలసిన కమలనాథులు కుటిలనీతితో వ్యవహరించారు.రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినా నోరు మెదప లేదు .నూతన రాజధాని అమరావతికి ప్రధాని చేసిన శంకుస్థాపనకు విలువ లేకుండా చేశారు .
అమరావతి రెక్కలు విరిసినా కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు. బహుళ నాల్కలతో వ్యవహరిస్తూ, అమరావతి పక్షాన నిలిచినట్టుగా నటించారు బిజెపి నాయకులు.ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రమే అసలు దోషి.కేంద్రం తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల నాటకానికి క్షణాల్లో తెరదించగలదు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అయినా రాజదాని విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నా పట్టించుకోవడంలేదు.రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ దయనీయ పరిస్థితిలోవున్నది.
గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. దానిని ఇళ్ల స్థలాల పేరుతో ఆర్ 5 జోన్ తెచ్చి దానిని జగన్ ప్రభుత్వం ద్వంసం చేసినా కేంద్రం నోరు మెదపడం లేదు . ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని తరలింపు ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోంటుందని రాజధాని రైతులు ఆశ పెట్టుకున్నారు. కానీ రాజధాని తరలింపు విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిధి అని బిజెపి నాయకులు చెప్పడంతో వైసీపీ,బిజెపి లోపాయికారి అవగాహన ఉందని స్పష్టంగా అర్ధం అవుతుంది.జగన్ ఆడిన మూడు ముక్కలాటకు కేంద్రం తలచుకొంటే ఒక్క నిముషంలో తెరదించగలదు.
నాలుగేళ్లుగా బిజెపి-జగన్ రెడ్డి దుష్పరిపాలనకు దన్నుగా నిలుస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు కేంద్ర బిజెపి నాయకులు. జగన్ రెడ్డి ఎన్నిసార్లు, ఏ టైములో అపాయింట్ అడిగినా ప్రధాని నరేద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ అడిగినా మెంట్ ఇచ్చేవారు.
ఆర్ధిక అరాచకానికి పాల్పడి దొంగ తనంగా ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనలు ఉల్లంఘించి,కేంద్రం కళ్ళు కప్పి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చినా ఒక్క మాట అనకపోగా, ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చారు కేంద్ర పెద్దలు.
అరాచక పాలన చేస్తూ,అక్రమ కేసులు పెడుతూ, నిరంకుశంగా, ఫాసిస్టు పాలన సాగిస్తున్నా జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచింది బిజెపి.తొమ్మిది ఏళ్లుగా బిజెపి దగా పాలనను రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే వున్నారు. రాష్ట్రానికి బిజెపి అనేక అంశాల్లో ద్రోహం చేస్తూనే వుంది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. తానే చట్ట సభల్లో, బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ఆంధ్ర ప్రజలను అవమానించింది. పార్లమెంటులో ప్రభుత్వం పై చార్జి షీట్లు వేస్తున్నాం,వైసిపి నాయకుల అవినీతి నిగ్గు తేలుస్తాం,మేము జగన్ కి మద్దతుగా లేము అంటూ రాష్ట్ర బిజెపి నాయకులు ఎన్ని బీరాలు పలికినా, కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షమో వారి చర్యలు ద్వారా అర్ధం అవుతుంది.
వారి సహజీవనం అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు.జగన్ ప్రభుత్వానికి కేంద్ర అండదండలు దండిగా ఉన్నాయని అనేక అంశాల్లో వెల్లడైంది.వివేకా హత్య కేసులో పాపాలన్నిటికి ప్రత్యక్ష ముద్దాయి ఎంపీ అవినాశ్ రెడ్డే అని తేలినా అతని పై ఈగ వాలకుండా,అరెస్టు చెయ్యకుండా సీబీఐ ఆడుతున్ననాటకం వెనుక కేంద్ర పెద్దలు వున్నారని ప్రజలందరూ అంటున్నారు.
బిజెపి-వైసీపీ మధ్య భంధం లేకపోతే అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చెయ్యరు ?
మేం అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై వున్న అవినీతి కేసుల లెక్క తేలుస్తాం,విచారణ వేగంగా పూర్తిచేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చి 9 ఏళ్ళు దాటింది .మోడీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఆర్ధిక నేరస్థుడు పైనా అయినా ఈగ వాలక పోగా మోడీ పాలన లో ఆర్ధిక నేరస్థులు అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఆర్ధిక నేరస్థుల అంతు చూస్తానని ఇచ్చిన హామీ కూడా నేతి బీర చందమైంది.
ఆర్ధిక నేరస్థుల అంతుచూస్తానన్న హామీ విని దేశ ప్రజలు ఉప్పోoగి పొయ్యారు. కానీ ఆ హామీకి విలువ ఇవ్వక పోవడంతో ప్రజల ఆశలు ఆవిరయ్యాయి.ఆర్ధిక నేరస్థులను సహించేది లేదన్న మోడీ విస్పష్ట హెచ్చరిక పసలేనిదిగా మిగిలి పోయింది. అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్న జగన్ పై వున్న 16 చార్జి షీట్ల పై విచారణ పై ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్షంలో ఉండగా ప్రతిశుక్రవారం కోర్టు బోనులో నిలబడిన జగన్ రెడ్డి నాలుగేళ్లుగా ఒక్క సారి కూడా వాయిదాలకు కోర్టుకు వెళ్లిన పరిస్థితి లేదు?
రూ 43 వేలకోట్లు దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ప్రాధమిక నివేదికలో వెల్లడించింది. అవినీతి పై నీతులు చెబుతున్న కేంద్ర పెద్దలు జగన్ అవినీతి కేసులు పై విచారణను వేగవంతం ఎందుకు చెయ్యరు? రాష్ట్రాన్ని దోచిన నేరస్థుడు బెయిల్ పై బయటికి రావడమే ఒక వింత అయితే,రాజ్యం ఏలడం మరొక వింత కాదా?
అవినీతి పరులను అక్కున చేర్చుకోవడం,వారిని రాజకీయ అవసరాలకు వాడు కోవడాన్ని ఏమనాలి? అవినీతి పరుల అంతు చూస్తానని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఎంత మంది అవినీతి పరుల అంతు చూసారు కమల నాథులు? అప్పులు,అరాచకం,అవినీతిపై నాలుగేళ్లుగా బిజెపి కేంద్ర పెద్దలు ఎందుకు మాట్లాడలేదో కేంద్ర పెద్దలు సమాధానం చెప్పాలి.
– నీరుకొండ ప్రసాద్
9849625610