– మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన ఆరోపణ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పే క్రమంలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయారని, అందుకే అతనిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోంద ని, లగచర్ల రైతులకు బేడీలు వేసి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. కల్తీ ఆహారం విషయంలో కేసు పెట్టవలసి వస్తే మొదట ముఖ్యమంత్రి పైనే పెట్టాలన్నారు.
అల్లు అర్జున్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లగచర్ల రైతులపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
హాస్టళ్లు, గురుకులాల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు చనిపోతున్నారని, చాలామంది అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలన్నారు.