( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో జగనన్న ‘సాక్షి’ పత్రిక దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసినా సాక్షి. ఎవరి చేతిలో చూసినా సాక్షి. ఏ షాపులో చూసినా సాక్షి. అవును. సాక్షి.. సాక్షి.. సాక్షి. ఎందుకింత క్రేజు? ఎందుకింత మోజు ? అసలు ఏముంది ‘సాక్షి’లో?..చూద్దాం! తెలుగునాట దశాబ్దాలపాటు ఈనాడు-ఆంధ్రజ్యోతి గుత్తాధిపత్యం ఏలుతున్న రోజుల్లో.. నాటి సీఎం వైఎస్ తనయుడు వైఎస్ జగన్ ఊపిరిపోసిన సాక్షి పత్రిక, తెలుగు పత్రికారంగంలో సంచలనానికి తెరలేపింది. అప్పటివరకూ అరకొర జీతాలతో.. దిక్కులేక కొనసాగుతున్న జర్నలిస్టులకు, సాక్షి భారీ జీతాలిచ్చింది. చేయితిరిగిన జర్నలిస్టులతో అప్పుడు సాక్షి రంగు హంగులతో ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో సొంత మీడియా లేని కాంగ్రెస్ కు సాక్షి పెద్ద దిక్కయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నెట్వర్కు కు అది ఉపయోగ పడింది.
టీడీపీపై ఎదురుదాడికి ఆయుధమయింది. ప్రధానంగా జగన్ ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తు పెంచేందుకు సాక్షి దోహదపడిందిన్నది నిర్వివాదమే కాదు నిష్ఠుర నిజం. జగన్ కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు గానీ, ఆయన జైలుకు వెళ్లిన తర్వాత గానీ జగన్ ఇమేజీని నిలబెట్టడంలో సాక్షి పాత్ర అమోఘం. అనిర్వచనీయం. ఇందులో మరో ముచ్చట లేదు. ఆ తర్వాత వైసీపీకి 67 సీట్లు రావడంలో గానీ.. అంతకుముందు ఓదార్పు యాత్ర గానీ.. ఆ తర్వాత అధికారంలోకి రావడంలో గానీ సాక్షి పోషించిన పాత్ర అద్భుతం. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అసలు రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ కంటే.. సాక్షి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది.
ఇప్పటికీ సాక్షి కథనాలకు టీడీపీ సమాధానం చెబుతూనే ఉందనుకోండి. అది వేరే విషయం! మరి ఇంత క్రేజు.. మోజు.. రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సాక్షి, ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందో తెలుసా?.. టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు.. చిల్లర దుకాణాలు, పచారీ షాపులు, పాన్ డబ్బాలు, తోపుడు బండ్లలో సాక్షిని సగానికి కత్తిరించి పార్సిళ్లు, మసాలా పొట్లాటలకు ు వాడుతున్న పరిస్థితి. అవును ఇది నిజంగా ໖໖໐. ఇప్పుడు మీరు ఏపీ-తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా.. మసాలా బండి, పల్లీ బండి, వివిధ వస్తువులు అమ్మే తోపుడుబండ్లు, చొక్కాల మధ్యలో కాగితం పెట్టే ఇస్త్రీ బండి, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, చివరకు బొప్పాయి చుట్టూ కట్టే పేపరు కూడా సాక్షిదే.
నిజానికి పేపరు ధర తక్కువ కావడం, పేజీలు కూడా ఎక్కువ కావడంతో. సాక్షి పత్రిక తూకానికి బాగా పనికివస్తుంది. బాగా గిరాకీ ఉండే టిఫిన్ సెంటరు మూడు సాక్షి పత్రికలు కొంటే చాలు. ఆ రోజు పొట్లాలకు డోకా లేని పరిస్థితి. అలాగే చిల్లరదుకాణాలు. పచారీ షాపుల్లోనూ అంతే. సహజంగా చాలామంది ఇళ్లలో పాత పేపర్లను కిలోల లెక్కన తూకానికి అమ్ముతుంటారు. కానీ వ్యాపారులు మాత్రం సాక్షిని అమ్మరు. దానిబదులు తమ షాపులకు తీసుకువెళతారు. మళ్లీ షాపులకూ సాక్షి చందా కడతారు.
ఎందుకంటే సాక్షి పత్రిక తూకంతో పాటు, పేజీలు కూడా ఎక్కువ ఉండటంతో, యాపారానికి పనికొస్తుందని వ్యాపారుల ఉవాచ. తాజాగా విజయవాడ బందరు రోడ్డులోని ఫుడ్ కోర్టులతో పాటు.. గుంటూరు నగరంలో రోడ్డు పక్కనున్న అన్ని టిఫిన్ సెంటర్లలో సాక్షి పత్రిక.. పార్శిల్ పొట్లాలకు ఉపయోగపడుతూ దర్శనమిచ్చింది. టిఫిన్ సెంటర్ల ‘సాక్షి’గా కనిపించిన ఆ చిత్రమే ఈ వి’చిత్రం’! ఆరకంగా సాక్షి ఒక్క జగనన్నకే కాదు.. ఈవిధంగా పొట్లాల రూపంలో వ్యాపారులకూ ఉపయోగపడుతూ ముందుకువెళుతోందన్నమాట!


