– కాంగ్రెస్ ఒక్క రోజు అయినా ఒక బీసీ వ్యక్తిని సీఎం గా నియమించలేదే?
– బీసీల కళ్లల్లో బీఆర్ఎస్ మట్టికొట్టింది
– బీసీ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మాట ఏమైంది?
– రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు ఆదర్శం
– ఓబీసీ మోర్చా ఇందిరాపార్కు ధర్నాలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఈ డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, అలాగే విద్యా, ఉద్యోగాల్లో కూడా అదే స్థాయిలో రిజర్వేషన్లు ఉంటాయని ప్రకటించింది.
బీఆర్ఎస్ పార్టీ పాలనలో బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి పడిపోయినప్పుడు, పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు చూసింది తప్ప, రిజర్వేషన్లపై న్యాయం చేయలేదు. బీసీల కళ్లల్లో మట్టికొట్టింది.ఇప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంలో మొసలికన్నీళ్లు కారుస్తున్నాడు. ఆయన ఇప్పటికే ఓటమిని అంగీకరించిండు.
రేవంత్ రెడ్డి సర్కారును నిలదీయగల సత్తా బిజెపికి మాత్రమే ఉంది. అందుకే ఈ మహాధర్నా చేపట్టడం జరిగింది.2023 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రైతు, యువ, మహిళా డిక్లరేషన్ల పేరిట 6 గ్యారంటీలు, 66 హామీలు ఇచ్చాడు. ఆ సమయంలోనే బిజెపి తరఫున నేను ప్రశ్నించాను. నీ పార్టీ దేశాన్ని 55 ఏళ్ల పాటు పాలించిన పార్టీ. అయితే ఈ హామీలన్నీ సాధ్యమవుతాయా? లేకుంటే ఇవి ప్రజలను మోసం చేయడానికేనా అని అడిగాను.
రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు, మడమ తిప్పదని అన్నాడు. అయితే ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మాట ఏమైంది? బీసీలు మళ్ళీ మోసపోయామనే భావనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బట్టబయలైంది. బీసీలు ఆయనకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
బీసీ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సుల్లో ఆదాయం రూ. 3 లక్షల లోపుంటే పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇవ్వకపోగా, గత బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీసీ యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంత మందికి ఇచ్చారో చెప్పలేదు. కల్లుగీత, మత్స్యకార, రజక ఫెడరేషన్లకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. వాస్తవం కాదా? రూ. 2 వేల పెన్షన్ను రూ. 4 వేలకి, ఆపై రూ. 6 వేలకి పెంచుతామని చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు.
ప్రతి నెలా ఉద్యోగులకు తొలివారం జీతం పడినట్లే టంచనుగా అకౌంట్లలో మహిళల రూ. 2,500 వేస్తామని హామీ ఇచ్చారు. అమలు కాలేదు. రైతు భరోసా కింద రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు ఇస్తామని చెప్పిన హామీలు అమలుకాలేదు.
బీసీ గణాంకాల కోసం బూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేసినట్టు చెబుతున్నా, ఇది స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఆధారంగా నిర్వహించబడింది. మరి చట్టబద్ధత ఏది? రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు ఆదర్శం. ఆ రాష్ట్రం 21 మంది ఐఏఎస్ అధికారులతో కమిషన్ వేసి, ఆర్టికల్ 340 ప్రకారం, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారంగా చట్టబద్ధతతో లెక్కలు తీసి, షెడ్యూల్-9లో చేర్చించింది.
సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్, కుమార్ వర్సెస్ బిహార్, కృష్ణారావు వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో కోర్టుల తీర్పులు చదవాలని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నా. బిజెపి దేశానికి మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రిని అందించింది. 27 మంది ఓబీసీ మంత్రులను కేంద్ర కేబినెట్లో ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా.. గుజరాత్ అయినా… ఎక్కడైనా అన్ని జాతుల, అన్ని వర్గాల ప్రజలు ప్రేమించే నాయకుడు నరేంద్ర మోదీ.
సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్న ఈరోజుల్లో భారతదేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గెలిచారు. 27 మంది ఓబీసీ మంత్రులను చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. దేశంలో వేల కులాలున్నాయి.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ట్రీట్ చేయబడుతుంది. అనేక వైవిద్యాలు ఉంటాయి.
రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెప్పి మనం చర్చించుకునేది తప్పు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో 70-80 శాతం పైబడి రిజర్వేషన్లు ఉన్నాయి. నిజంగా కూడా తెలంగాణలో కూడా చేయాలనుకుంటే.. ఆర్టికల్ 340.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ 1952 ప్రకారం చట్టబద్ధతతో కూడిన ఒక కమిషన్ వెయ్.
అన్ని రకాల పార్మాలిటీస్ పూర్తిచేసి ఒప్పించగలిగితే తప్పకుండా బిజెపి సామాజిక న్యాయాన్ని కాంక్షించే పార్టీగా నిలుస్తుంది. తెలంగాణలో కూడా చట్టబద్ధమైన కమిషన్ వేసి, ఆర్టికల్ 340 ప్రకారం పూర్తిగా డాక్యుమెంటేషన్ చేసి అమలు చేస్తే బిజెపి అడ్డుకోవదు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలను ముఖ్యమంత్రులుగా చేయలేదు. ఒక్కసారి కూడా కేబినెట్లో 42 శాతం బీసీ మంత్రులను పెట్టలేదు. ప్రాంతీయ పార్టీలకైతే కుటుంబాలపై ఆసక్తి తప్ప, ప్రజల పట్ల బాధ్యత లేదు.
కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. ప్రజలారా .. మాటలు చెప్పేవాళ్లు ఎవరో, మాటలు నెరవేర్చేవాళ్లు ఎవరో గుర్తించండి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతవరకు, ఒక బీసీ నాయకుడు అధ్యక్షుడిగా లేదా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పాలనలో ఉండింది. ఒక్క రోజు అయినా ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించలేదే?
కాంగ్రెస్ కేబినెట్లో 42 శాతం బీసీలకు ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు. రాబోయే కాలంలో కూడా అవుతారన్న నమ్మకం లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో వారి కుటుంబాల పాలన తప్ప మరొకటి ఉండదు. ఇవి ప్రజల పార్టీలు కావు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మాట ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఓబీసీని ముఖ్యమంత్రిగా చేయాలనే బాధ్యత మాది అని. రేవంత్ రెడ్డి…. నువ్వు ఢిల్లీకి వెళ్లి డ్రామా చేసి, బిజెపి.. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబితే… నువ్వే ప్రజల్లో చులకనవుతావు. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేదు.