ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
ప్రకాశం జిల్లా: రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైయస్ కుటుంబంతోనే ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైయస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.
చేనేతల కుటుంబానికి వైయస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం వైయస్ జగన్‌తో మాట్లాడతానని బాలినేని తెలిపారు. గోరంట్ల మాధవ్ విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని బాలినేని తెలిపారు.