Suryaa.co.in

Andhra Pradesh

తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డిపై హత్యాయత్నం

-పరిస్థితి ఆందోళనకరం
-కత్తులతో ప్రత్యర్థుల దాడి
-ఒంగోలులో ఉద్రిక్తత
-బాబు, లోకేష్, అచ్చెన్న, సోమిరెడ్డి, పితాని, కన్నా, బీద ఖండన

ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అనుబంధవిభాగమైన తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై జరిగిన హత్యాయత్నంతో ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా ఆయనను ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మర్రెడ్డిపై హత్యాయత్నం వార్త తెలియడంతో టీడీపీ కార్తకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతున్న మర్రెడ్డి, రైతాంగాన్ని వైసీపీకి వ్యతిరేకంగా కూడగడుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టిస్తోంది.

కాగా ఒక రైతు నాయకుడిపై కత్తిపోట్లతో హత్యాయత్నం చేయడం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, దానికంటే ముందే రాజకీయ ప్రత్యర్థులను హతమార్చే పరిస్థితి రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడే శాంతిభద్రతల పరిస్థితి ఇలా ఉంటే, ఇక ఎన్నికల సమయంలో ఇంకెంత దారుణంగా ఉంటాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

మర్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పితాని సత్యనారాయణ, బీద రవిచంద్రయాదవ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఇది రాష్ట్రంలో దారి తప్పుతున్న శాంతిభద్రతల పరిస్థితికి నిలువెత్తు నిదర్శనమన్నారు. రాజకీయ ప్రత్యర్ధులను అంతం చేసే అనాగరిక పాలన తెచ్చిన వైసీపీని రాజకీయంగా భూస్థాపితం చేయడమే దీనికి పరిష్కారమని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఆరా
కాగా మర్రెడ్డిపై హత్యాయత్న వార్త తెలిసి పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన ప్రకాశం జిల్లా పార్టీ నేతలు, పోలీసులతో మాట్లాడి, ఆరా తీశారు. మర్రెడ్డికి మెరుగైన వైద్యచికిత్స  అందేలా చూడాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE