– ఒకే దేశం – ఒకే చట్టం ” బీజేపీ నినాదం అర్థం ఇదేనా?
– ఉత్తరాదికి ఒక న్యాయం దక్షిణాదికి మరో న్యాయమా?
– జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలి
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాసిన బోయినపల్లి వినోద్ కుమార్
తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాత అంటే.. 1931 సంవత్సరం తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వినోద్ కుమార్ తీవ్ర నిరసన వ్యక్తం చేసారు.
జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచిన విధంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు వినోద్ కుమార్ బుధవారం లేఖ రాశారు.
రాజ్యసభలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం నాడు అడిగిన ప్రశ్నకు సమాధానం గా , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది కాబట్టి అది కుదరదని, 2026 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత మాత్రమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని, అంతకన్నా ముందు ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుదల అవకాశం లేదని స్పష్టం చేసిన చేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
అయితే జనాభా లెక్కల సవరణ అంశం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని, ఈ లెక్కన 2031 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపాదికన మాత్రమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉంటుందన్న విషయం స్పష్టమైందని, 2026 సంవత్సరం తర్వాత అనే పదంలోనే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాటల్లో తేలిపోయిందని వినోద్ కుమార్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే చట్టం అని బిజెపి నినాదాలు ఇస్తోందని, కానీ వాస్తవ రూపంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని, దానికి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచకపోవడమే నిదర్శనమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ని సవరించకుండానే , జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం అసెంబ్లీ సీట్లను పెంచిందని, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర హోం శాఖ మంత్రి కి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు మరో న్యాయమా అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నీ సవరించడం ద్వారా గాని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాల మేరకు అయినా గాని తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో, ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల స్థానాలను పెంచాలని కోరిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.