September 22, 2026

ఏఎంఆర్‌ పై దాడిలో 6.35 కోట్ల ఆస్తులు స్వాధీనం

  • దాడుల్లో పట్టుబడ్డ 1.95 కోట్ల విలువైన నగలు, నగదు
  • ఎట్టకేలకూ ప్రకటన విడుదల చేసిన ఈడీ
  • ఈడీ తీరుపై ‘మహానాడు’ విమర్శనాత్మక కథనం
  • ప్రకటన విడుదల చేయకపోడంపై ‘మహానాడు’ ప్రశ్నలు
  • ఎట్టకేలకూ శుక్రవారం ప్రకటన విడుదల చేసిన ఈడీ
  • ఖరీదైన కార్ల సంగతి ప్రస్తావించని ఈడీ ప్రకటన

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో సీనరేజీ వసూళ్లపై రాయల్టీ వసూలు చేస్తున్న ఏఎంఆర్‌పై ఈడీ దాడుల ప్రకటన మొహమాటానికి ఎట్టకేలకూ తెరపడింది. ఈనెల 11న.. అంటే ఎనిమిది రోజుల ఆలస్యంగా ఈడీ విడుదల చేసిన ప్రకటన విస్మయపరిచింది.
కాగా ఏఎంఆర్‌ కార్యాలయాలపై ఈడీ దాడులకు సంబంధించిన వివరాలను ఈడీ ఈనెల 1న విడుదల చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ ‘మహానాడు’ రాసిన కథనంతో ఈడీ ఎట్టకేలకూ కదిలింది. సహజంగా ఈడీ దాడులపై అదేరోజు తన వెబ్‌సైట్‌లో ప్రెస్‌నోట్‌ రూపంలో విడుదల చేసే ఈడీ.. ఒక్క ఏఎంఆర్‌ విషయంలో మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చిందంటూ ‘మహానాడు’ ప్రశ్నించింది. చివరకు ఈడీ కూడా ఏఎంఆర్‌కు భయపడుతోందన్న ప్రజాభిప్రాయాన్ని తన కథనంలో వ్యక్తం చేసింది.

ఫలితంగా స్పందించిన ఈడీ.. ఏఎంఆర్‌పై ఈనెల 11న దాడులు చేస్తే, ఆ దాడుల్లో ఎంత దొరికింది? ఏమేమి దొరికాయన్న ప్రకటనను ఈడీ 18న.. అంటే శుక్రవారం తన వెబ్‌సైట్‌లో పెట్టడం విశేషం. ‘‘వెనకటికేదో సామెత చెప్పినట్లు.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు ఏదో మొరిగినట్లుంది ఉంది ఈడీ వ్యవహారం. అంటే ‘మహానాడు’ లాంటి పత్రికల్లో ఈడీని ప్రశ్నించకపోతే, ఇక ఎప్పటికీ అది ఏఎంఆర్‌ దాడుల వివరాలు ప్రకటించేది కాదు కదా? అంటే ప్రశ్నిస్తేనే స్పందిస్తారా? మరి ‘మహానాడు’ పాటి ధైర్యం పెద్ద పెద్ద చానెళ్లు, పత్రికలు ఎందుకు చేయడం లేదు? ఏంటి వాళ్లతో లాలూచీ? అందుకే ఇంకా డిజిటల్‌ పేపర్లు ఇంకా రావాలి. అవి ఎంత వస్తే ఈ మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు అంత సిగ్గొస్తుంది. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా వ్యవహార శైలి ఇంకా ఇలాగే కొనసాగితే వాటిని జనం ఇక నమ్మరు. ఇప్పటికే పత్రికలను కొని చదవడం మానేస్తున్నారు. అవి మారకపోతే రేపు వాటిని పూర్తిగా మానేసే ప్రమాదం ఉంది. కాబట్టి పెద్ద పత్రికలు, చానెళ్లు భజన చేయడం మానండి’’ అంటూ సోషల్‌ మీడియా సైనికులు పోస్టుల వరద పారిస్తున్నారు.

ఏ ఎం ఆర్ గ్రూప్ సంస్థలపై జరిగిన ఈడీ దాడులకు సంబంధించిన దర్యాప్తు సంస్థ ఎట్టకేలకూ శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అందులో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈడీ దాడుల్లో కీలక సమాచారం పొందినట్లు వెల్లడించారు.

ఏఎంఆర్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు పలు జిల్లాల్లో సీనరేజ్ వసూలు కాంట్రాక్టు పనులు చేయటంతో పాటు ఇటీవలే మరో సంస్థతో కలిసి 8000 వేల కోట్ల రూపాయల పైచిలుకు అంచనా వ్యయంతో కూడిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది.

శుక్రవారం ఈడీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన కోల్‌కతా జోనల్ కార్యాలయంకోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్ రుణాల ఎగవేతకు సంబంధించి కొనసాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఒడిశాకు చెందిన ఏ ఆర్ఎస్ఎస్ గ్రూప్, హైదరాబాద్‌కు చెందిన ఏఎంఆర్/ఏఎంఆర్ ఎల్ గ్రూప్ ప్రమోటర్లు, అనుబంధ సంస్థలకు సంబంధించిన వివిధ ప్రాంగణాల్లో ఈ నెల 11 న PMLA 2002లోని సెక్షన్ 17 కింద సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల సందర్భంగా మొత్తం 6.35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఫ్రీజ్ చేశాం. ఇందులో సుమారు రూ.1.50 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు రూ.2.90 కోట్ల డీమ్యాట్/సెక్యూరిటీల హోల్డింగ్స్, సుమారు రూ.1.95 కోట్ల విలువైన నగదు, నగలు ఉన్నాయి. ఈ దర్యాప్తు శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ , శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి పై రెండు గ్రూపులు, ఇతర వివిధ సంస్థలు పొందిన మోసపూరిత/అక్రమ రుణాలు పొందటంపైనే అని తన ప్రకటనలో ఈడీ పేర్కొంది.

ఈడీ.. ఇంత ఆలస్యం ఎందుకు?

ఏఎంఆర్‌పై ఈడీ దాడుల సందర్భంగా ఆ దర్యాప్తు సంస్థ తన సహజ శైలికి విరుద్ధంగా ఎందుకు వ్యవహరించింది? ‘మహానాడు’లో విమర్శనాత్మక కథనం వచ్చేంత వరకూ దాడుల వివరాల ప్రకటన ఎందుకు విడుదల చేయలేదు? వారంరోజుల పాటు ప్రకటన వెలువడకుండా ఈడీపై ఎవరు ఒత్తిడి చేశారు? మరి ఈడీ తన దాడుల విషయంలో అన్ని కంపెనీలపైనా ఇదే వైఖరి అవలంబిస్తుందా? లేక అది కేవలం ఏఎమ్మార్‌కే ప్రత్యేకమా? అసలు ఏఎంఆర్‌కు ఈడీ మినహాయింపు వెనక మతలబేమిటి? అన్న ప్రశ్నలు సోషల్‌మీడియాలో మోతమోగిపోతున్నాయి.

ఈడీ తన దాడులను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టినప్పటి నుంచి.. ఏరోజు దాడుల వివరాలు ఆరోజు ప్రకటించే సంప్రదాయానికి ఒక్క ఏఎంఆర్‌ విషయంలోనే ఎందుకు సమాధి కట్టిందన్న ప్రశ్నలు సోషల్‌మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈడీ తన తాజా ప్రకటనలో.. ఆలస్యానికి కారణం కూడా వెల్లడించకపోవడమే వింత.

Total Visitors: 2,736,253