రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భవనాలు, కంప్యూటర్లువంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం చేస్తుందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్జీఎస్ఏ పథకాన్ని పునరుద్ధరిస్తూ 2022-23 నుంచి 2025-26 వరకు అమలు చేయడానికి ఆమోదించినట్లు తెలిపారు.
పంచాయతీలు రాష్ట్ర పరిధిలోని అంశం, పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలదే అయినప్పటికీ ఈ పథకంలో భాగంగా పంచాయతీల పని తీరును ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తమ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ప్రతిపాదించిన విధంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పరిమితస్థాయిలో ఆమోదించిన మేరకు పంచాయతీలకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.
దేశంలో ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పరిధిలోని పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్న ప్రయత్నాలకు తమ మంత్రిత్వ శాఖ ద్వారా సహకారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,893 పంచాయతీలకు సొంత భవనాలు, 3,858 పంచాయతీల్లో కంప్యూటర్లు లేవని మంత్రి తెలిపారు.