– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ్ చందర్ రావు
హైదరాబాద్: మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ‘అటల్ స్మృతి వర్ష్’ సందర్భంగా, ఎల్బీ నగర్లో అటల్ జీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాం. దేశానికి అటల్ జీ అందించిన అపూర్వ సేవలు, ఆయన దూరదృష్టిగల నాయకత్వం, సుస్థిర పరిపాలనతో పాటు ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన నెలకొల్పిన చిరస్థాయి వారసత్వం తరతరాలుగా దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామ్‌చందర్ రావు అన్నారు.
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీ జయంతిని పురస్కరించుకొని, అటల్ స్మృతి వర్ష్ సందర్భంగా ఎల్బీ నగర్లో అటల్ జీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విగ్రహ ఆవిష్కరణకు సహకరించిన విగ్రహదాతలకు, కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి జీ జయంతిని ‘గుడ్ గవర్నెన్స్ డే’గా జరుపుకుంటున్నాం. సుపరిపాలనకు అటల్ జీ జీవితం నిలువెత్తు నిదర్శనం.
1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు, పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువమోర్చా అధ్యక్షుడిగా గౌరవనీయులు ఇంద్రసేనా రెడ్డి సేవలందించారు. ఆ రోజుల్లో నేను కూడా యువమోర్చాలో కార్యదర్శిగా పనిచేశాను. అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం ఒక అదృష్టం. అలాగే, నేడు ఆయనను స్మరించుకోవడం మరో అదృష్టంగా భావిస్తున్నాను. విలువలతో కూడిన రాజకీయాలకు అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ప్రతీక. రాజకీయాల్లో విమర్శలు ఎంత కఠినంగా చేసినా, వ్యక్తిగతంగా ఎవరినీ అవమానించని గొప్ప సంస్కృతి ఆయనలో కనిపించేది.
పార్లమెంటులో అప్పటి ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా విమర్శించినప్పటికీ, వాజ్ పేయి వాగ్ధాటికి ముగ్ధులైన నాటి ప్రధాని నెహ్రూ ఓ కార్యక్రమంలో కలిసినప్పుడు అభినందించారు. కానీ, నేడు తెలంగాణ రాజకీయాల్లో ఆ సంస్కృతి కనిపించడం లేదు. దురదృష్టవశాత్తు నేటి రాజకీయాల్లో ఆ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. రాజకీయ విమర్శల పేరుతో కొందరు నాయకులు బూతులు, దిగజారుడు భాషను ఉపయోగిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుండటం బాధాకరం.
ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటులో కేవలం ఒక్క ఓటుతో ప్రభుత్వం కోల్పోతానని తెలిసినా, ఇతర పార్టీల ఎంపీలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నైతిక విలువలకు కట్టుబడి అధికారాన్ని వదులుకున్న మహానాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం చేసి, అన్ని రాష్ట్రాలను ఒకటిగా అనుసంధానం చేసిన దూరదృష్టి కలిగిన నాయకుడు అటల్ జీ.
మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు, పేద ప్రజలకు లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మించి సామాజిక న్యాయానికి బలమైన పునాది వేశారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచనలు, ఆయన చూపిన పాలనా మార్గమే నేడు ప్రధాని నరేంద్ర మోదీ గారి పాలనలో కొనసాగుతోంది. జాతీయ రహదారులు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ అటల్ జీ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంటరీ చర్చలను అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. నేటి యువత అటల్ జీని ఆదర్శంగా తీసుకోవాలి. భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి గారు దేశానికి చేసిన అపూర్వ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. అలాంటి మహోన్నత నాయకుడి విగ్రహాన్ని ఎల్బీ నగర్లో ఆవిష్కరించుకోవడం మనందరికీ గర్వకారణం.
ఈ కార్యక్రమంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.