– తప్పిన పెద్ద ప్రమాదం
– ఆటోలో స్కూల్ పిల్లలు
– ప్రమాదకర స్థాయికి కొన రోడ్
– పట్టించుకోని పాలకులు
మచిలీపట్నం రూరల్: మచిలీపట్నం మండలం కొన రహదారిలో ఆటో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మచిలీపట్నం శివగంగ ప్రాంతంలో కాన్వెంట్ నుండి ఇరవై మందికి పైగా చిన్నారులతో కొన గ్రామం వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న మరో వాహనం కు దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పింది. ఆటో పక్కకి ఒరిగి ఆగిపోవడం తో పెద్ద ప్రమాదం తప్పింది.
ఆటో లో ఇరవై కి మందికి పైగా చిన్నారులు వుండగా, ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదాన్ని గమనించిన కృష్ణా విశ్వవిద్యాలయం సిబ్బంది ఆటో లో ఇరుక్కుపోయిన పిల్లలను బయటకు తీసుకొచ్చారు. కొన రహదారి పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారిన పాలకులకు పట్టడం లేదని దిగువ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గంలో కృష్ణా విశ్వవిద్యాలయం వుండగా అందులో పదిహేను వందల మంది విద్యార్థులు రెండు వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దిగువున పోలాటితిప్ప, పాతేరు, పల్లి తుమ్మకపాలెం, కొన గ్రామాలు ఉన్నాయి. అయినా రోడ్డు విస్తరణ పై ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం శోచనీయం. ఈ మార్గంలో భారత్ సాల్ట్ పరిశ్రమ లారీలు, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ విస్తరణ కోసం కొండ రాళ్ళు, బండ రాళ్ళ లారీలు, చేపల చెరువులు కోసం తీసుకొచ్చే ఫీడ్ లారీలు తో రోడ్డు అద్వానంగా తయారైంది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలి.