Home » గిరిజన ప్రాంతాల్లో మహిళా చట్టాలపై అవగాహన

గిరిజన ప్రాంతాల్లో మహిళా చట్టాలపై అవగాహన

– అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు
– ప్రాజెక్ట్ రూపకల్పనకు ‘మహిళా కమిషన్’ కసరత్తు

అమరావతి: గిరిజన ప్రాంతాలలో మహిళల చట్టాలపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మహిళా కమిషన్ తీర్మానించింది. బుధవారం మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అధ్యక్షతన త్రైమాసిక సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి కమిషన్ సభ్యులు కుమారి గడ్డం ఉమా, బూసి వినీత, కమిషన్ కార్యదర్శి వసంత బాల హాజరయ్యారు. ఇటీవల జాతీయ మహిళా కమిషన్ అంతర్జాతీయ సదస్సులో గిరిజన ప్రాంత మహిళల ఆరోగ్యం పై నివేదించిన అంశాలమేరకు ప్రాజెక్ట్ ను చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి సభ్యులకు వివరించారు. గిరిజన ప్రాంతాల సందర్శన, అక్కడ నిర్వహించా ల్సిన సదస్సులపై చర్చించారు.

బసివిని, జోగిని, మాతంగి వంటి అనాగరిక ఆచారాలపై కమిషన్ సభ్యులు ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని నిరోధించాలన్నారు. గత మూడు నెలల్లో కమిషన్ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు, ఆయా కేసుల స్థితిపై సమీక్షించారు. సభ్యులకు కేటాయించిన ప్రాంతాల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం పై కమిషన్ శరవేగంగా స్పందించాలన్నారు. కేసుల విచారణకు సంబంధించిన సమాచారాన్ని సభ్యులకు ఎప్పటికప్పుడు అందజేయాలని చైర్ పర్సన్ ఆదేశించారు.

కార్యదర్శి వసంత బాల మాట్లాడుతూ.. హర్యానాలో జరిగిన జాతీయ మహిళా కమిషన్ సదస్సులో ప్రస్తావించిన ఉమెన్ సేఫ్టీ ఆడిట్ ను వివరించారు. కమిషన్ సభ్యులు ప్రతినెలా వారికి కేటాయించిన ప్రాంతాలలో చేపట్టే కార్యక్రమాల వివరాలను కమిషన్ కార్యాలయానికి పంపాల్సిందిగా కోరారు. సమావేశంలో కమిషన్ సెక్షన్ ఆఫీసర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply