– ‘ఆంధ్రప్రెన్యూర్’ అనే కొత్త పదాన్ని ఇక్కడ నేర్చుకున్నాను
– నెదర్లాండ్స్ రాయబారి!
విశాఖపట్నంలో నవంబర్ 14-15, 2025 తేదీల్లో CII (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన 10వ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రాయబారి మారిసా గెరార్డ్స్ కీలక ప్రసంగం చేశారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు కీలక రాష్ట్రమని, ముఖ్యంగా లాజిస్టిక్స్, వ్యవసాయం, సెమీకండక్టర్లు వంటి రంగాలలో ఉమ్మడి భాగస్వామ్యం కోసం నెదర్లాండ్స్ ఆసక్తిగా ఉంది. ఇక్కడకు వచ్చాక నేను ‘ఆంధ్రప్రెన్యూర్’ అనే కొత్త పదాన్ని నేర్చుకున్నాను.
ముఖ్యమంత్రిగారు మరియు ఆయన మంత్రివర్గం వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకుల మాటలను ఓపికగా వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన సంస్కృతికి నిదర్శనం. ముఖ్యమంత్రి విజన్‌ను కేవలం చూపించడమే కాకుండా, దాన్ని ఆచరణలో పెడుతున్నారని ఆమె కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం కలలు కనడం కాదు, వాటిని సాకారం చేస్తుందని స్పష్టం చేశారు. వ్యాపారం కోసం మేము మీ మాట వింటాం, అవసరమైతే చట్టాలను కూడా మారుస్తాం అని చెప్పే ఒక రాష్ట్రాన్ని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు అని అన్నారు.
యూరప్‌లోని రాజకీయ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయకత్వం నుంచి, ఇక్కడి స్ఫూర్తిదాయక వాతావరణం నుంచి నేర్చుకోవచ్చని ఆమె సూచించారు. ఈ సదస్సు ద్వారా యూరప్, ముఖ్యంగా నెదర్లాండ్స్ నుండి ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు. మొత్తం మీద, మారిసా గెరార్డ్స్ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని, ముఖ్యమంత్రి నాయకత్వానికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపును మరోసారి చాటి చెప్పింది.