Home » బాబు ఇలా.. జగన్ అలా..

బాబు ఇలా.. జగన్ అలా..

– ఢిల్లీలో ఎంపీలతో బాబు
– కేంద్రమంత్రులతో కలసి భేటీలు
– అందరినీ పరిచయం చేసిన నాయకుడు
– ఎంపీలతో కలసి పీయుష్ గోయల్‌తో చర్చలు
– ఐదేళ్లు ఎంపీలను తీసుకువెళ్లని జగన్
– ఒంటరిగానే వెళ్లి మంతనాలు
– ఢిల్లీలో ఏనాడూ మీడియాతో మాట్లాడని జగన్
– మీడియాతో మనసువిప్పి మాట్లాడే చంద్రబాబు
– సోషల్‌మీడియాలో ఇద్దరి మధ్య పోలికలతో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇద్దరూ వారి వారి పార్టీలకు అధినేతలే. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. కాకపోతే ఇద్దరి మధ్య తేడా బోలెడు. ఇద్దరి వైఖరులు విభిన్నం. ఒకరు అంతా గుంభనమైతే.. మరొకరు బహిరంగం. ఒకరిది ప్రజాస్వామ్యమైతే, మరొకరిది నయా నియంతృత్వం. వారే తెలుగుదేశం పార్టీ అధినేత-ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. మరొకరు మాజీ సీఎం-వైసీపీ అధినేత జగన్‌రెడ్డి. వీరిద్దరికీ వయసులోనే కాదు.. అనుభవం-వ్యవహారశైలిలోనూ బోలెడు భిన్నత్వం ఉంది. అదేమిటో చూద్దాం.

విభజన సమస్యలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపులు ఇంకా అనేక అంశాలపై, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటి స్తున్నారు. ఏపీ నుంచి సీఎం వచ్చారంటే ఆయా పార్టీల ఎంపీలు సహజంగా, ఏపీభవన్‌లో కొలువుదీరిన సీఎం వద్దకు క్యూలు కడుతుంటారు. తెలుగు మీడియా కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంటుంది. ఆయన తన ఢిల్లీ పర్యటన విశేషాల తో పాటు, ఢిల్లీ రాజకీయ వాతావరణంపై ఢిల్లీ తెలుగు మీడియా వద్ద వాకబు చేస్తుంటారు. చంద్రబాబు-వైఎస్-రోశయ్య లాంటివాళ్లయితే, కొందరు జర్నలిస్టులను పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఇది కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నదే.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు, తన పార్టీ ఎంపీలతో కలసి కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. వారిని మంత్రులకు పరిచయం చేశారు. మంత్రి పియూష్ గోయల్‌తో కలసి అల్పాహారం తీసుకున్నారు. ఎంపిలతో కలసి రాష్ట్ర సమస్యలపై ఆయనతో చర్చించారు. అమిత్‌షాతో కలసిన సందర్భంలో సైతం, తన పార్టీ ఎంపీలను పరిచయం చేశారు. తన పార్టీ ఎంపీలనే కాదు. బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మనూ పరిచయం చేశారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, గ్రాంట్లు, కొత్త ప్రాజెక్టులు, బడ్జెట్‌లో సాధించవలసిన అంశాలపై ఎంపీలతో చర్చించారు.

దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులను కలవాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు సైతం, ఈ కొత్త వాతావరణానికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమను కేంద్రమంత్రులకు పరిచయం చేయడమే కాకుండా, తామేం చేయాలో కూడా సూచనలిచ్చిన చంద్రబాబు నాయకత్వ పటిమకు ముగ్ధులయ్యారు. లీడర్ అంటే అలాగే ఉంటారు. దటీజ్ చంద్రబాబు!

ఐదేళ్ల క్రితం.. అదే ఢిల్లీ.. అదే ముఖ్యమంత్రి..అదే ప్రధాని.. వాళ్లే ఎంపీలు. వ్యక్తులు మారినా హోదాలు మాత్రం అవే. కానీ మర్యాద-గౌరవంలోనే తేడా. ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్‌రెడ్డి లెక్కలేనన్ని సార్లు ఢిల్లీ వెళ్లారు. ఆయన ఏపీభవన్ లోపల సూట్‌రూములో ఉంటే, ఎంపీలు బయట పడిగాపులు కాస్తుంటారు. రెడ్డి ఎంపీలంతా లోపల ఉంటే, బీసీ-దళిత ఎంపీలు బయట చకోరపక్షుల్లా నిలబడిన ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయి.

విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, అవినాష్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాత్రం జగన్ గదిలో ఉంటారు. పోనీ బయటకొచ్చిన జగన్, బయట ఉన్న బీసీ-ఎస్సీ ఎంపీలతో మాట్లాడతారా అంటే అదీ లేదు. నమస్కారం పెట్టి, కారెక్కి ప్రధాని దగ్గరకో, హోంమంత్రి దగ్గరకో, ఆర్ధికమంత్రి దగ్గరకో వెళతారు. వెళ్లేముందు తన పార్టీ ఎంపీలను తీసుకువెళ్లి, వారిని పరిచయం చేసిన సందర్భం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. పోనీ వచ్చిన తర్వాత సమావేశ వివరాలేమైనా ఎంపీలతో పంచుకుని, చర్చిస్తారా అంటే అదీ లేదు.

ఏ పని ఉన్నా ఒక విజయసాయిరెడ్డి.. ఒక మిథున్‌రెడ్డి. అంతే! వారిద్దరినీ కాదని ఏ ఎంపీ అయినా స్వతంత్రంగా కేంద్రమంత్రులనో, ప్రధానినో, హోంమంత్రులనో కలిశారనుకోండి. ఇక ఆ ఎంపీలకు చివాట్లు తప్పవు. వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు, అలాంటి స్వతంత్ర వైఖరి అనుసరించే దెబ్బతిన్నారు. తనకున్న పాత పరిచయాలతో రాజు వారిని కలవటం రెడ్డి ఎంపీలకు సుతరామూ నచ్చలేదు. అది ధిక్కారంగా భావించారు. విజయసాయి, మిథున్, బాలశౌరి వంటి జగన్భక్త ఎంపీలు.. రాజుపై చాడీలు చెప్పడంతో, ఆయన చీటీ చిరిగిపోయింది. అంత నియంతృత్వం జగన్‌ది!

చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు తరచూ అపాయింట్‌మెంట్లు ఇస్తారు. కీలకమైన బిల్లుల సమయంలో వారితో టెలీకాన్ఫరెన్సులో మాట్లాడి, దిశానిర్దేశం చేస్తారు. జగన్‌రెడ్డి అసలు ఎంపీలకు అపాయింట్‌మెంట్లే ఇవ్వరు. వారిని విజయసాయిరెడ్డి-మిథున్‌రెడ్డి ఖర్మానికి వదిలేస్తారంతే. ఆ ఇద్దరితో మాట్లాడితే, జగన్‌తో మాట్లానట్లు లెక్క.

ప్రధాని-హోంమంత్రి-కేంద్రమంత్రులతో బాబు-జగన్ మాట్లాడే విధానం, కూర్చునే తీరు కూడా భిన్నంగా ఉంటుంది. అది ఫొటోలు చూస్తే స్పష్టమవుతుంది. జగన్‌రెడ్డి ప్రధాని-హోంమంత్రి వద్దకు వెళ్లినప్పుడు కుర్చీలో మొదట జరిగి కూర్చుంటారు. చివరి వరకూ కూర్చోరు. చేతులు పిసుక్కుంటూ మాట్లాడతారు. మెడ తిప్పుతూ కనిపిస్తారు. హెడ్మాష్టరు దగ్గర విద్యార్ధి భయంగా కూర్చునే తీరది! వాళ్లకు వెంకన్న విగ్రహాలిచ్చి, శాలువా కప్పి బతుకుజీవుడా అని బయటకొస్తారు.

పోనీ బయటకొచ్చిన తర్వాత.. వారి భేటీ వివరాలను తెలుగు మీడియాకు చెబుతారా అంటే.. పిచ్చినవ్వు ఒకటి విసిరి కారెక్కి వెళ్లిపోతారు. చివరిసారి అనుకుంటా… పార్లమెంటు నుంచి బయటకొచ్చినప్పుడు మీడియా కలిస్తే.. విజయసాయిని అడగండి అని కారెక్కి తుర్రుమన్నారు. దానితో ఏపీ సీఎం ఎవరు? జగన్‌రెడ్డా? విజయసాయిరెడ్డా? అని నేషనల్ మీడియా రచ్చ చేసింది. జాతీయ మీడియా గత్తర అలాగే ఉంటుంది. ఇవన్నీ వీడియోలు, ఫొటోలు చూస్తే జగన్ తీరు ఎవరికైనా అర్ధమవుతుంది.

అదే.. చంద్రబాబునాయుడు శైలి అందుకు పూర్తి విరుద్ధం. మోదీ అయినా.. అమిత్‌షా అయినా.. నిర్మలాసీతారామన్ అయినా.. పియూష్ గోయల్ అయినా.. నిటారుగా కూర్చుంటారు. విధేయుడిగా కాకుండా, ఒక సహచరుడిలా కనిపిస్తారు. కుర్చీని ఆనుకుని కూర్చుంటారు. చెప్పవలసిన విషయాన్ని కుండబద్దలు కొడతారు. జగన్‌రెడ్డిలా మెడ అష్టవంకర్లు తిప్పరు. నేలచూపులు చూడరు. భయంతో కుర్చీ మొదలు కూర్చోరు. చేతులు పిసుక్కుని మాట్లాడరు. బయటకు వచ్చి మీడియాతో.. తమ సమావేశ వివరాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత తన పార్టీ ఎంపీలతో వారి సమావేశ వివరాలు వెల్లడించి.. ఫలానా అంశాలపై ఫాలోఅప్ చేయాలని మార్గదర్శనం చేస్తారు. ఇదీ చంద్రబాబు ్రపజాస్వామ్యవైఖరికి-జగన్‌రెడ్డి నియంత నైజానికీ తేడా! మీకు అర్ధమవుతోందా?!!

Leave a Reply