-సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్మాలా?
-అందుకోసం ఆందోళన చేస్తారా? ప్రెస్మీట్లు పెడతారా?
-మీరు నిజంగా ప్రభుత్వాన్ని నడిపారా? ఇంకేమన్నా నడిపారా?
-చట్టానికి వ్యతిరేకంగా మీరు పని చేస్తున్నారు
-ఇంతకన్నా దిగజారరనుకున్న ప్రతిసారి పాతాళానికి పోతున్నారు
-రాజకీయాల కోసం ప్రతి వ్యవస్థను దిగజార్చారు. అస్తవ్యస్తం చేశారు
-వాటిని గాడిలో పెట్టేందుకు సీఎంగారు ప్రయత్నిస్తున్నారు
-అయినా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు
-ఇకనైనా రాజకీయాలు కట్టి పెట్టండి. పద్ధతి మార్చుకోండి
-హీరో బాలకృష్ణ కూడా స్వయంగా ఫోన్లో మాట్లాడారు
-సీఎం వైయస్ జగన్‌ను కూడా కలుస్తానన్నారు
-ఇది వాస్తవమా? కాదా? దమ్ముంటే చెప్పండి
-ప్రెస్మీట్లో సూటిగా ప్రశ్నించిన మంత్రి పౌర సంబంధాలు, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి పేర్ని నాని
తాడేపల్లి: ప్రెస్మీట్లో పేర్ని నాని ఏమన్నారంటే..:
చంద్రబాబు తీరు విచారకరం:
గౌరవ ప్రతిపక్ష నేత, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, ఇవాళ వ్యవహరిస్తున్న తీరు విచారకరంగా ఉంది.
ఇవాళ ఒక సినిమా విడుదల అవుతుంటే. ఆ సినిమా కోసం తండ్రీ కొడుకులు ఇద్దరూ పిలిమొగ్గలు వేస్తున్నారు. అవి చూస్తుంటే, రాజకీయాలకు వాడుకోవడానికి పనికిరానిది ఏదీ ఉండదన్న విషయం అర్ధమవుతుంది.
పవన్‌కళ్యాణ్ సినిమాను తొక్కేస్తున్నామంట. అదేమిటో అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్‌గారిని, లక్ష్మీపార్వతిని, హరికృష్ణను తొక్కేసినట్లు అనుకుంటున్నారా?.
దిగజారుడు మాటలు:
ప్రభుత్వం నిర్దేశించిన రేటు కాకుండా, ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటామంటే ప్రభుత్వం తప్పనిసరిగా నియంత్రిస్తుంది. ఇది చంద్రబాబుగారి ప్రభుత్వం కాదు. రాజకీయాల కోసం ఆయన ప్రతి వ్యవస్థను దిగజార్చారు. ప్రతి వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తే, వాటిని చక్కదిద్దే ప్రయత్నం సీఎం వైయస్ చేస్తుంటే, దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.
జీఓ.35 ప్రకారం సినిమా టికెట్ల రేట్లు ప్రకటించాం. ఏరియా, ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్, థియేటర్‌ను బట్టి ఆ టికెట్ రేట్లు నిర్ణయించడం జరిగింది. దాన్ని కొందరు ఎగ్జిబిటర్లు హైకోర్టులో సవాల్ చేశారు. దానిపై స్పందించిన హైకోర్టు.. ప్రతి సినిమాకు థియేటర్ లైసెన్స్ అథారిటీ అయిన జేసీ వద్దకు వెళ్లి టికెట్ రేటు ఫిక్స్ చేసుకోవాలని ఆదేశించింది.
కానీ వీళ్లకు హైకోర్టు అంటే గౌరవం లేదు. తీర్పు అంటే లెక్కలేదు. ప్రభుత్వం అంటే లెక్క లేదు. వ్యవస్థ అంటే లెక్కలేదు.
వ్యవస్థను నాశనం చేసి, బ్లాక్‌లో టికెట్లు అమ్మి, ప్రజలను దోచుకోవడాన్ని అనుమతించింది చంద్రబాబు కాదా? ఇవాళ ఈ పరిస్థితికి ఆయనే కారణం కాదా?
ఒక హీరో. మైక్ పట్టుకుంటే నీతులు చెబుతాడు. మరి ఈ నీతిమాలిన పనులు ఏమిటి. ఇవి నీతిమాలిన పనులు కాదా?
బ్లాక్ మార్కెటింగ్‌కు సమర్థనా?:
బ్లాక్ మార్కెటింగ్‌ను కూడా రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. దాన్ని ప్రోత్సహిస్తూ భజన చేసే దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుంది.
బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు బ్లాక్‌లో టికెట్లు అమ్మడాన్ని సమర్థిస్తున్నాయి. ప్రభుత్వం కళ్లు మూసుకోవాలని అంటున్నాయి.
అలాగే కొన్ని న్యూస్ ఛానళ్లు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతుంటే, దాన్ని తప్పుగా చూపాల్సింది పోయి, దాన్ని అడ్డుకున్న ప్రభుత్వ చర్యను దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారు. వార్తను కిరాతకంగా ప్రజలకు అందిస్తున్నారు.
భగవంతుడు వారిని ఎలా ఉపేక్షిస్తున్నాడో అర్ధం కావడం లేదు.
రాజకీయ వ్యవస్థ కానీ, టీవీలు, పేపర్లు బ్లాక్‌లో టికెట్లు అమ్మితే తప్పుగా చూపాల్సింది పోయి, దాన్ని ఒప్పుగా, రాజ్యాంగపరమైన హక్కుగా చిత్రీకరిస్తున్నారు. జగన్‌కి వ్యతిరేకంగా ఎంత కిరాతకానికి అయినా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉన్నారని అర్ధమవుతుంది.
ప్రభుత్వం విడుదల చేసిన జీఓను తాత్కాలికంగా నిలిపివేసి, జేసీ వద్దకు వెళ్లి టికెట్ ధరలు నిర్ణయించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తే ఆ పని చేయడం లేదు. అధికారి వద్దకు ఎందుకు వెళ్లడం లేదు. ప్రభుత్వం కూడా మా దగ్గరకు రావొద్దు అంటున్నారు. అసలు ఏమిటిది? పైగా కిరాతకంగా మాట్లాడుతున్నారు. ఉచ్ఛం, నీచం లేని పరిస్జితి.
జీఓ 24న రావాల్సి ఉన్నప్పటికీ..:
టికెట్ రేట్లు నిర్ణయించాల్సిన కమిటీ 21వ తేదీన సమావేశమై, ఆ మర్నాడు 22న సినిమాటోగ్రఫీ హోం శాఖ ఒక డ్రాఫ్ట్ జీఓ తయారు చేస్తే, ఆ తర్వాత 23 లేదా 24న న్యాయశాఖ క్లియరెన్స్ ద్వారా జిఓ విడుదల కావాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ మా సహచర మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాత్తుగా మరణించడంతో అవేవీ జరగలేదు. అయినా అర్ధం లేకుండా జీఓ రాలేదని విమర్శిస్తున్నారు.
సంస్కారహీనం:
సొంత బావమరిది శవం పక్కనే రాజకీయాలు మాట్లాడిన నీచమైన మనసత్త్వం ఎవరిది? మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాత్తుగా చనిపోతే ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి దండ వేశారు. నక్క వినయాలు ప్రదర్శించి, ఆయన గురించి గొప్పగా చెప్పించారు. ఆ మర్నాడే మాజీ మంత్రితో సంస్కారహీనంగా మాట్లాడించారు.
మనిషి మరణిస్తే ఆ బాధ, ఆ మనిషి విలువ.. రాజకీయాలే జీవితంగా బతికే చంద్రబాబుకు తెలియదు. రామారావు చనిపోయినా రాజకీయం చేశారు.
మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాత్తుగా చనిపోవడంతో, అందరం ఆ ఆవేదనలో ఉండిపోయాం. జీఓ రాలేదు. అయినా దాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు.
వాయిదా వేయలేరా?:
గౌతమ్‌రెడ్డి చనిపోయాడని సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌ను రెండు రోజులు వాయిదా వేసుకున్న మీరు, సినిమా విడుదలను కూడా అలా వాయిదా వేసుకోవచ్చు కదా? కానీ ఆ పని ఎందుకు చేయలేదు. పైగా సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటామని అంటున్నారు. అవపసరమైతే సినిమాను ఫ్రీగా చూపిస్తామని ప్రగల్భాలు పలికారు కదా. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయడం లేదు. మాటకు కట్టుబడి సినిమా ఫ్రీగా చూపించాలి కదా?
ఎందుకీ డ్రామాలు?:
ఒక పక్క ఆయనది ఆ వ్యవహారశైలి అయితే, ఇక్కడ తండ్రీ కొడుకులది మరో రాజకీయం. సినిమా విడదుల కాకముందే, ఆ సినిమా బాగుందని లోకేష్ చెబుతున్నాడు. ఆ సినిమా చూడాలని తహతహలాడుతున్నానని చెప్పాడు. ఏం డ్రామా?
మీ పార్టీకి ప్రచారం చేసి, పార్టీ జెండా మోసిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతున్న ఏ సందర్భంలోనూ లోకేష్ కానీ, చంద్రబాబు కానీ ఆయనకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అతడి సినిమా చూడాలని ఉందని ఎందుకు ఒక్కరోజైనా అన్నారా?
కుప్పం వెళ్లినప్పుడు చంద్రబాబు వన్‌సైడ్ లవ్ ఉండదన్నాడు. ఇప్పుడు వన్‌సైడ్ లవ్ అయినా ఫరవాలేదు. ఆఫ్‌సైడ్ లవ్ అయినా ఫరవాలేదు. పావుసైడ్ లవ్ అయినా ఫరవాలేదు. ఏదో ఒక లవ్ ఉంటేనే బెటర్ అని పవన్‌కళ్యాణ్ వెంట పడుతున్నాడు. ఎందుకీ ప్రేమ ఒలకబోస్తున్నారు.
చెప్పేదొకటి… చేసేదొకటి:
పవన్‌కళ్యాణ్ గురించి మేము ఏనాడైనా పట్టించుకున్నామా? 2014లో కానీ, 2019లో కానీ పట్టించుకున్నామా? 2024లో పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా?.
నైతికంగా, చట్టబద్ధంగా వాస్తవంలో జీవించలేని వ్యక్తులు సమాజంలో నీతులు చెప్పడానికి ఎలా పనికి వస్తారు. నైతిక బాధ్యత లేదు. ఆ విలువలు లేవు. చట్టబద్ధంగా బ్రతికేటువంటి బాధ్యత లేదు. చట్టాన్ని గౌరవించరు. చెప్పేదొకటి. చేసేదొకటి. శ్రీరంగ నీతులు మాత్రం బాగా చెబుతారు.
మనవడూ మాట్లాడుతున్నాడంట!:
నాన్నా నువ్వు ఇంట్లో ఉండకు. ప్రజల్లో తిరుగు. రోడ్ల వెంట తిరుగు అని, లోకేష్‌కు ఆయన కొడుకు చెబుతున్నాడంట. ఏం ఖర్మరా మీది. దాన్ని చూసి మాకు జాలేస్తోంది. చంద్రబాబునాయుడు ఏమో తన కొడుకుపై నమ్మకం లేక పవన్‌కళ్యాణ్‌ను నమ్ముకుంటున్నారు. చంద్రబాబు మనవడు కూడా, తన తండ్రి ఎందుకూ పనికి రావడం లేదని, తాత ఏమో వేరెవరినో పట్టుకుని పోతున్నాడని అంటున్నారంట.
ప్రజలను ఆపగలమా?:
సినిమా బాగుంటే జనం చూస్తారు. ఏ సినిమాను ఎవరైనా ఆపగలరా? ఇటీవల పుష్ప అనే సినిమాను జనం వెర్రెత్తి చూడలేదా?
మõßష్‌బాబు సినిమా శ్రీమంతుడు, భరత్అను నేను సినిమాలు జనం చూడలేదా. రాజమౌళి సినిమాలు చూడడం లేదా? అంతెందుకు చిరంజీవి మేనల్లుడి సినిమా ఉప్పెన అని వచ్చింది. ఆ కుర్రాడు ఎవరికీ తెలియదు. మరి ఆ సినిమాను కూడా జనం చూశారా.
ఈ సినిమాతో పార్టీకి ఏం సంబంధం?:
సినిమా బాగుంటే జనం చూస్తారు. ఈ సినిమా కూడా బాగుంటే చూస్తారు. మరి అలాంటప్పుడు ఈ సినిమాకు, వైయస్సార్సీపీకి, జనసేన పార్టీకి ఏమిటి సంబంధం?. ప్రతిదీ రాజకీయమే. పిచ్చి పిచ్చి మాటలు. తప్పుడు మాటలు. దిగజారి ప్రవర్తించే రాజకీయాలను ఖండిస్తున్నాం.
అసలు మీరు ప్రభుత్వాన్ని నడిపారా?:
చంద్రబాబుని అడుగుతున్నాం. మీరు నిజంగా ప్రభుత్వాన్ని నడిపారా? ఇంకేమన్నా నడిపారా? చట్టానికి వ్యతిరేకంగా మీరు పని చేస్తున్నారు. మీరు ఇంతకన్నా దిగజారరని అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతున్నారు.
ఒక చురుకైన మంత్రి హఠాత్తుగా చనిపోతే, దుఖంలో మునిగి పోవడంతో జీఓ రావడం ఆలస్యం అవుతోంది. ఇవాళ్టికి మేము ఆవేదన నుంచి బయటకు రాలేకపోతున్నాం. దాన్నీ తప్పు పడుతూ, బురద పూస్తున్నారు. ఒక సినిమాకు బ్లాక్‌లో టికెట్లు అమ్మించాలని ఒక పార్టీ చూడడం, అలా అమ్మించాలని గొడవలు చేయడం, ప్రెస్మీట్లు పెడుతున్నారు.
మీ పార్టీ ఎంపీ బావమరిది మహేష్‌బాబు. ఆయన సినిమా కోసం మీరు ఎప్పుడైనా మాట్లాడారా. ఆయన సినిమా బాగుంటుందని, బాగా ఆడాలని ట్వీట్ చేశారా. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారా?.
జుగుప్సాకరం:
ఇవాళ చంద్రబాబు, ఆయన కుమారుడు చేస్తున్నవి చూస్తుంటే, వారి పరిస్థితి, పార్టీ పరిస్థితి చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నాయి.
ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఉంటాయా? ఈ విధంగా వ్యవహరించే వారి పట్ట ఏహ్యభావం కాకుండా ఇంకా ఏముంటుంది?
చంద్రబాబుగారి వంటి సిగ్గుమాలిన వ్యక్తితో రాజకీయాలు చేయాల్సి వస్తున్నందుకు మేము కూడా సిగ్గు పడుతున్నాం. ఇకనైనా ఇలాంటివి కట్టిపెట్టాలని కోరుతున్నాం.
ప్రశ్నలకు జవాబుగా..
వారు కలిశారు. ఆయన మాట్లాడారు:
అఖండ సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమా ప్రొడ్యూసర్లు.. నూజివీడు ఎమ్మెల్యే వెంకట ప్రతాప్రావు ద్వారా హైదరాబాద్‌లో ఉంటున్న ఒక బిల్డర్ నారాయణప్రసాద్ ద్వారా నన్ను కలుస్తామని చెప్పారు. నా వెంట పడ్డారు. అందుకు రెండు, మూడు డేట్లు కావాలని అడిగారు. అది విచిత్రంగా ఉన్నప్పటికీ రెండు డేట్లు ఇచ్చాను. ఆ టైమ్‌కు ఆ సినిమా ప్రొడ్యూసర్లు విజయవాడ ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో కలిశారు. ఆ తర్వాత బాలకృష్ణ కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. సీఎంని కలుస్తానన్నారు. నేను ఆ విషయం సీఎంకి చెబితే.. బాలకృష్ణ తనను కలిస్తే రాజకీయం చేస్తారు కాబట్టి, నన్నే డీల్ చేయమని సీఎం చెప్పారు. ఇది వాస్తవమా? కాదా? చెప్పండి.
దిక్కుమాలిన రాజకీయాలు:
చంద్రబాబువి అన్నీ దిక్కుమాలిన రాజకీయాలు. వ్యవస్థను పాడు చేయడంలో ఆయనకన్నా దిగజారి వ్యవహరించే వారు ఎవరున్నారు చెప్పండి. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఒక ఎమ్మెల్యే చొక్కా పట్టుకుంటే కేసు కూడా లేకుండా మాఫీ చేసింది ఎవరు? ఒక మహిళా ఎమ్మార్వోను ఒక ఎమ్మెల్యే జుట్టు పట్టి ఈడిస్తే, ఆమెనే పిలిపించిన చంద్రబాబు బెదిరించారు. ఇవాళ కూడా ఒక సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్మించాలని కోరుతున్నారు. అలా ఎవరైనా వ్యవహరిస్తారా?
త్వరలోనే సినిమా టికెట్ల జీఓ వస్తుంది. కమిటీ నివేదిక, అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునే ఆ జీఓ జారీ చేస్తాం.. అని మంత్రి శ్రీ పేర్ని నాని వివరించారు.