Suryaa.co.in

Andhra Pradesh

బాబూ…వాట్ ఈజ్ యువర్ స్టాండ్..?

– కొత్త జిల్లాలకు చంద్రబాబు అనుకూలమో.. వ్యతిరేకమో చెప్పాలి
– రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాబు అనుకూలమా.. వ్యతిరేకమా..?
– గిరిజనుల అభ్యున్నతి కోసమే రెండు జిల్లాలు ఏర్పాటు
– రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసమే 3 రాజధానులు, 26 జిల్లాలు
– ఎన్నికల హామీలో భాగంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు
– ఉద్యోగుల సమస్యకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముడి పెట్టడమంటే… కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే
– మంత్రి అవంతి శ్రీనివాస్

రాష్ట్రాభివృద్ధిని కాక్షించే వారంతా స్వాగతించాలి
గత రెండున్నరేళ్ల నుంచి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే దిశగా, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించడం, ఆ కొత్త జిల్లాలకు మహానుభావుల పేర్లు పెట్టడం ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులంతా కూడా స్వాగతించాల్సిన విషయం ఇది.

ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఉన్న 13 జిల్లాల్లో చివరిగా ఏర్పడిన జిల్లా విజయనగరం జిల్లా. విశాఖజిల్లాను తీసుకుంటే ఒక పక్కన సిటీ, మరోవైపు గ్రామీణ ప్రాంతం, మరోవైపు ఏజెన్పీ ప్రాంతం ఉంది. కొయ్యూరు నుంచి ఇక్కడకు రావాలంటే సుమారు అయిదారు గంటలు పడుతుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.

మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన, ఇవ్వని హామీలను సుమారు 30 పథకాలకు పైగా అమలు చేయడం, ఎన్నో రకాల ప్రభుత్వ సేవలను అందచేయడం జరుగుతోంది. అవన్నీ కూడా సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా అందిస్తున్నాం. ఎక్కడా అవినీతి అన్నదే లేకుండా పూర్తి పారదర్శకంగా, వివక్ష లేకుండా పరిపాలన జరుగుతుంది.

జిల్లాల ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం మీద అదనపు భారం పడినా కూడా కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యం ఒక్కటే కాకుండా, అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కూడా అన్ని జిల్లాలకు రావడానికి అవకాశం ఉండటంతో తద్వారా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయి.

నూతన జిల్లా ఏర్పాటు అంటే కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలే అనుకుంటున్నారని, వాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ప్రతి జిల్లాకు దామాషా ప్రకారం కేటాయింపులు వస్తాయి. ఒకటి అభివృద్ధి వికేంద్రీకరణ. రెండోది అధికార వికేంద్రీకరణ. వీటితో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం తప్ప మరో రాజకీయ ఉద్దేశం ఇందులో లేదని మనవి చేస్తున్నాం.

ఎన్నికల హామీలో భాగంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు
ఎన్నికలకు వెళ్లేముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ఇస్తుంది. ఇచ్చిన మేనిఫెస్టోలో 97శాతం హామీలు అమలు చేసిన పార్టీ వైయస్సార్‌ సీపీనే. వాగ్దానాలను అమలు చేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. ఎన్నికల హామీలో భాగంగానే ఈ జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల ఏర్పాటు చేసినప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులు రకరకాలుగా, చిలువలు పలువలు చేసి మాట్లాడటం బాధాకరం. కొంతమంది డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని, మరికొంతమంది జన గణన పూర్తి కాకుండా కుదరదని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇబ్బంది అవుతుందని, మరికొందరేమో జిల్లాల మధ్య అసమానతలు వస్తాయని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్ని పక్కదారి పట్టించే యత్నమే తప్ప మరొకటి కాదు. ఇటువంటి రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు చెబుతున్నాం.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా పరిపాలన చేసుకుంటున్నారు. కానీ దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతిదానికీ రాజకీయ రంగు పులమడం, కుట్రలు పన్నడం, అడ్డుకోవడం, హేళన చేయడం చేస్తున్నారు. అప్పట్లో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా చాలామంది మూడేంటి 30 రాజధానులు పెట్టండి అని హేళన చేశారు. ఇప్పుడు కొత్త జిల్లాలంటే హేళన చేస్తున్నారు. ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా, ప్రతిదాన్ని హేళన చేయడం, కోడిగుడ్డు మీద ఈకలు పీకడం, రాజకీయంగా ఏదో బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు.

బాబూ… వాటీజ్‌ యువర్‌ స్టాండ్‌?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. కాకుంటే జిల్లా పేర్లు స్థానిక ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా పెట్టుకోవాలని సూచించారు. అలాగే చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుకూలమా? వ్యతిరేకమా? అని అడుగుతున్నాం. వాటీజ్‌ యువర్‌ స్టాండ్ అనేది టీడీపీ చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అయోమయం, కన్ఫ్యూజన్‌, ఇల్యూజన్‌లో ఉంటాడు. కొత్త జిల్లాల ఏర్పాటును 99 శాతం ప్రజలందరూ స్వాగతించారు. ఇక చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అధిగమిస్తాం. ఒక్క చంద్రబాబు నాయుడు మినహాయించి.
చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అనుకూలమా? వ్యతిరేకమా?. జిల్లాల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 26 జిల్లాలు చేయాలని నిర్ణయించాం. అందుకు అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. తప్పనిసరిగా నిధులు తీసుకువస్తాం. అన్ని జిల్లాల్లో వసతులు సమకూర్చుతాం, అభివృద్ధి చేస్తాం.

గిరిజనులంటే సీఎం జగన్కి ప్రత్యేకమైన అభిమానం
ముఖ్యంగా విశాఖ జిల్లా తరపున, జిల్లా ప్రజా ప్రతినిధుల తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యమంత్రి మొదటి నుంచి గిరిజనులు అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ. అందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతంలో రెండు జిల్లాలు ఏర్పాటు చేయడం గొప్పవిషయం. విస్తీర్ణం విషయంలోనూ చాలా పెద్దవి. అరకు పార్లమెంట్‌ పెద్దది కాబట్టి దాన్ని రెండు జిల్లాలుగా చేశారు. విశాఖకు మూడు జిల్లాలు ఉండటం చాలా గొప్ప విషయం.అలానే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్‌ స్థానాలు ఉన్న విశాఖ జిల్లా… మూడు జిల్లాలు అయితే అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని విశాఖ ప్రజలంతా హర్షిస్తున్నారు. అలాగే మన్యం ప్రజలు కూడా మహానుభావుడు, బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో నిద్రపోయిన మొదటితరం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దీన్ని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే అందరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఈ ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రికి గానీ ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించవద్దు అని మనవి చేస్తున్నాం.

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని, ఎన్టీఆర్‌ను పార్టీలకు అతీతంగా చాలామంది అభిమానిస్తారు. ముఖ్యమంత్రి జగన్ కి విశాలమైన మనసుఉంది కాబట్టే కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టారు. దాన్నిబట్టే అర్థం అవుతుంది, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి అహర్నిశలూ పనిచేస్తున్నారని. మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా అన్ని రంగాల్లో ముందుకువెళ్లాలని, ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే లక్ష్యమే. ఎక్కువ జిల్లాలు ఉండటం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధులు అన్ని జిల్లాలకు అందుతాయి.

మూడు రాజధానులు, 26 జిల్లాలు
ముఖ్యమంత్రిగారు మొదటి నుంచి చెప్పేది ఒక్కటే.. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని. అందులో భాగంగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖ అని ప్రకటించారు. ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రాష్ట్రానికి ఉపయోగమా.. కాదా.. అన్నది 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నచంద్రబాబు సమాధానం చెప్పాలి.

చెప్పటానికి, రాజకీయంగా ఆయనకు కొంత ఇబ్బంది ఉండవచ్చు. తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయింది, జగన్‌ మోహన్‌ రెడ్డి చేసి చూపించారని చంద్రబాబుకు బాధ ఉండవచ్చు. గతంలో సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చినప్పుడు కూడా ఇదే చంద్రబాబు, టీడీపీ వాళ్ళు హేళన చేస్తూ మాట్లాడారు. అవి ఉండబట్టే, కరోనా కష్టకాలంలో, ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ వేవ్‌ లు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. వ్యాక్సినేషన్‌ విషయంలోనూ మనమే ముందున్నాం. ఇలా ఏకార్యక్రమాన్ని అయినా విజయవంతంగా చేయగలిగాం.

మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అన్ని ప్రాంతాలు సమానమే. అన్నివర్గాలు సమానమే. అయితే చంద్రబాబు నాయుడుకు మాత్రం అంత మంచి మనసు లేదు. మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేనితనం, మంచిని అడుగడుగునా అడ్డుకోవడమే ఆయన నైజం. ఎంతసేపూ జగన్‌కి మంచి పేరు రాకూడదన్న దుగ్ధ తప్పితే.. రాష్ట్రానికి మంచి జరుగుతుందా.. లేదా.. అన్నది చూడటం లేదు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.

పరిపాలనలో సరికొత్త విధానాలు తీసుకురావడం వల్ల మా ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందిస్తుందని స్పష్టం చేస్తున్నాం. మేధావులు, రాజకీయ పక్షాలు, ఎవరికైనా సరే కొత్త జిల్లాల ఏర్పాటులో ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు ఉన్నా వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. మా ప్రభుత్వం ఏదిచేసినా పారదర్శకంగా చేస్తుంది. అర్థరాత్రి జీవోలు అంటూ విమర్శలు చేయడం సరికాదు. ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కానేకాదు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని జగన్ గారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు, ఎంతో కసరత్తు చేసే 26 జిల్లాల ప్రకటన జరిగిందన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఉద్యోగుల సమ్మెకు.. దీనికి ముడిపెట్టి రాద్ధాంతం చేయడం అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే. ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే.. అది చేసి తీరతారు అంతే. హామీలు ఇచ్చి వాటిని చెత్తబుట్టలో పడేసే విధంగా, చంద్రబాబులా పలాయనవాద రాజకీయాలు చేయం.

LEAVE A RESPONSE