-175 సీట్లలో అసలు సైకిల్ గుర్తు ఉంటుందా?
-మీకు అభ్యర్థులే దిక్కులేరు. మమ్మల్ని ఎలా ఓడిస్తావ్?
-పవన్ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లిస్తున్నావ్ చంద్రబాబూ..?
-బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్లకి ఎన్నిస్తున్నావ్..?
-చంద్రబాబూ కంగారెందుకు?
-ఉత్తర కుమార ప్రగల్భాలు చాలించు
-ఎవరు ఎవర్ని ఓడిస్తారో తేల్చుకుందాం
-సీపీఐ నారాయణ పార్టీని టీడీపీకి మార్టిగేజ్ చేశాడు
-బాబుకు వంత పాడటమే నయా కమ్యూనిస్టుల పని
-నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకే ఎవరెస్ట్ ఎక్కినంత హడావుడి
-వై నాట్ పులివెందుల అంటున్నారు కదా?
-దమ్ముంటే అక్కడ పోటీ చేయండి. తేలిపోతుందిగా?
-చంద్రబాబు, పవన్ ఇద్దరూ పోటీ చేసినా మాకు ఓకే
-అప్పులన్నీ చేసిన చంద్రబాబు ఇప్పుడు తప్పుడు మాటలు
-మేం వచ్చిన తర్వాత తెచ్చిన ప్రతి పైసాకు లెక్క ఉంది
-కానీ చంద్రబాబు చేసిన అప్పులకు లెక్కేది?
-ఆ పాపాలే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మోస్తున్నారు
-రాష్ట్ర ప్రభుత్వమూ భరిస్తోంది. ఇది వాస్తవం
-బీజేపీ వాళ్లు నిన్నేం చెప్పారు? ఇవాళేం వాగుతున్నారు?
-కర్నూలు డిక్లరేషన్ ఏమైంది? మర్చిపోయారా?
-గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఇçప్పుడేవి?
-ప్రెస్‌మీట్‌లో గట్టిగా నిలదీసిన మాజీ మంత్రిశ్రీ పేర్ని వెంకట్రామయ్య
ఆ దమ్ముందా?:
ఏప్రిల్ ఫస్ట్‌న చంద్రబాబు అసత్యాలు, దూషణలతో అలౌకిక అనందం పొందాడు. 175 సీట్లలో వైయస్సార్‌సీపీని ఓడిస్తాను అంటున్నాడు. అసలు 175 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు ఉంటుందా? ఫ్యాన్ గుర్తుపై అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? అలా పోటీకే దిక్కు లేని పరిస్థితి నీకుంటే మమ్మల్ని ఎలా ఓడిస్తావ్?. మూడు నెలల క్రితం పార్టీ వాళ్లందరినీ కూర్చోబెట్టుకుని సుమారు 38 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లు లేరని వాపోయిన దిక్కుమాలిన స్థితి చంద్రబాబుది. కాబట్టి ఆ 38 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెతుక్కో చంద్రబాబూ. కంగారెందుకు మరో ఏడాది ఉంది కదా?
ఎవరెవరికి ఎన్నెన్ని?:
175 నియోజకవర్గాల్లో పవన్‌కళ్యాణ్‌కు ఎన్నిస్తున్నావు? బీజేపీలో ఉంటూ మీ పార్టీ జెండా మోస్తున్న సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి, సుజనాచౌదరి వంటి వారికి ఎన్ని సీట్లు ఇస్తున్నావ్? పేరుకేమో ఎర్ర జెండా. దాన్ని పసుపు రంగులో ముంచి భుజాన వేసుకుని తిరుగుతున్న నారాయణకు ఎన్ని సీట్లు ఇస్తావ్? నిజానికి నారాయణను నమ్మి కమ్యూనిస్టులు పెత్తనం అప్పజెప్తే ఆయన తన పార్టీని టీడీపీకి మార్టిగేజ్ చేశాడు. ఇంకా రాహుల్‌గాంధీకి ఎన్నిస్తున్నావు? ముందు ఈ క్లారిటీ నీకుందా?.
ఉత్తరకుమార ప్రగల్భాలు:
ఇంత మందిని పోగేసుకుంటే కానీ జగన్‌గారి మీద పోటీకి వచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు. అయినా 75 ఏళ్ల వయసులో ఆయన ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంకా అబద్ధాలు, అసత్యాలు, ప్రగల్భాలు, మసిపూసి మారేడుకాయ చేయడం, ఏమార్చటాలు.. ఈ వయసులోనూ ఆయన వీడ లేదు. 175 చోట్లా పోటీ చేసే దమ్ము లేదు. పోటీ చేసే స్తోమతా లేదు. పది మందిని కలుపుకుంటే కానీ పోటీ చేసే సాహసం చేయలేని దుస్థితి చంద్రబాబుది. కొడుకు కలిసి రాడు. జనం మొచ్చుకోరు. అందుకే దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బావమరిది బాలకృష్ణతో తిరిగి.. సినిమా డైలాగ్‌లు రాయించుకుని పంచ్ డైలాగులు వదులుతున్నాడు.
అక్కడ పోటీ చేయండి. తేలిపోతుంది:
‘వైనాట్ పులివెందుల?’ అంటున్నారు కదా. అలా అనే వారందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. పులివెందులలో జగన్‌గారు ఓడిపోతారని కలలు కనే వారంతా వచ్చి పోటీ చేయండి. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్.. ఎవరైనా సరే పులివెందులలో పోటీ చేయవచ్చు. కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల చేతిలో ఓడిపోవడం ఎందుకు? పులివెందులలోనే పోటీ చేయండి. అక్కడ ఇద్దరూ పోటీ చేసినా ఫరవాలేదు. లేదు. ఎవరో ఒకరు పోటీ చేసినా సరే. మీరో.. మేమో తేలిపోతుంది కదా?
నాలుగింటికే ఎందుకంత హడావిడి?:
మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే చంద్రబాబు గెలిచింది కేవలం నాలుగు. గ్రాడ్యుయేట్స్‌లో మూడు, అసెంబ్లీలో ఒకటి తెలుగుదేశం గెల్చింది. 21 స్థానాల్లో కేవలం నాలుగు గెలిచి చంకలు గుద్దుకోవడం ఏమిటో? దానికే ప్రపంచాన్ని జయించినట్లు, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు చంద్రబాబు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు.
అద్దె మైకుగాళ్ల అసభ్య పదజాలం:
తన వంధిమాగదులతో జగన్‌గారిని అసభ్యంగా, వ్యక్తిగతంగా, నీచంగా దుర్భాషలాడించడం చంద్రబాబు నైజం. మందడంలో టెంట్ రోజూ ఖాళీగానే ఉంటుంది. ఫ్యాన్సీ నంబర్ వచ్చినప్పుడు మాత్రం సందడి చేయడం అలవాటుగా మారింది. అక్కడికి అద్దె మైక్‌గాళ్లు వచ్చి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. అమరావతి పేరుతో జరిగిన సభలో జగన్‌గారిపై కారుకూతలు కూయడం ధర్మమా? అని ఎల్లో మీడియాను అడుగుతున్నాను.
నిజంగా బీజేపీ వాళ్లేనా?:
వాళ్లు నిజంగా బీజేపీ వాళ్లేనా? పది దొడ్లు మారి వచ్చారు. బీజేపీ కర్నూలు డిక్లరేషన్, గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయి? కర్నూలు డిక్లరేషన్‌లో బీజేపీ కోరిందేమిటి? ఈరోజు ఆ పార్టీ చేస్తున్నదేమిటి?
ఆ డిక్లరేషన్‌లో ఏముంది?:
ఏపీ రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలనేది అందులో మొదటి డిమాండ్‌గా పెట్టారు. వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలన్నారు. కర్నూలులో అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరు నెలలకోసారి కర్నాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. సెక్రటేరియట్, తదితర శాఖల భవనాలు ఏర్పాటు చేయాలని, సీఎం నివాస భవనం కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇంకా గవర్నర్ తాత్కాలిక విడిది నివాసం కూడా అక్కడ ఉండాలన్నారు.
సిగ్గు, శరం లేవా?:
బీజేపీ కర్నూలు డిక్లరేషన్‌లో ఉన్నట్లు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామనే కదా జగన్‌గారు చెబుతున్నారు. మరోవైపు పవన్‌కళ్యాణ్ కూడా గత ఎన్నికల ముందు ఏమన్నాడు? తన మనసుకైతే తమ ప్రభుత్వం వస్తే కర్నూలే రాజధాని అని ఆ నగర పర్యటనలో అన్నాడు. అలాగే విశాఖ వెళ్లి ఈ ప్రాంతం రాజధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న నగరం అన్నాడు. మరి ఇప్పుడు బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? అందుకే బీజేపీ నాయకుల వ్యవహారం ఎలా ఉందనేది ప్రజలు గమనించాలి. పువ్వు గుర్తు వారికి సిగ్గు శరం లేవా?. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి అత్యంత సారవంతమైన భూములు తీసుకుందని, కానీ అమరావతి నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లా నడుస్తోందన్న బీజేపీ.. తాము అధికారంలోకి వచ్చాక అడిగిన ప్రతి ఒక్కరికీ ఆ భూములను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. అదే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అలాగే దళిత రైతులకు జరిగిన అన్యాయాన్ని రూపుమాపి న్యాయం చేస్తామన్నారు.
కనీస స్పృహ కూడా లేదు:
నిన్న ఏం చెప్పాం. ఈరోజు ఏం వాగుతున్నాం. అన్న కనీస స్పృహ కూడా బీజేపీ నాయకులకు లేకుండా పోయింది. రాజధాని నిర్మాణం కోసం తొలి ఏడాదే కేంద్రం రూ.1500 కోట్లు ఇస్తే, ప్రభుత్వం నాలుగేళ్లు గడిచినా కనీసం ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. అలివి కాని కోర్కెలు, వాస్తవ విరుద్ధ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి రాజధాని నిర్మాణాన్ని పక్కదోవ పట్టించిందని బీజేపీ మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. అవన్నీ మర్చిపోయిన ఈ సొల్లుగాళ్లంతా అమరావతి సభలకు వచ్చి చేస్తుందేమిటి?.
ఎర్ర జెండాకు ద్రోహం కాదా?:
కమ్యూనిస్టులు సాధారణంగా పేదవాళ్లకు కొమ్ముకాస్తారు. పేదలకు కూడు, గూడు, బట్ట ఉండాలని జెండా ఎత్తుకుంటారు. కానీ ఇక్కడ నయా కమ్యూనిస్టులు వచ్చారు. చంద్రబాబుకు వంత పాడటమే వారి పని. వారి చేష్టలకు అసలైన కమ్యూనిస్టు కార్యకర్తలు బాధ పడుతున్నారు. ఎంతో మంది ఆత్మత్యాగంతో రెపరెపలాడిన కమ్యూనిస్టు జెండాను తెలుగుదేశం కోసం తాకట్టు పెట్టడం చూసి నిజమైన కమ్యూనిస్టు గుండెలు విలపిస్తున్నాయి. భూస్వాములు, పెట్టుబడిదార్లకు ఇక్కడి సీపీఐ నాయకత్వం వంత పాడుతోంది. ఇందులో ఆ పార్టీ కార్యకర్తలను తప్పు పట్టడానికి ఏమీ లేదు. నాయకులే తమ పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారు. ఇది ఎర్ర జెండాకి ద్రోహం చేయడం కాదా? కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తూట్లు పొడవటం మీ దిగజారుడు రాజకీయాలు కాదా? అనేది ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.
ఆయనను ఎవరూ కదపలేరు:
ప్రజల గుండెల్లో జగన్ స్థానాన్ని ఎవ్వరూ కదపలేరు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని పార్టీలను మూటగట్టుకుని వచ్చినా జగన్ కి ప్రజల గుండెల్లో ఉన్న స్థానాన్ని కదపలేరు. 2024లో కూడా మళ్లీ జగన్‌గారి ప్రభుత్వం రాబోతుంది.
ఆ దాడిని ఖండిస్తున్నాం:
అమరావతి ప్రాంతంలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని బహుజన పరిరక్షణ సమితి ఉద్యమం చేస్తోంది. బీజేపీ ముసుగులో టీడీపీ జెండా మోస్తున్న సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి అక్కడి దళితులపై చేసిన దాడిని ఖండిస్తున్నాం. చంద్రబాబు పంచన ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి దళితులను ఎలా అవమానించాడో అందరికీ గుర్తుంది.
అప్పుల బాబు. తప్పుడు మాటలు:
అప్పులన్నీ చేసిన చంద్రబాబు ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణాలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని, ఇక్కడ అస్సలు పెరగలేదని ఆయన అంటున్నారు. మరి ఆయన ప్రభుత్వం దిగి పోయే నాటికి.. అంటే 2019లో తెలంగాణా, మన రాష్ట్ర తలసరి ఆదాయంలో తేడా ఉందా? లేదా? అన్నది చెప్పాలి. మీ హయాంలో తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం ఏ మాత్రం పెరగలేదు. అయినా ఏ మాత్రం సిగ్గు బిడియం లేకుండా చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అప్పుల గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.
ఆ అప్పులకు లెక్కేది?:
అయితే మేం తెచ్చిన ప్రతి పైసాకు లెక్కుంది. కానీ చంద్రబాబు చేసిన అప్పుకు లెక్కేది?. నీరు–చెట్టు కార్యక్రమం, జన్మభూమి కమిటీలంటూ పప్పుబెల్లాల్లా కార్యకర్తలకు పంచిపెట్టి దోచుకుతిన్నది చంద్రబాబే. ఆ పాపాలు ఇప్పుడు ఇక్కడి ప్రజలతో పాటు, ప్రభుత్వం మోస్తోంది. అందుకే ఇకనైనా తప్పుడు మాటలు కట్టిపెట్టి నిజాయితీ రాజకీయాలు చేయాలని చంద్రబాబుకు సూచిస్తున్నా.