– ఎన్జీటీలో కేసులు చంద్రబాబు పుణ్యమే:
– వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం
తాడేపల్లి: రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబుకి పాలించే అర్హత లేదని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన రాయలసీమకు మరణశాసనం రాశారని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రకటనతో, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు ఆపేసిన చంద్రబాబు కుట్ర బట్టబయలైందని ఆయన తెలిపారు.
అంతకు ముందు కూడా పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల ద్వారా ఏపీకి దక్కాల్సిన నీటిని తెలంగాణకు అప్పటి సీఎం కేసీఆర్ తరలించుకుపోతున్నా చంద్రబాబు నోరెత్తలేదని గుర్తు చేశారు. అందుకే అప్పటి పరిస్థితి గుర్తించి, నాటి విపక్షనేత శ్రీ వైయస్ జగన్ కర్నూలులో జలదీక్ష చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొరుముట్ల శ్రీనివాసులు చెప్పారు.
కృష్ణా నదికి వరద సమయంలో రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఈ ప్రాంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మాజీ సీఎం వైయస్ జగన్ ముందడుగు వేశారు. రూ.7 వేల కోట్ల వ్యయంతో 2020లో రాయలసీమ లిప్టు ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించి 2024లో వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 85 శాతం పనులు పూర్తి చేశారు. కానీ 2024 అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పెండింగ్ పనులు పూర్తి చేయకుండా పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు.
రాయలసీమలోనే పుట్టిన చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం, చివరకు ఆ ప్రాంత రైతులనే దగా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే జగన్‌గారికి మంచి పేరొస్తుందనే కుట్రతో ఆనాడే ప్రాజెక్టును అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో తన వారితో కేసులు వేయించారు. మరోసారి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో చంద్రబాబు కుట్ర బట్టబయలైంది. కేవలం తన ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమకు మరణశాసనం రాసిన ఘనుడు చంద్రబాబు.