Suryaa.co.in

Andhra Pradesh

బాధితుల బాధలు తీరుస్తున్న బాబు ‘టెక్నాలజీ’

– వరద విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం దేశానికే ఆదర్శం
– ఆహారం, నీరు, మందులను సుదూర గృహాలకు చేర్చడంలో డ్రోన్ల సేవలు భేష్
– బుడమేరు గండ్లను పూచే పనుల్లోనూ కీలక పాత్ర పోషించిన డ్రోన్ సాంకేతికత
– పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అయిన డ్రోన్లు
– డ్రోన్లు, రోబో జాకెట్లు, ఏఐ, డేటా ఆనలిటిక్స్.. సాంకేతికత సహకారంతో సహాయక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కార్యదక్షత చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– భవిష్యత్తుకు గొప్ప పాఠాలుగా నిలిచిన వరద విపత్తు నిర్వహణ, సహాయక చర్యలు

విజయవాడ: బుడమేరు వరద విపత్తు నిర్వహణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాదాపు ఏడు లక్షల మంది వరద బాధితులను రక్షించుకునే ప్రయత్నం చేయడం అత్యద్భుతం.

ప్రతి వార్డు ముంపులో ఉన్న సమయంలో సుదూరంగా ఉన్న ఇళ్లకు కూడా ఆహారం, నీళ్లు, మందులు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయంలో ఉపయోగించే పిచికారి డ్రోన్లను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డా. పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రోన్ నిపుణుడు, సీనియర్ శాస్త్రవేత్త, డా. ఎ.సాంబయ్య టీంతో అప్పటికప్పుడు 115 వ్యవసాయ డ్రోన్లను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ సహకారం, సమన్వయంతో మార్పు చేయించి విపత్తుల నిర్వహణకు వాడటం ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

10 కిలోల బరువును మోయగల డ్రోన్లను ఉపయోగించి ఇప్పటివరకు దాదాపు లక్ష 30 వేల మందికి ఆహారపు పొట్లాలు, నీళ్లు, మందులు అందించడం జరిగింది. అదేవిధంగా దాదాపు మూడు కెమెరా డ్రోన్లతో కొండపల్లి దగ్గర బుడమేరు గట్టు గండ్లను మంత్రి నారా లోకేష్ అనునిత్యం పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమన్వయంతో ఇరిగేషన్ అధికారులకు సూచనలిస్తూ త్వరితగతిన బుడమేరు గండ్లను పూడ్చి, వరద నీటిని నియంత్రించడంలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి.

ఇవే కాకుండా మరో 17 కెమెరా డ్రోన్లను వివిధ వరద ముంపు ప్రాంతాల్లో తిప్పుతూ ఎప్పటికప్పుడు ఎంత మేరకు నీరు తగ్గుతుంది? ఎక్కడెక్కడ నీరు పెరుగుతుంది? ఎక్కడ ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవడంలోని డ్రోన్ల పాత్ర కీలకం. పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ డ్రోన్లు ఉపయోగపడ్డాయి. అంటువ్యాధుల వ్యాపించకుండా స్ప్రేయింగ్ చేసేందుకు ఇది దోహదం చేశాయి. వరద విపత్తు సమయంలో వివిధ సహాయ కార్యక్రమాలకు డ్రోన్ టెక్నాలజీని వాడటం దేశానికే గర్వకారణం.

ప్రజా ప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం

వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ సమన్వయంతో వైద్య వ్యవస్థను క్రియాశీలం చేసి ముంపునకు గురైన ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడం జరిగింది. పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమన్వయంతో డ్రోన్లను ఉపయోగించి వివిధ క్రిమిసంహారక మందులను వీధుల్లో చల్లిస్తూ 31 వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయించడం, మరోవైపు క్రస్ట్ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు సాంకేతిక సలహాలు, సంప్రదింపులతో ప్రకాశం బ్యారేజ్ కి కౌంటర్ వెయిట్ కు త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టటం, బుడమేరు వరదకు సంబంధించిన విపత్తు నుండి ప్రజలను రక్షించుకుంటూ ఎప్పటికప్పుడు డేటా సెంటర్లకు డేటాను తెప్పించుకొని డేటా అనలటిక్స్ తో నిర్ణయాలు తీసుకుంటూ సమర్థమైన, సమగ్రమైన విపత్తు నిర్వహణ చేపట్టటం భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమన్వయంతో విపత్తు ప్రాంతంలో నిరంతర ఆహారం తదితరాల సరఫరా కోసం పోలీస్ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం జరిగింది. రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమన్వయంతో రెవిన్యూ శాఖ అధికారులు వివిధ రకాల నష్టాల అంచనాలను వేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది.

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమన్వయంతో విపత్తు నిర్వహణకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.. ఇలా గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాత్రింబవళ్లు పనిచేస్తూ సమష్టి కృషితో ప్రజలకు అండగా నిలుస్తున్నారు.ఇలాంటి సమర్థమైన విపత్తు నిర్వహణ మన రాష్ట్రానికే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శనీయం.

డ్రోన్లు, రోబో జాకెట్లు, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా రకరకాల డిజిటల్ అప్లికేషన్స్ ను ఒకవైపు వరద నియంత్రణ చర్యల్లోనూ మరోవైపు ప్రజలను ఆపద నుంచి గట్టెక్కించే సహాయక చర్యల్లోనూ ఉపయోగించడం అనేది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవానికి, కార్యదక్షతకు నిదర్శనం.

LEAVE A RESPONSE