– పాప బతుకు ఆధారమైన పెన్షన్ తీసేసిన జగన్ రెడ్డి
– నారా లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెని చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని 2016లో తల్లిదండ్రులు పెట్టుకున్న మెర్సీ కిల్లింగ్ పిటిషన్ గుర్తుందా? చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం ఆర్.ఎస్.కొత్తపల్లికి చెందిన జ్ఞానసాయి అనే బాలిక కాలేయ సమస్యతో బాధపడగా, చికిత్సకి 40 లక్షలకి పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు.
అంత స్థోమత లేని రమణప్ప డబ్బు కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇక తన పాపని బతికించుకోలేనని మెర్సీ కిల్లింగ్‌కి అనుమతి కావాలంటూ మీడియా ద్వారా విన్నవించాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి సర్కారు ఖర్చుతో వైద్యం చేయించాలని ఆదేశించారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేసిన 40 లక్షలతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించి జ్ఞానసాయిని కాపాడారు.
9 నెలల వయస్సు లో ఆపరేషన్ జరిగిన తరువాత చిన్నారి జ్ఞానసాయి మందులకి, నెలనెలా పరీక్షలకి లక్షల్లో ఖర్చు కాగా టిడిపి ప్రభుత్వం సాయం అందించారు. పాప పెరిగి పెద్ద అయ్యింది. నాడు సీఎం చంద్రబాబు చేసిన సాయంతోనే తమ పాప జ్ఞానసాయి ప్రాణాలతో నిలిచిందని లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది రమణప్ప కుటుంబం.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాంట్రాక్టు జాబ్ కూడా ఇప్పించారని, వైసీపీ వచ్చాక అదే జాబ్ కారణంగా తన పాప జ్ఞానసాయి, తల్లికి వచ్చే పెన్షన్లు నిలిపేశారని రమణప్ప లోకేష్ ఎదుట వాపోయాడు. ఇప్పటికీ పాప మందులకి నెలకి 20 వేలు అవుతోందని, ఇది తమకి చాలా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ తరఫున వీలైన సాయం చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.