స్పీకర్ ఆఫీసు వారు ఎంతో ప్రేమతో మొదటి అంతస్తులో 11వ నెంబర్ రూమ్ కేటాయించగానే, మన వైకాపా ఎంపీలకి చెమటలు పట్టేశాయి. “సార్.. మాకు ఆ రూమ్ తాళం వద్దు, ఆ నెంబర్ బోర్డు అస్సలే వద్దు! ఆ అంకె చూస్తుంటే మాకు అసెంబ్లీలో పడ్డ సీట్లు గుర్తొచ్చి కన్నీళ్లు ఆగడం లేదు” అని మొరపెట్టుకున్నారట.
“అవసరమైతే వరండాలో కూర్చుంటాం కానీ, ఆ 11వ నెంబర్ గదిలోకి మాత్రం అడుగుపెట్టం” అని భీష్మించుకు కూర్చున్నారట. 11 అంటే అది కేవలం సంఖ్య కాదు.. అది ఒక చేదు జ్ఞాపకం! అందుకే వెంటనే ఆ రూమ్ మార్చాలని కండీషన్ పెట్టారు. వారి ఆవేదన చూసి స్పీకర్ గారు మనసు కరిగించుకుని, వెనువెంటనే 12వ నెంబర్ గది ఇచ్చారట.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. పక్కనే టీడీపీకి 9వ నెంబర్ రూమ్ ఇచ్చారు. “వారికి అదృష్ట నవరత్నాల సంఖ్య ఇచ్చి, మాకు మాత్రం ఈ ‘అసెంబ్లీ కౌంట్’ ఎందుకు సార్?” అన్నది వైసీపీ నేతల అంతర్గత మధనం.
రూమ్ నెంబర్ మారితే రాత మారుతుందో లేదో తెలియదు కానీ, అంకెలకు భయపడే స్థాయికి రాజకీయం చేరిందంటే.. ఆ ’11’ కి ఉన్న పవర్ అలాంటిది మరి!