– విశ్వహిందూ పరిషత్
సమస్త హిందూ యువకుల ఐక్యత కోసమే భజరంగ్ దళ్ నిర్విరామంగా కృషి చేస్తోందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. యువతలో దైవభక్తి, దేశభక్తి నింపి ధర్మ వీరులను తయారు చేస్తోందని చెప్పింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్ చందర్ విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ ఆరవ తేదీన భాగ్యనగర్ లో నిర్వహించే “వీర హనుమాన్ విజయ యాత్ర – హిందూ శక్తి ప్రదర్శన” కు సంబంధించిన గోడపత్రికలు వారు విడుదల చేశారు.
సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,600 స్థలాల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమాన్ జయంతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. భాగ్యనగర్ లో దాదాపు 3 లక్షల మంది యువకులతో రికార్డు స్థాయిలో భారీ ర్యాలీ కొనసాగుతుందన్నారు. కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో లక్ష మందితో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి రికార్డు సృష్టిస్తామన్నారు.
ఈ వైభవో పేతమైన కార్యక్రమానికి ప్రముఖ స్వామీజీలతోపాటు బజరంగ్ దళ్ జాతీయ కన్వీనర్ నీరజ్ దునేరియా ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమానికి భాగ్యనగరంలోని యువకులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. భాగ్యనగర్ మహానగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 139 స్థలాల నుంచి బజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీకి తరలివస్తారని పేర్కొన్నారు. మొత్తం సంఖ్య 3 లక్షలకు చేరుతుందన్నారు.
గౌలిగూడ రామ్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి మహా ర్యాలీని ప్రారంభిస్తామని, సికింద్రాబాద్ లోని తాడ్ బాండ్ హనుమాన్ దేవాలయానికి చేరుకొని యాత్ర ముగిస్తుందన్నారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర సాగే ఈ ర్యాలీకి హిందూ యువకులు భారీ ఎత్తున తరలిరావాలని వారు హిందూ యువతకు సూచించారు. కులాలు వర్గాలు వైశ్యామ్యాలకు, ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా హిందూ యువకులంతా కదలిరావాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలో బజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ శక్తి ప్రదర్శన ర్యాలీలో వైభవంగా నిర్వహిస్తారని వివరించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు కమల్ వీరేష్, సాయం మహేష్ యాదవ్, అఖిల్, బిరాదర్ రాము, భరత్ వంశీ, సునీల్, రాము, ఉదయ్, రామ్ రెడ్డి, తిరుపతి, శ్రీను, భాను, తదితరులు పాల్గొన్నారు.