– సీఎం సమక్షంలో కొత్త పిఆర్సీకి చప్పట్లు కొట్టిన ఉద్యోగ నాయకులు ముందుగా ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలి
– రెండు చేతులతో ఓట్లేశామన్న నాయకులు నాయకత్వం నుంచి తప్పుకోవాలి
– ఉద్యోగులు ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఆయా రాజకీయ పార్టీలకు కాదు
– 23 శాతం పిఆర్సీ తో పాటు 62 ఏళ్ళ వయో పెంపు ను, జగన్నన్న స్మార్ట్ సిటీ రాయితీలను తిరస్కరించాలి
– తోటి ప్రజా ఉద్యమాలకు సానుభూతిని తెలిపితేనే సంఘీభావం అడిగే అర్హత ఉంటుంది
– అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
రాష్ట్రం అంటే ఉద్యోగ సంఘాలు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలు అంటే ఉద్యోగులు ఒక్కరే కారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఉద్యోగ పిఆర్సీ సాధన జెఎసికి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
అయితే రెండున్నరేళ్లుగా ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి సమస్యల పరిష్కారం కోసం ఆయా వర్గాల వారు రోడ్లపైకి వచ్చారని చెప్పారు. ఒకే రాష్ట్రం…ఒకే రాజధాని నినాదంతో ప్రజా రాజధాని అమరావతి రైతులు 750 రోజులుగా ఉద్యమం చేస్తున్నారని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు 300 రోజులు పైగా ఉద్యమిస్తున్నారని, భవన నిర్మాణ కార్మికులు ఇసుక కోసం, ఉపాధి కోసం ఉద్యమాలు చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు వారి సంక్షేమ పథకాలను తుంగలో తొక్కినందుకు, వారిపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ మొత్తం ఉద్యమాల సంఘటనల్లో ప్రధానమైన ఉద్యోగ సంఘాల నాయకులు కనీసమైన సానుభూతిని కూడా వ్యక్తం చేయలేదని, పైగా ప్రభుత్వం తరఫున వకల్తా ప్లీడరుల్లా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. సీఎం సమక్షంలో జరిగిన కొత్త పిఆర్సీకి జేజేలు పలికిన ఉద్యోగ నాయకులు ముందుగా సాధారణ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. రెండు చేతులతో ప్రభుత్వాన్ని గెలిపించామని నోరుపారేసుకున్న నాయకులు నాయకత్వం నుంచి వైదొలగాలని హితవు పలికారు.ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో చులకన భావం ఉందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేయాలని చెప్పుకునే సంఘాల నాయకులు ఆయా రాజకీయ పార్టీలకు ఊడిగం చేసి, భారీగా జీతాలు పెంచుకుంటారని ప్రజల్లో గుర్తింపు పొందారని గుర్తు చేశారు.
ఉద్యోగులు ప్రజలకు మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలని కోరారు. ఉద్యోగులు న్యాయమైన జీతాల కోసం అడగటంలో తప్పులేదని, కానీ ఏ ఉపాధి లేని నిరుపేదల పోరాటాలకు, ఇతర ఉద్యమాల పట్ల కనీసమైన సంఘీభావం తెలపాల్సిన బాధ్యతను ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. 23శాతం పిఆర్సీ తో పాటు 62 ఏళ్ళ వయో పెంపును, జగన్నన్న స్మార్ట్ సిటీ లో రాయితీలను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.కొత్త పిఆర్సీ వద్దు, పాత పిఆర్సీనే ముద్దు అని అంటున్న ఉద్యోగులు మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటున్న రాజధాని రైతు ఉద్యమాన్ని మర్చిపోకూడదని బాలకోటయ్య కోరారు.