తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కర్నే శిరీష( బర్రెలక్క)కు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య బాసటగా నిలిచారు. గత రెండు రోజులుగా ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి, అంబటి పల్లి, కొల్లాపూర్ ప్రాంతాలలో బర్రెలక్కతో పాటు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో మాట్లాడుతూ సాదాసీదా కుటుంబానికి చెందిన దళిత యువతి ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రధాన రాజకీయ పార్టీలను ఢీకొంటూ ఎన్నికల్లో నిలబడటాన్ని కొనియాడారు. తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆశలకు, ఆశయాలకు, ఆవేదనలకు ఆలంబనగా తన గొంతు వినిపిస్తున్న బర్రెలక్క ను కొల్లాపూర్ ప్రజలు ఓట్లేసి దీవించాలని పిలుపునిచ్చారు. గతంలో అతడే ఒక సైన్యం అనే మాటలు విన్నామని, ఇప్పుడు ఆమె ఒక సైన్యంలా కదులుతుందన్నారు.
రెండు రాష్ట్రాలతో పాటు ఎన్నారైలు కూడా మద్దతుగా నిలబడాన్ని ఆయన ప్రశంసించారు. ఎన్నికల్లో గెలుపోటములు సంగతి పక్కన పెడితే, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో సాధారణ వ్యక్తులు కూడా పోటీ చేసి ప్రజలను మేల్కొల్పవచ్చు అనే అంబేద్కర్ ప్రజాస్వామ్య రాజ్యాంగ సూత్రానికి బర్రెలక్క ప్రతీక అని బాలకోటయ్య అభివర్ణించారు.